వలంటీర్ల వ్యవస్థపై దాడి చేసి పీకలమీదకు తెచ్చుకున్న టీడీపీ
`చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని స్థితిలో వైకాపా
`అభ్యర్థులే లేని జనసేన ఆకాశానికి నిచ్చెనలు
`ఎల్లో మీడియా కథనాలకు కౌంటర్లకే నీలి మీడియా పరిమితం
ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం, మంత్రి పదవులు ఇవ్వడం, ఎస్సీ, బీసీల మీద నోరు పారేసుకోవడం, పేదలకు దూరంగా జరగడం వంటివాటి మీద పోస్టులు పెడితే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆంధ్రా సర్వనాశనం, డ్రగ్స్ ఆంధ్రా అని, విశాఖ సిటీ మీద విషం, మగవారు లేనప్పుడు ఇంటి తలుపులు కొట్టడానికే వలంటీర్లు వంటి విమర్శలు. అధికార పార్టీ, ప్రభుత్వంపై నిర్మాణాత్మక పోరాటాలు లేకపోగా ఆంధ్ర ప్రజల మీద పోరాటం చేస్తున్నట్లు తయారయ్యారు. సరి చేసుకోండి.. అని చెబుతున్నవారిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తప్ప సరిచేసుకున్నది లేదు. వలంటీర్లపై టీడీపీ చేసిన పోరాటం ఇప్పుడు ఏకంగా కోటి మందికి వ్యతిరేకంగా మారింది. తీరా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారానే పింఛన్లు ఇప్పించండి అని డిమాండ్ చేయడం ద్వారా ఆ వ్యవస్థ అవసరం ఉన్నట్టు కూడా టీడీపీయే అంగీకరించినట్లయ్యింది. ఇది వ్యూహాత్మక తప్పిదం.
...
ఒక విద్యావేత్తను, రాజకీయ నాయకురాలిని ఆఫీసు బయటే రెండు రోజులు కూర్చోబెట్టి అవమానించారు. విసిగిపోయిన ఆమె వేరే పార్టీలో చేరి మీరు ఎమ్మెల్యేగా రెండు చోట్ల ఓడినప్పుడే ఆమె ఎంపీగా ఎన్నికైంది. ఇప్పుడు ఏకంగా మిమ్మల్నే ఓడిరచడానికి బలమైన ప్రత్యర్థిగా మీ ఎదురుగా నిలబడిరది. ఓ ఔత్సాహిక రాజకీయ నాయకుడ్ని కనీసం ఆఫీసులోకి రానివ్వలేదు. తిక్కరేగిన అతను ఏకంగా ఒక పార్టీని స్థాపించి మీ పార్టీ కేంద్ర కార్యాలయం పక్కనే తన పార్టీ కేంద్ర కార్యాలయం తెరిచాడు. స్వకులస్తుడని, తన పెద్దరికం అవసరం పడుతుందని, అతడు సహాయాలు, సలహాలు, ఆహ్వానాలు అందించాడు. నాకు ఎవడి సహాయం, సలహా అవసరంలేదని నోటిదురుసుతో ప్రకటించాక అతడిప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి ఈసారి కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలవనీయనని పంతం పట్టాడు. ఈ రాజకీయ నాయకుడెవరో అందరికీ అర్థమైపోతుంది. కానీ ఈ వ్యక్తి నుంచి, అతని ప్రవర్తన నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నది చెప్పడానికే ఇది. ఇది రాజకీయ తప్పిదం.
...
గుంటూరు జిల్లా దాచేపల్లిలో అనుకున్నదానికంటే ఆరు నెలల ముందే నిర్మాణం పూర్తిచేసుకొని బుధవారం నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన శ్రీ సిమెంట్ ప్లాంట్. 2017లో గత ప్రభుత్వ జమానాలోనే శంకుస్థాపన చేసుకున్న ఈ పరిశ్రమ నిర్మాణం వైకాపా ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభించింది. రూ.2,500 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు సుమారు రెండువేల మందికి ఉపాధి కల్పిస్తుంది. భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశమూ ఉంది. ఈ వార్త ఎకనామిక్ టైమ్స్‌లో చదివితే గానీ తెలియలేదు. ఇటువంటి ఎన్నో పరిశ్రమల వార్తలు, జీడీపీ పెరుగుదల, పెరిగిన ఎంఎస్‌ఎంఈలు వంటి వార్తలు జాతీయ పత్రికల్లో తప్ప ఆంధ్ర పత్రికల్లో కనపడవు. బాబుకు అనుకూల పత్రికలు ఎలాగూ రాయవు. కనీసం సాక్షిలో కూడా ఈ కథనాలు కనపడవు. ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి ప్రసంగాల్లో కానీ, సలహాదారులు కానీ, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ ఎక్కడా చెప్పినట్లు కనపడలేదు. ఇదే గత ప్రభుత్వంలో అయితే ఏం జరిగుండేదో చెప్పనక్కర్లేదు. ఇది అధికార తప్పిదం.
