top of page

చివరకు బూడిదే మిగిలింది!

Writer: NVS PRASADNVS PRASAD
  • బిల్లుల చెల్లింపునకు నోచుకోక ముందుకురాని కాంట్రాక్టర్లు

  • ఆమదాలవలస రోడ్డుకు తారు ఖర్చు ఎంతవుతుందని ఆరా తీసిన శంకర్‌

  • ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి నిపుణులను తీసుకువస్తామంటున్న మంత్రి అచ్చెన్న

  • ప్రభుత్వం మారినా ప్రారంభంకాని పాత పనులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేకపోతున్నాయి. ఏ కారణం వల్ల గత ప్రభుత్వాన్ని చిత్తుగా ప్రజలు ఓడిరచారో ఇప్పుడు అదే శాపం తమకు తగలకూడదని తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కోట్లాది రూపాయల బిల్లులు పెండిరగ్‌లో ఉండిపోవడం వల్ల నిలిచిపోయిన పనులను మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడంలేదు. చివరకు రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో గోతులమయమైపోయిన రోడ్లలో ఫ్లైయాష్‌ నింపి రోడ్లను చదును చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లైయాష్‌ అంటే ఒక రకం బూడిద. విశాఖపట్నం ఎన్‌టీపీసీ వద్ద వేలాది టన్నుల ఫ్లైయాష్‌ పడివుంటుంది. దీన్ని తీసుకువచ్చి జాతీయ రహదారుల్లో ఫ్లైవోవర్లు నిర్మించేటప్పుడు వాడుతారు. ఇప్పుడు ఇదే బూడిదను తీసుకువచ్చి గోతుల్లో కప్పడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కానీ ఈ ప్రతిపాదనను ఇంజినీరింగ్‌ అధికారులు తోసిపుచ్చుతున్నారు. విశాఖపట్నం ఎన్‌టీపీసీ వద్ద ఫ్లైయాష్‌ ఉచితంగా ఇచ్చినా రవాణా ఖర్చే ఎక్కువవుతుందని, విశాఖపట్నం వరకు కొంత పర్వాలేదు కానీ, శ్రీకాకుళం తీసుకువచ్చి గోతుల్లో ఫ్లైయాష్‌ను వేస్తే ఎక్కువ కాలం నిలవదని చెబుతున్నారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు కొంతమేరకు అంగీకరించినా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఉన్న ఇంజినీరింగ్‌ అధికారులతో కూడా చర్చించి తక్కువ ఖర్చుతో రోడ్లను తాత్కాలికంగా మరమ్మతు చేసే విధానం మీద దృష్టి సారిస్తామన్నారు. అంటే ఇప్పటికిప్పుడు బడ్జెట్‌ కేటాయించి నిలిచిపోయిన రోడ్లు పూర్తిచేయడం, పాత రోడ్లకు రెన్యువల్‌ వర్క్‌ చేయడం, కొత్త రోడ్లు మంజూరు చేయడం కుదరదని ప్రభుత్వానికి అర్థమైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినా కాంట్రాక్టర్లు టెండర్‌ వేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే.. 2019`24 మధ్యకాలంలో నిర్మాణ పనులు చేపట్టిన అనేకమంది కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లుల చెల్లింపు పూర్తికాలేదు. కొందరు కాంట్రాక్టర్లయితే ఒకటి నుంచి మూడు దఫాలుగా పార్ట్‌ పేమేంట్‌ కోసం బిల్లులు పెట్టినా అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ముందుగా పాతబకాయిలు చెల్లిస్తే కొత్తవాటికి పెట్టుబడి వస్తుందని, అంతవరకు పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్‌ వ్యవస్థ చేతులెత్తేసింది. దీంతో చేసేదిలేక అచ్చెన్నాయుడు లాంటి సీనియర్లు వర్షాకాలం గోతుల్లో పడి ప్రాణాలు పోకుండా కనీసం ఫ్లైయాష్‌తోనైనా రోడ్లు చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరైతే మరొకడుగు ముందుకేసి అసెంబ్లీ సమావేశాలకు ముందు శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనులు కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాన్యంతో రెండు గంటలపాటు చర్చించారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఈ రోడ్డు పనులు పూర్తికాగా, శ్రీకాకుళం నియోజకవర్గం ఉన్న ప్రాంతంలోనే నిలిచిపోయాయని, దీన్ని వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కానీ తాను రూ.18 కోట్లకు పైబడిన పనులు చేపట్టినా ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదని, ఇప్పుడున్న పరిస్థితిలో పనులు