చావు ఫేక్.. కూతురు ఫేక్.. పత్రాలూ ఫేకే
- Prasad Satyam
- Jul 21
- 3 min read
రిజిస్ట్రార్ సహకారంతో తమ్మినేని నాని ల్యాండ్‌స్కామ్
అధికార దర్పంతో పాత సర్టిఫికెట్ల నుంచి సంతకాలు కాపీ పేస్ట్
తమ్మినేని కుటుంబం చుట్టూ భూపాపం ఉచ్చు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని శ్రీరామ వెంకట చిరంజీవి నాగ్ (నాని) కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో ప్రతీది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక సూత్రాలు మర్చిపోవడం వల్ల నిందితులు దొరికిపోయారు గాని, లేదంటే ఎప్పటిలానే మిగతా భూములు మింగేసినట్టే వరం కాలనీలో భూమిని కూడా తినేసుండేవారు. ఈ కథలో మాజీ స్పీకర్ తమ్మినేని, ఆయన భార్య వాణిల ప్రమేయం ఏంటనే విషయం పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాల్సి వుండగా, సీతారాం తనయుడు నాని మాత్రం ఈ భూమిని రిజిస్టర్ చేయించుకొని అడ్డంగా దొరికిపోయారు. ఇంతవరకు బతికున్న అంధవరపు గోవిందరాజులు చనిపోయినట్టు, ఆయన కూతురు రజనీకి ఆ ప్లాట్లు దఖలుపడితే, ఆమె నుంచి రిజిస్టర్ చేయించుకున్నట్టు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ ఈ వ్యవహారంలో వేరేవారి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంటే పెద్ద క్రైమ్ ఇంకోటి ఉంది. అధికారుల సంతకాలు సేకరించి, దాన్ని కాపీ పేస్ట్ చేసి, నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి, వాటిమీద ఈ సంతకాలు పేస్ట్ చేయడం పెద్ద నేరం దీన్ని ఇలా వదిలేస్తే జిల్లాలో ప్రతీ బలహీనుడి భూమిని ఈ విధంగానే కబ్జా చేయడం అత్యంత సులువైపోతుంది. అన్నింటికీ మించి ఈ స్థలానికి సంబంధించి మధ్యలో కొన్ని డాక్యుమెంట్లు తప్పించి రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి రిజిస్ట్రార్‌ను ఇంతవరకు అరెస్టు చేయలేదు. వాస్తవానికి ఈ కథలో ప్రధాన సూత్రధారి ఆమెనే.
2503/1984 క్రయరిజిస్టర్ ఆధారంగా ఎ.రజనీకి వరం కాలనీలో ఉన్న ప్లాట్లు దఖలుపడినట్లు చూపించారు. ఆమెకు తల్లీ, తండ్రి మరణించిన తదనంతరం ఇది వారసత్వంగా దఖలుపడిందని రిజిస్టర్ ఆఫీసులో పేర్కొన్నారు. అంధవరపు గోవిందరాజులు 2007 సెప్టెంబరు 4న చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికెట్ తెచ్చారు. అప్పట్లో మున్సిపల్ ఆఫీసులో మరణ ధ్రువీకరణ పత్రం మాన్యువల్‌గా ఇచ్చేవారు. దీంతో ఒక పాత పత్రాన్ని సంపాదించి, అందులో చనిపోయినవారి పేరు స్థానంలో గోవిందరాజులు పేరు చేర్చారు. ఆ తర్వాత 2007 నవంబరు 20న గోవిందరాజులు వారసురాలిగా ఎ.రజనీకి తహసీల్దార్ కార్యాలయం నుంచి లీగల్‌హయర్ పొందారు. అది కూడా డెత్ సర్టిఫికెట్ లాంటి ఫోర్జరీయే. ఇప్పట్లో డిజిటల్‌గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. అప్పట్లో తహసీల్దారే లీగల్‌హయర్ ఇచ్చేవారు. ఇది కూడా మాన్యువల్‌గా ఉండేది. 2007లో తహసీల్దార్‌గా ప్రస్తుత డీఆర్వో విశ్వేశ్వరరావు పని చేశారు. ఆయన ఎవరికో ఇచ్చిన ఒక లీగల్‌హయర్ సర్టిఫికెట్‌ను ఎ.రజనీ పేరుతో మార్చుకున్నారు. 