...
సామాజిక భద్రత పెన్షనర్లు, వలంటీర్లు కలిపి దాదాపు కోటిమంది ఓటర్లు. సరిగ్గా ఎక్కడ కెలక్కూడదో చంద్రబాబునాయుడు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌చౌదరి ద్వారా అక్కడే కెలికించి ఇప్పుడు పీకల మీదకు తెచ్చుకున్నారు. బుధవారం నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు చంద్రబాబుకు పెట్టే శాపనార్థాలు వినాలంటే ఎలక్ట్రానిక్ మీడియాలో చూడాల్సిందే. చంద్రబాబు ఉక్రోషానికి వలంటీర్లో, జగన్మోహన్‌రెడ్డో బలైపోతారనుకుంటే అది బూమరాంగై చంద్రబాబుకు చుట్టేసింది. ఇన్నాళ్లూ ఇంటి వద్దకే వచ్చిన పెన్షన్ కోసం ఇప్పుడు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. సచివాలయాలు లేని గ్రామాల పరిస్థితి ఏమిటి? జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల రెండు గ్రామాలకు కలిపి ఒక సచివాలయం పని చేస్తున్నాయి. రెండువేల కంటే తక్కువ జనాభా ఉండే గ్రామాల సంఖ్య 7,600. అంటే.. ఇక్కడ సచివాలయాలు లేవు. వీరు కనీసం నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అర్బన్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఒకటో అంతస్తులో సచివాలయాలు కొనసాగుతున్నాయి. వయసు మీదపడినవారు అన్ని మెట్లెక్కి కార్యాలయంలోకి వెళ్లేదెలా. లబ్ధిదారులు సచివాలయాల వద్దకు చేరడానికి రవాణా సౌకర్యాలు కల్పించేదెవరు? పెన్షన్ లబ్ధిదారులు 66 లక్షల మంది ఉన్నారు. వారి చిరునామాలు ఒకచోట, ఉండేది మరోచోట. కొందరు ఆస్పత్రుల్లో ఉన్నా అక్కడికి వెళ్లి మరీ వలంటీర్లు పెన్షన్ అందించేవారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? ఎస్టీ నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు అసలు వలంటీర్లు రారన్న సమాచారం వెళ్లడమే కష్టం. ఏ సమాచారమైనా వలంటీర్ల ద్వారానే వెళ్లాలి. కొండ ప్రాంతాల్లో ఉన్నవారు సచివాలయాలకు ఎలా చేరుకోవాలి? ఎస్టీ ప్రాంతాల్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తూ పెన్షన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య దాదాపు 11 లక్షలు. వయసు మళ్లినవారికి వేలిముద్రలు పడవు. ఐరిష్ సరిగ్గా ఉండదు. అయినా వలంటీర్లు ఒక్కో ఇంట్లో బోలెడు సమయం వెచ్చించి పని పూర్తిచేసేవారు. ఇప్పుడు ఒకేసారి సచివాలయాల వద్దకు పింఛనుదారులు రావడం వల్ల ఒకే లబ్ధిదారుడి కోసం అంత సమయం కేటాయించడం సాధ్యమా? 58 నెలలుగా వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిన వ్యవస్థ కాదిది. ఇప్పుడు పెన్షన్ సొమ్ము జగన్ తినేశాడని చంద్రబాబు ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితి ఉందా? ఇది పూర్తిగా టీడీపీ సెల్ఫ్‌గోల్.
....
