top of page

చేసేయ్‌.. కల్తీ కంపుఈఎస్‌ జేబులు నింపు!

Writer: NVS PRASADNVS PRASAD
  • `కేసుల్లో ఇరుక్కున్న నీలకంఠుకు రక్షణ

  • `కోర్టు సాకుతో రెండు నెలల్లోనే పోస్టింగ్‌

  • `ఆ వెంటనే కోరుకున్న చోటుకు బదిలీ

  • `అవే ఉత్తర్వులతో వచ్చిన సేల్స్‌మెన్‌కు మొండిచెయ్యి

  • `కొత్త పోస్టింగులు, బెదిరింపులతో విచ్చలవిడిగా వసూళ్లు

  • `జిల్లా ఎక్సైజ్‌, ప్రాహిబిషన్‌ శాఖను భ్రష్టు పట్టిస్తున్న ఈఎస్‌

‘ప్రభుత్వ మద్యం అమ్మకాలు, కల్తీల్లో నువ్వేమైనా చేస్కో.. నాకు మాత్రం జేబులు నింపు చాలు. ఇక సెబ్‌, పత్రికలు ఎన్ని చేసినా చర్యలు తీసుకోవాల్సింది నేనే కాబట్టి దాని కోసం అస్సలు ఆలోచించవద్దు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎక్సైజ్‌ శాఖలో మనమే ఉద్యోగాలు చేయాలి’.. అనే విధంగా ఉంది జిల్లా ఎక్సైజ్‌ ఈఎస్‌ కమ్‌ డిపో మేనేజర్‌ సుబ్బారావు వైఖరి. వసూళ్లు మరిగిన సుబ్బారావు, దాని కోసం ఇప్పటికే కల్తీ కేసు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్‌ నీలకంఠు అరెస్టు కాకుండా తప్పించి.. నెమ్మదిగా వీరఘట్టంలో పోస్టింగ్‌ ఇచ్చేయడమే కాకుండా కొద్దిరోజుల్లోనే తనకు అనువుగా ఉండేలా అవలంగికి మార్చారు. నీలకంఠుకు పోస్టింగ్‌ ఇవ్వడానికి కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతున్న ఈఎస్‌ అదే కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్న కొందరు సేల్స్‌మెన్‌కు మాత్రం మొండిచెయ్యి చూపారు. ఉత్తుత్తి ఆరోపణలు చేయించి సిబ్బంది నుంచి డబ్బు పిండుకోవడంలోనూ, కొత్త పోస్టింగుల పేరుతో లక్షలకు లక్షలు దండేయడంలోనూ ఈఎస్‌ సుబ్బారావు ఆరితేరిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కోటబొమ్మాళి షాపు నెంబరు 1991లో గత ఏడాది డిసెంబరు 14న ఎక్సైజ్‌ విజిలెన్స్‌ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 1150 మద్యం బాటిళ్లు కల్తీ అయినట్లు గుర్తించి కేసు నమోదు చేసింది. ముగ్గురు సేల్స్‌మెన్‌ల మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. అయితే ఈ కేసులో కీలక సూత్రధారి అయిన సూపర్‌వైజర్‌ సకలాబత్తుల నీలకంఠును మాత్రం సూపరింటెండెంట్‌ రక్షణ కవచంలా కాపాడుతూ వస్తున్నారు. నీలకంఠును పోలీసులు అరెస్టు చేయకుండా రెండు నెలలు కనపడకుండా చేసి, ఆ తర్వాత ఎంచక్కా వీరఘట్టంలో పోస్టింగ్‌ ఇచ్చేశారు. అప్పుడే నీలకంఠు, ఎక్సైజ్‌ ఈఎస్‌ మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, డిపార్ట్‌మెంట్‌మెంట్‌ సహకారం లేకుండా అన్ని బాటిళ్ల ను కల్తీ కూదరదని పత్రికలు ఘోషించాయి. ముగ్గురు సేల్స్‌మెన్‌ను జైలుకు పంపినా నీలకంఠును ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటే.. అందుబాటులో లేడని చెప్పుకొచ్చారు. వాస్తవానికి పోలీసులకు, పత్రికలకు సవాల్‌ చేస్తూ తాను తిరుపతిలో ఉన్న ఫొటోలు, విజయవాడలో ఉన్న ఫొటోలను నీలకంఠు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. అయినా ఆయన జోలికి వెళ్లలేదు. సీన్‌ కట్‌ చేస్తే.. రెండు నెలలు గడిచిన తర్వాత నీలకంఠును తీసుకువచ్చి వీరఘట్టంలో పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ వీడి పాపం వల్ల బలైపోయిన సేల్స్‌మెన్‌కు మాత్రం ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి నీలకంఠుకు ఎలా ఇచ్చారంటే.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడని చెబుతున్నారు తప్ప అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం చూపించడంలేదు. ఆయన్ను అసలు కోర్టుకు పంపించిందే ఎక్సైజ్‌ ఈఎస్‌ సుబ్బారావు అనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు నీలకంఠును అరెస్టు చేయకుండా కాపాడి ఆ తర్వాత వీరఘట్టంలో పోస్టింగ్‌ ఇచ్చారు. పోనీ కోర్టు ఆదేశాలను ఈఎస్‌ తూచా తప్పకుండా పాటిస్తారా.. అంటే అది కూడా లేదు. నీలకంఠులా మద్యం కల్తీకి పాల్పడకపోయినా చిన్న చిన్న కారణాలకు ఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది సేల్స్‌మెన్‌లు కోర్టుకు వెళ్లి తమను కొనసాగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటిని మాత్రం తొక్కిపెట్టి నీలకంఠుకు ఫేవర్‌ చేశారంటే వీరిద్దరి మధ్య ఎటువంటి బంధముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కల్తీ మద్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కోటబొమ్మాళిని మార్చుకున్న సకలాబత్తుల నీలకంఠేశ్వరరావు వీరఘట్టం వెళ్లి రావడం కష్టమవుతుందని తన బాస్‌కు ఇలా ఒక మాట చెప్పారో లేదో నెల రోజుల వ్యవధిలోనే ఆయన్ను అవలంగి షాప్‌ నెంబరు 1117కు బదిలీ చేశారు. ఎందుకంటే.. నీలకంఠు తనకు దగ్గరలో ఉంటేనే కలెక్షన్లకు సులువుగా ఉంటుంది.

