top of page

చిలకపాలెం.. ఆ దారిలో పోలేం

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • రద్దీకి అనుగుణంగా డిజైన్‌ కాని ఫ్లైవోవర్‌

  • టిప్పర్లు, క్వారీలు, కాలేజీలు అన్నింటికీ అదే కేరాఫ్‌

  • అక్కడికక్కడే మూడుచోట్ల ఆటోస్టాండ్లు

  • ప్రమాదాలపాలవుతున్న పాదచారులు


(సత్యంన్యూస్‌, ఎచ్చెర్ల)

తక్కువ సమయంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిలకపాలెం ఒకటి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా మారిపోయింది. జాతీయ రహదారి విస్తరణ తర్వాత మరింత రద్దీగా తయారైంది. చిలకపాలెం పరిధిలో విద్యాసంస్థలు, మధ్యతరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రియల్‌ వ్యాపార కేంద్రం కావడంతో రోజు రోజుకు జంక్షన్లో ట్రాఫిక్‌ పెరగడంతో స్థానికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన వాహనాలు, బస్సులు, గ్రావెల్‌, చిప్స్‌ క్వారీల నుంచి టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ రాకపోకలతో నిత్యం రద్దీ కొనసాగుతుంది. ఈ వాహనాలన్నీ ఈ కూడలి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. విశాఖపట్నం, ఒడిశా వైపు వెళ్లే ప్రయాణీకులు ఈ కూడలిని ఆశ్రయించి ప్రయాణాలు సాగిస్తుంటారు. ఒడిశాలోని జైపూర్‌, కొరాపూట్‌ తదితర పార్రతాలకు ఒడిశా నుంచి పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, అధికారిక వాహనాల రాకపోకలకు ప్రధానమైన మార్గంగా ఉంది. ఇండస్ట్రీయల్‌ హబ్‌గా తయారైన రాజాంకు భారీ వాహనాలు, సాలూరు, బొబ్బిలికి వాహనాలు రాకపోకలు ఈ మార్గం నుంచే సాగుతుంటాయి. కూడలి కావడం స్థానిక గ్రామాలు ప్రజలంతా నిత్యావసరాల కోసం చిలకపాలెంను ఆశ్రయించడంతో నిత్యం జనసంచారంతో రద్దీని తలపిస్తాయి. కూడలి నుంచి నడుచుకొని రోడ్డు దాటడానికి పాదచారులు భయపడుతున్న పరిస్థితికి చేరింది. వాహనాల రద్దీ కారణంగా తరచూ పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తమవుతుంది. జంక్షన్‌లో రోడ్లు దాటుతున్న పాదచారులు వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినంత వరకు వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టును దశాబ్దాల పాటు నిర్వహించడంతో చిలకపాలెం జంక్షన్‌ ల్యాండ్‌ మార్కుగా గుర్తింపు పొందింది. ఈ కూడలి నుంచే మిర్చి, వేరుశనగ, జూట్‌, పత్తి, జొన్న తదితర ఉత్పత్తులు ఎగుమతి అవుతుండేవి. కాలక్రమేణా మిర్చి మినహా మిగతా ఎగుమతులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటి స్థానంలో ఉల్లి, వెల్లుల్లి, ఎండుచేపలు, బ్రాయిలర్‌ కోళ్లు, గుడ్లు హోల్‌సేల్‌ వ్యాపారం, ఎగుమతులు ప్రారంభమయ్యాయి. దీంతో నిరంతరం వాహనాల రాకపోకలతో కూడా జంక్షన్‌లో ట్రాఫిక్‌ పెరిగింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని ఇంజనీరింగ్‌ అధికారులు డిజైన్‌ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ కారణంగానే తరచూ చిలకపాలెం జంక్షన్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తున్నాయని విమర్శలు ఉన్నాయి.

ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు

సర్వీస్‌ రోడ్డులో ఫుట్‌పాత్‌పై చిరువ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు చేరడంతో జనం మధ్యలోంచే భారీ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో భారీ వాహనాలను సర్వీసు రోడ్డులోకి మళ్లించాలంటే ఇబ్బందకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ట్రాఫిక్‌ నిలిచి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పొందూరు`రాజాం రోడ్డుకు ఇరువైపులా పండ్ల దుకాణాలు, కూరగాయల వ్యాపారులు ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనికితోడు మూడుచోట్ల ఆటోస్టాండ్లు ఉన్నాయి. రణస్థలం, పొందూరు, శ్రీకాకుళం రూట్లలో ప్రయాణీకులు వెళ్లేందుకు వీలుగా ఆటోస్టాండ్లను ఏర్పాటుచేశారు. సర్వీసు రోడ్డులోనే ఆటోలు నిలిపి రోడ్లపైనే టిక్కెట్‌ సర్వీసు చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాహనాల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చొరవ చూపించకపోవడం వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని చెబుతున్నారు. ఈ సమస్యకు పోలీసు ఉన్నతాధికారులు, జాతీయ రహదారి అధికారులు చొరవ చూపించి పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page