పట్టుమని 21 మంది అభ్యర్థులను పదేళ్లలో తయారుచేసుకోలేని పార్టీకి నాయకుడు ఆయన. తనను చూసి అధికారంలో ఉన్నవారు భయపడుతున్నారని తరచూ చెబుతుంటారు. ఆయన సామాజికవర్గ నేతలు, అభిమానులు పొత్తులో 50 సీట్లు పైనే తీసుకోమన్నారు. కానీ ఆయన త్యాగం చేసి 24 దిగిపోయారు. అందులోనూ మళ్లీ మూడు వదులుకొని 21కి పడిపోయారు. ఇంత తగ్గినా ఉన్నవాటిలోనూ ఆయన సైన్యానికి దక్కింది తక్కువే. చివరిగా విడుదల చేసిన జాబితాలో పాలకొండలో తెలుగుదేశం నేత నిమ్మక జయకృష్ణను తీసుకొని గ్లాస్ గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. విశాఖ సౌత్‌లో వైకాపా నుంచి వెళ్లిపోయిన వంశీకృష్ణ యాదవ్‌కు టిక్కెటిచ్చారు. అనకాపల్లిలో అయితే కొణతాల రామకృష్ణ ఇంటికెళ్లి మరీ పార్టీలో చేర్చుకుని సీటివ్వాల్సిన దుస్థితి. పెందుర్తిలో రెండు నెలల ముందు చేరిన పంచకర్ల రమేష్‌బాబుకు సీటు. భీమవరంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారానికే పులవర్తి ఆంజనేయులుకు సీటు. అవనిగడ్డలో పార్టీలో చేరకముందే మండలి బుద్ధప్రసాద్‌కు సీటు. తిరుపతిలో సుదూరంగా ఉన్న చిత్తూరు నుంచి.. అది కూడా వైకాపా తిరస్కరించిన నేత ఆరణి శ్రీనివాసులును తీసుకొచ్చి గ్లాసు గుర్తుపై పోటీకి అవకాశం. ఇవన్నీ ఎవరూ గమనించడం లేదనుకుంటే అంతకు మించిన తప్పిదం మరొకటి ఉండదు.
....
ప్రతిరోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్మోహన్‌రెడ్డికి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రావడం, వాటిని ఖండిరచుకోడానికే సాక్షి పత్రికలో స్పేస్ అంతా అయిపోతుంది. ముఖ్యమంత్రి అనేక సభల్లో ‘మనం చంద్రబాబుతో కాదు.. రామోజీరావుతో యుద్ధం చేస్తున్నాం’ అని చెబుతున్నట్లే రోజూ రాజగురువు, గురివింద రామోజీ అంటూ ఈనాడు వార్తలకు కౌంటర్ ఇవ్వడానికే సాక్షి ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగులు తరలివెళ్లిపోతున్నారు అని జరుగుతున్న ప్రచారానికి సాక్షిలో ఎక్కడా కౌంటర్ రావడంలేదు. ఇప్పటికీ జగన్మోహన్‌రెడ్డి సభలు, మొనాటనీగా ఉండే ఆయన ప్రసంగాలను పేజీలకు పేజీలు పరిచేయడం, తర్వాత రామోజీని విమర్శించడంతోనే సాక్షికి సరిపోతోంది. వాస్తవానికి రాష్ట్రంలో మొదట్లో కంటే అనేక రోడ్లు మెరుగయ్యాయి. నిధులు ఎవరివైనా కానివ్వండి.. కొత్త రోడ్లు వచ్చాయి, కొత్త పరిశ్రమలు వచ్చాయి, కొత్త ఉద్యోగాలు వచ్చాయి, కొత్త పోర్టులు వస్తున్నాయి. రోడ్ల మీద జనసేన నిరసన లు చేసిన సమయానికి ఉన్న ఫొటోలు, ఇప్పుడు బాగైన రోడ్లు చూపించడం మానేసి ఎటువంటి రెండో ఆలోచన లేని సంక్షేమాన్ని మాత్రమే సాక్షి ఎత్తుకుంటోంది. రోజూ ఆ పత్రికలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారి వివరాలు ఫొటోలతో ప్రచురిస్తోంది. సంక్షేమ పథకాలు అందించడంలో జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుపట్టడంలేదు. వచ్చిన చిక్కంతా అభివృద్ధి మీదే. అది జరిగిందని చెప్పుకోడానికి కోడిపెట్ట.. గుడ్డుపెట్టడం వంటి వాటికి సమాధానాలివ్వాల్సి ఉంది.
댓글