చేపట్టలేనని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారట. రోడ్డు విస్తరణకు సంబంధించి మెటల్‌ వేసేశామని, బీటీ (తారు) వేయాల్సి ఉందని చెప్పడంతో తాను తారు ఇస్తే బీటీ రోడ్డు పూర్తవుతుందా అని శంకర్‌ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించినట్టు భోగట్టా. వాస్తవానికి ఇది ఏ ఒక్కరి జేబు నుంచో తీసి పూర్తిచేసే పనికాదు. నగరంలో డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి ఆమదాలవలస వరకు ఉన్న రోడ్డు విస్తరణను రూ.40 కోట్లకు దక్కించుకున్నారు. ఇందులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు 90 శాతం రోడ్డు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 7 కిలోమీటర్లలో బ్లాక్‌ టాప్‌ రోడ్డు వేయాలంటే కోట్లలో ఖర్చవుతుంది. ఎందుకంటే 20 టన్నులున్న తారు ట్యాంకర్‌ ఖరీదు రూ.12 లక్షలు. ఒక్క కిలోమీటరు రోడ్డుకు 250 టన్నుల తారు అవసరమవుతుంది. కాబట్టి శంకర్‌ తన సొంత సొమ్ముతో రోడ్డు వేయలేరని అర్థం చేసుకోవాలి. పాత బిల్లు రూ.18 కోట్లలో సగానికి పైగా విడుదల చేయగలిగితే భవానీ కన్‌స్ట్రక్షన్‌ పనులు ప్రారంభిస్తుందనడంలో సందేహం లేదు. కొత్త ప్రభుత్వం అర్జంట్‌ వర్క్‌ల కోసం రూ.286 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది. ఇప్పుడు ఈ మేరకు పనులు చేయాలన్నా కాంట్రాక్టర్‌ వద్ద పెట్టుబడి ఉండాలి. పాత బిల్లులు చెల్లిస్తే గానీ ఈ పనులు కూడా ప్రారంభమవుతాయో, లేదో డౌటే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంలో రూ.28 వేల కోట్ల బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉంది. ఇందులో పోలవరం పనులు, ఇరిగేషన్‌ సంబంధిత పనులకే రూ.18వేల కోట్లు చెల్లించాలి. అంటే.. ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ వంటి అనేక రాష్ట్ర శాఖల్లో జరిగిన పనులకు పెండిరగ్‌ ఉన్నది కేవలం రూ.10వేల కోట్లే. ఒక అమ్మఒడి, ఒక ఆసరా కంటే ఈ బిల్లు పెద్దదేమీ కాదు. కాకపోతే జగన్మోహన్‌రెడ్డి బిల్లులు ఇవ్వకూడదనుకున్నారు కాబట్టి చెల్లించలేదని అర్థమవుతుంది. చివరకు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నందున ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఓటు అడగడానికి వెళ్లే పరిస్థితి లేదని ఐప్యాక్‌ టీమ్‌ చెప్పడంతో కొన్ని రోడ్ల రెన్యువల్‌ పనులకు అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. చివరకు ఈ పనులు కూడా ఈ జిల్లాలో పూర్తికాలేదు. పని చేసినవాటికి బిల్లులు రాలేదు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస, దంత నుంచి కొమనాపల్లి, తెంబూరు నుంచి హిరమండలం, ఇలా అనేక రోడ్లు నిలిచిపోయాయి. ఇప్పుడు వీటిని పూర్తిచేయాలని తెలుగుదేశం నేతలు చెబుతున్నా తమకు వడ్డీకి అప్పులిచ్చేవారు సైతం లేరని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏఐఐబీ, ఎన్‌డీబీ నుంచి వచ్చిన నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు కాలేదు. సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు రాలేదు. చివరకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్‌వోబీ) పనులు చేపట్టినవారికి బిల్లులు చెల్లించలేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. ఇవి రాష్ట్ర ఖాతాల్లో జమైన మరుక్షణం పంపకాలకు కేటాయించడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు వరల్డ్‌బ్యాంక్‌ నిధులతో చేపట్టే పనులేమైనా ఉంటే చెప్పండి చేసిపెడతామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ పని పూర్తయిన 45 రోజుల్లోగా కాంట్రాక్టర్‌ వెంటపడి మరీ కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. జిల్లాలో నిలిచిపోయిన అనేక ప్రధానమైన రోడ్లు పూర్తికావాలంటే పాత బిల్లుల చెల్లింపు తప్ప మరో మార్గం కనిపించడంలేదు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page