2007 నుంచి ఈ ఫోర్జరీ తతంగం ఒకవైపు నడుస్తుండగానే, మరోవైపు సంబంధిత ప్లాట్లకు సంబంధించి ఎవరూ తమదంటూ ముందుకు రాకపోవడంతో 2023లో వైకాపా అధికారంలో ఉన్నప్ప్పుడు రజనీ పేరుతో ఉన్న లీగల్‌హయర్ మేరకు 2023 ఏప్రిల్ 18న నానికి కొన్ని గజాల స్థలం అమ్మినట్టు చూపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఆగస్టు 23న కూడా ఇంకొన్ని గజాల స్థలాన్ని రజనీ నానికి అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి గోవిందరాజులు చనిపోవడం, ఆయన కూతురు రజనీ కావడం, ఆమెకు లీగల్‌హయర్ ఇవ్వడం ఇవన్నీ ఫేక్. గోవిందరాజులు ఈ మÖడు ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావుకు డాక్యుమెంట్ నెంబరు 2733/1992 తేది 22.10.1992 ఒకసారి, ఆయన భార్య విజయరాణికి డాక్యుమెంట్ నెంబరు 339/1988 తేది 2.6.1988లో ఒకసారి అమ్మేశారు. లెక్కల ప్రకారం తమ్మినేని నానికి రజనీ స్థలాన్ని అమ్మడానికి రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లినప్ప్పుడు కట్టా కనకలింగేశ్వరరావు, విజయరాణిల పేరిట ఇప్పటికే రిజిస్టర్ అయిపోయిందని తేలాలి. ఎందుకంటే పాతసర్వే నెంబరు 428/1 ప్రకారం చూసుకున్నా, కొత్త సర్వే నెంబరు 35/13 లెక్క ప్రకారం చూసుకున్నా ఈసీ కట్టా కనకలింగేశ్వరరావు, ఆయన భార్య విజయరాణిల పేరిట కనిపిస్తుంది. అయినా కూడా రిజిస్ట్రార్ రజనీ నుంచి నానికి ఎలా ఈ స్థలాన్ని రిజిస్టర్ చేశారనేది వేరేగా చెప్పనక్కర్లేదు. ఇదంతా ఒక పథకం ప్రకారమే అందరితోను, అన్ని స్థాయిల్లోనూ అధికారాన్ని ప్రయోగించడం వల్ల ఈసీలో వేరేవారి పేర్లు వస్తున్నా నానికి రిజిస్టర్ చేసేశారు. నాని పేరున రిజిస్టర్ పత్రాలు వచ్చిన తర్వాత అదే ఈసీలో అమ్మినది రజనీ, కొన్నది తమ్మినేని చిరంజీవి నాగ్ అని చూపిస్తోంది.
ఇందులో ఫేక్ చావుతో ఫేక్ కూతుర్ని పుట్టించి, ఫేక్ పత్రాలు సృష్టించి స్థలాన్ని సొంతం చేసుకున్నది సీతారాం తనయుడు నాని. అయితే ఇందులో మాజీ స్పీకర్‌కు, ఆయన భార్యకు సంబంధం ఏమేరకు ఉందో తేల్చడం కోసమే ఆదివారం చూపిన అరెస్టుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులు వీరిని మీడియా ముందుకు తేలేదు. కానీ వీరి పాత్ర ఉందని మాత్రం పోలీసులు బలంగా నమ్మడం వల్ల ఆధారాలు సేకరించడం కోసం తిరుగుతున్నారు. చిరంజీవి నాగ్‌కు రెండుసార్లు రిజిస్ట్రేషన్ అయినప్ప్పుడు సాక్షి సంతకాలు చేసిన నలుగురు సీతారాం కాలేజీలోనే పని చేస్తున్నారు. ఇందులో ఇద్దరు జలుమÖరుకు చెందినవారు కాగా, మరొకరు సరుబుజ్జిలి, ఇంకొకరు దన్నానపేటకు చెందినవారు. ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసినది నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీకి సంబంధించిన కేసులోనే. అయితే ఇప్ప్పుడు ఈ నకిలీ పత్రాలతో కొనుగోలు చేసిన కేసు సివిల్ మేటర్ అవుతుంది కాబట్టి దీనిపై ఏమేరకు ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. మరోవైపు సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణిశ్రీ, కుమారుడు నాని తమ మొబైల్ ఫోన్లు, సొంత వాహనాలు విడిచిపెట్టేసి ఎటో వెళ్లిపోయారంటూ ఈనాడు మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించడం గమనార్హం.






Comments