ఇసుక పెద్ద పెద్ద లోడిరగ్‌లు వైకాపా నేతలు
స్థానికంగా తెలుగుతమ్ముళ్ల సరఫరా
సమీప ప్రాంతాల్లోనే స్టాక్ పాయింట్లు
సొంత స్థలాల్లోనే ఇసుక డంపింగ్
నదిలో ఇసుక లభ్యత లేకపోయినా తవ్వకాలు
అడ్డుకోలేక చేతుతెల్తేస్తున్న అధికారులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇసుకను ఉచితంగా తరలించుకుపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపుజెండా ఊపినా దాన్ని పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవడంలో తెలుగు తమ్ముళ్లు వెనుకబడిపోయారట. 2014`19 మధ్యలో ఎవరైతే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను విక్రయించుకున్నారో, ఇప్పుడు అవే కుటుంబాలు ఇసుకను తరలిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలన్నింటిలోనూ తవ్వుకోడానికి అనధికారిక అనుమతులు రావడంతో ఇసుకకు డిమాండ్ కూడా తగ్గిపోయింది. ట్రాక్టర్ లోడ్ ఇసుకను రూ.1200కు సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రతీ గ్రామంలోనూ 400కు తక్కువ ట్రాక్టర్లు ఎక్కడా లేవు. దీంతో సరఫరా ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది బల్క్ లోడిరగ్. 2019`24 మధ్యలో ఇసుకలో వేలు పెట్టడానికి స్థానికులకు అవకాశం లేకపోవడంతో ఆ సమయంలో స్మగ్లింగ్ తరహాలో చేసిన వైకాపా నాయకులకు ఎక్కడి నుంచి బల్క్ ఆర్డర్ తెచ్చుకోవాలి, ఎక్కడికి పంపిస్తే రేటు ఎక్కువ వస్తుంది.. వంటి అంశాలు తెలుసు. దీంతో ప్రస్తుతం పెద్ద పెద్ద లోడిరగ్‌లు వైకాపా నేతలు, స్థానిక ఇసుక సరఫరాను తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారు. ఇప్పటికైతే ఇసుక మీద ఎటువంటి విధానమూ లేదు. దొరికినోడు దొరికినంత ఇసుకను తీసుకెళ్లవచ్చు. అయితే దీన్ని స్థానిక అవసరాలకు సరఫరా చేస్తున్నది తెలుగు తమ్ముళ్లయితే పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు అమ్ముకుంటున్నది గత ప్రభుత్వంలో ఇసుకను అమ్ముకున్న వైకాపా నేతలే. ఈ విషయం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు తెలిసినా ఇందులో అనుభవం లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారు.
ఉచిత ఇసుక విధానాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు దుర్వినియోగం చేస్తున్నా అడ్డుకోలేక జిల్లా ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఈ విధానాన్ని అడ్డుపెట్టుకొని రోజూ వందల లారీల్లో వేల టన్నుల ఇసుకను జిల్లా సరిహద్దులు దాటి విశాఖకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టీడీపీ నాయకులు జేబుల్లోకి వెళ్లిపోతోంది. సహజవనరుల దోపిడి జరిగిపోయిందని వైకాపా హయాంలో గగ్గోలుపెట్టిన కూటమి పార్టీల నాయకులు ఇప్పుడు ఆయా పార్టీల నాయకులు చేస్తున్న దోపిడిని సమర్థించుకొనే పనిలో నిమగ్నమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల్లో స్థానికులు ఇసుక మాఫియాపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం పరిధిలో బైరి, కరజాడ, పొన్నాం, బట్టేరు, గార పరిధిలో అంబళ్లవలస, బూరవిల్లి, జోగిపంతులపేటల్లో ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి సమీప ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి డంప్ చేస్తున్నారు. నదిలో యంత్రాలతో తవ్వి లోడ్ చేసిన ఇసుకను సింగుపురం పరిధిలోని హాటకేశ్వరస్వామి కొండ వద్ద పల్లెవలస రోడ్డులో ఉన్న గంగమ్మ స్టోన్‌క్రషర్ వద్ద డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి రాత్రివేళల్లో విశాఖకు ఇసుకను తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో శిలగాం సింగువలసకు చెందిన కంచు శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. వైకాపా సానుభూతిపరుడుగా ఉన్న శ్రీనుకు ఇసుక డంపింగ్ చేసి