పోస్టింగుల్లో వసూళ్లు, వాటాలు

ఈమధ్య కొన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొత్తగా సేల్స్‌మెన్‌ పోస్టింగులు ఇచ్చారు. ఇందులో కొందరి దగ్గర రూ.70వేలు, మరికొందరి దగ్గర రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.10వేలు నీలకంఠు వాటా పోగా మిగిలింది ఎక్సైజ్‌ బాస్‌కే వెళ్తున్నట్లు భోగట్టా.

`మొన్న పోలింగ్‌కు ముందు సంతబొమ్మాళి షాపు నెంబరు 1112లో పని చేస్తున్న ఒక సేల్స్‌మెన్‌ తన మిత్రుడైన మరో సేల్స్‌మెన్‌ ఇంట్లో ఫంక్షన్‌ ఉందని, పార్టీ ఇవ్వాలని చెబితే ఆరు క్వార్టర్‌ బాటిళ్లను షాపు నుంచి తరలించారు. దీంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేశారు.

`అలాగే కోటబొమ్మాళిలో 1044 నెంబర్‌ షాపులో కొత్త వ్యక్తికి సేల్స్‌మెన్‌ ఉద్యోగమిచ్చి రూ.లక్ష నొక్కేశారని భోగట్టా.

`ఇదే మండలంలో షాపు నెంబరు 1044లో మరొకర్ని సేల్స్‌మెన్‌గా నియమించి మరో రూ.లక్ష పిండేశారట.

`షాపు నెంబరు 1991లో సూపర్‌వైజర్‌ నుంచి రూ.1.10 లక్షలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా.

ఉత్తుత్తి అభియోగాలతో వసూళ్లు

సాధారణంగా ప్రభుత్వ షాపుల్లో పని చేస్తున్న సిబ్బంది నుంచి ఎటువంటి సొమ్ములు రావు. దాంతో నీలకంఠు ద్వారా పలువురిపై ఏదో ఒక అభియోగం మోపించి ఉద్యోగం తీసేస్తామని భయపెట్టి సొమ్ము వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కోటబొమ్మాళి పరిధిలోని షాపుల నుంచే పెద్ద ఎత్తున సొమ్ము రావడం వల్ల వీరఘట్టంలో ఉన్న షాపు నెంబరు 1117 నుంచి నీలకంఠును బదిలీ చేసి కోటబొమ్మాళి దగ్గరలో ఉన్న అవలంగికి తీసుకువచ్చారని తెలిసింది. ఇప్పుడున్న ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం షాపులో సేల్స్‌మెన్‌లకు, సూపర్‌వైజర్లకు బదిలీలు ఉండవు. కానీ ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి సుదూర ప్రాంతానికి బదిలీ చేస్తామని భయపెట్టి రూ.25 వేల నుంచి రూ.35వేల వరకు నీలకంఠు ద్వారా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఫీల్డ్‌ నుంచి నీలకంఠు, డిపోలో ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను గ్రిప్‌లో పెట్టుకున్న మేనేజర్‌ వీరి ద్వారా సేల్స్‌మెన్‌లు, సూపర్‌వైజర్లను భయపెట్టి బదిలీ బూచి చూపించి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అసలు జిల్లాకు, డిపోకు ఎవరు బాస్‌గా వచ్చినా ఈ ఔట్‌సోర్సింగ్‌ ఆపరేటర్‌, నీలకంఠుల పెద్దరికమేమిటి, ప్రభుత్వ షాపులు ఉన్నా కల్తీలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై మరో కథనంలో కలుసుకుందాం.

 
 
 

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page