అక్రమంగా లారీల్లో విశాఖకు తరలించడానికి స్థానిక టీడీపీ నాయకులు పూర్తి సహకారాలు అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో డంప్‌ను రంధి అప్పలస్వామి అలికాంలోని ఆయన సొంత స్థలంలోనే ఏర్పాటు చేసుకున్నారు. నైరా దాటిన తర్వాత అలికాం రోడ్డు పక్కనే పట్నాల కృష్ణ ఒక ఇసుక డంప్‌ను ఏర్పాటుచేశారు. దీంతోపాటు రోణంకి బస్టాప్ పక్కన మరో ఇసుక డంపింగ్ చేసి రాత్రి సమయంలో లారీల్లో విశాఖకు తరలించుకుపోతున్నారు. ఇసుక డంపింగ్ పాయింట్లన్నీ బైరికి చెందిన పట్నాల కృష్ణ నేతృత్వంలో నడుస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

గృహావసరాలకు ఇసుక అవసరమయ్యేవారు సచివాలయంలో పేరు నమోదు చేసుకొని అక్కడ సిబ్బంది ఇచ్చే అనుమతితో ఇసుకను ట్రాక్టర్లు, నాటుబళ్లుతో తరలించాలి. అలాంటి ప్రక్రియ జిల్లాలో ఎక్కడా జరగడం లేదు. జిల్లా అంతటా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా శ్రీకాకుళం పరిధిలో అంతకుమించి సాగుతుంది. ఇసుక వనరులు అధికంగా ఉండడం, నదిలో ఇసుక లభ్యత లేకపోయినా తవ్వేయడం, నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల నదికి ఆనించి ఉన్న ప్రతి గ్రామం వద్ద అనధికారిక రీచ్‌లు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఇసుకను తవ్వేందుకు అనుమతులు ఇవ్వడంతో ఈ దందా మరింత జోరుగా సాగుతుంది. అనధికారిక రీచ్‌లు తెరిచినట్టు ఉన్నతాధికారులకు సమాచారం, ఫిర్యాదులు వస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇందుకు చంద్రబాబు ప్రకటనే కారణమని అధికారులు చెబుతున్నారు. సొంత అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్లు, నాటుబళ్లపై తరలించేవారిని అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ప్రకటించి రెవెన్యూ, మైన్స్, పోలీసు అధికారుల చేతులు కట్టేశారు. చంద్రబాబు ప్రకటనపై తర్వాత మార్గదర్శకాలు వచ్చినా అధికారులెవరూ ఇసుకను అక్రమంగా తరలించేవారిని అడ్డుకునే సాహసం చేయడం లేదు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలించి డంపింగ్ చేసి, అక్కడి నుంచి లారీల్లో విశాఖకు తరలిస్తున్నారు.
బైరిలో వద్ద మడపాం బ్రిడ్జ్ కింద గురువారం జేసీబీతో ఇసుకను తవ్వి లోడ్ చేస్తున్న సమయంలో రెవెన్యూ, పోలీసులు కలిసి పట్టుకొని మైన్స్ అధికారులకు తదుపరి చర్యల కోసం విన్నవించారు. దీనిపై మైన్స్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్న వారంతా పోలీసులకు మామూళ్లు ఇస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రతివారం అందరూ కలిపి ఒక్కో గ్రామం నుంచి రూ.30వేలు పోలీసులకు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. దీన్ని వసూలు చేయడానికి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన దత్తత కానిస్టేబుల్స్ ఈ బాధ్యత చూస్తున్నట్టు ఆయా గ్రామాల్లో చర్చ సాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌కు ఇసుక అక్రమ రవాణా తలనొప్పిగా మారిపోయిందని పార్టీలోనే చర్చ సాగుతుంది. అక్రమ తవ్వకాలు చేయొద్ద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలను వారిస్తున్నా అందరూ ఎమ్మెల్యే మాటను బేఖాతరు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. దీనికి తోడు టీడీపీలో ఉన్న రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు కారణంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఇసుక అక్రమ రవాణా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులెవరూ స్పందించడం లేదు. నదికి సమీపంలో ఉన్న వారందరూ ఒక్కో ఇంటో రెండు అంతకంటే ఎక్కువ ట్రాక్టర్లు కలిగి ఉండటంతో రేయింబవళ్లు వారంతా ఇసుక వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు.
Commentaires