`ఇదే ప్రస్తుత ఎన్నికల్లో సింగిల్ పాయింట్ అజెండా
`అదే అంశంతో కూటమి అగ్రనేతల ప్రచారం
`మంచి చేశానని భావిస్తేనే ఓటు వేయమంటున్న సీఎం
`వేవ్ లేని ఈ పరిస్థితుల్లో అజెండాదే కీలకపాత్ర

(ఎన్నికల రచ్చబండ ` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సాధారణంగా ఏ ఎన్నికలనైనా రెండు అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో మొదటి వేవ్ అయితే రెండోది అజెండా. వేవ్ ఉన్నప్పుడు ఏ అజెండాలూ పని చేయవు. వేవ్ లేనప్పుడు ఎవరి అజెండా బాగుంది అన్న దానిపైనా పార్టీల గెలుపు ఓటములు ఆధారపడతాయి. వేవ్ అంటే ఏదో ఒక పక్షానికో, నాయకుడికో అనుకూలంగా ఇంకా చెప్పాలంటే ఏకపక్షంగా ప్రజాభిమానం మారిపోవడం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇటువంటి వేవ్ లేదా గాలి ప్రభావం చూపిస్తుంటుంది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సానుభూతి పవనాలు బలంగా వీయడంతో కాంగ్రెస్ భారత ఎన్నికల చరిత్రలోనే దేశంలో అత్యధిక స్థానాలు(404) గెలుచుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ను రాజ్యాంగ విరుద్ధంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు అలాంటి గాలే వీచింది. ఫలితంగా 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఏకంగా 200కుపైగా స్థానాల్లో గెలిచింది. మళ్లీ అదే తరహాలో గత ఎన్నికల్లో జగన్ గాలి వీచింది. ఫలితంగా వైకాపా 121 సీట్లతో అపూర్వ విజయం సాధించగలిగింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో అటువంటి వేవ్ ఏదీ ఇప్పటివరకు లేదు. దాంతో అజెండాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆ ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో ఒకే అంశం సింగిల్ పాయింట్ అజెండాగా కనిపిస్తోంది. జగన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలా.. వద్దా? అనేదే ఏకైక నినాదంగా మారింది. అధికారంలోకి రావడానికి అవసరమైన 88 సీట్లు సంపాదించడం ఎవరికి సాధ్యమవుతుందనేది జగన్ కావాలా.. వద్దా.. అనే అంశమే నిర్ణయించే పరిస్థితి ఉంది. జగన్ కావాలనుకుంటే వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జగన్ వద్దు అని ప్రజలు కోరుకునే పక్షంలో టీడీపీ కూటమి మెజారిటీ సాధిస్తుంది.
మరో అవకాశం కోరుతున్న జగన్
వద్దే వద్దంటున్న కూటమి
ఒక్క అవకాశం ఇవ్వాలన్న నినాదంతో గత ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారం సంపాదించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినందున, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ ఏదో రూపంలో నగదు లబ్ధి కల్పించినందున తనను మరోసారి గెలిపించాలని వైకాపా అధినేత జగన్ ప్రజలను కోరుతున్నారు. చెప్పినవన్నీ చేసినందున ప్రజలు మరో అవకాశం ఇస్తారన్న ధీమాతో కూడా ఉన్నారు. అదే సమయంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించిన, అరాచక పాలన సాగిస్తున్న జగన్‌కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రం అథఃపాతాళానికి వెళ్లిపోతుందని టీడీపీ కూటమి పక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అందువల్ల జగన్‌ను సాగనంపాలని పిలుపు ఇస్తున్నాయి. ఫలితంగా ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ప్రధాన అజెండాగా మారిపోయింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 175. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందులో సగానికంటే ఒక సీటు ఎక్కువగా.. అంటే 88 సీట్లు సాధించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి ప్రత్యేక వేవ్ ఏదీ లేకపోవడం వల్ల వైకాపా, తెలుగుదేశం కూటమి మధ్య పోటాపోటీ పరిస్థితి ఉంది. వైకాపాకు కొన్ని చోట్ల, టీడీపీకి మరికొన్ని చోట్ల ఎడ్జ్ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అజెండా కీలకపాత్ర పోషించడం తథ్యమన్నది తేలిపోయింది. అది కూడా జగన్ కావాలా.. వద్దా.. అన్నదే సింగిల్ అజెండాగా మారిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక విధంగా ఈ పరిస్థితికి టీడీపీ కూటమే కారణం. అటు తెలుగుదేశం.. ఇటు జనసేన మొదటి నుంచీ జగన్‌ను ఓ భూతం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాయి. దాంతో ఇతర అంశాలు దాదాపు తెరమరుగయ్యాయి. జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన వద్దే.. వద్దు అని చెప్పడమే తప్ప గతంలో తాము ఏం చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్న అంశాలు చెప్పడానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు.
ప్రచారం కూడా అదే తీరులో..
చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి అంతా కలిసిపోయి ఒక్కటిగా జగన్‌పై విరుచుకుపడుతుండటంతో ప్రస్తుత ఎన్నికల పోరాటం జగన్ వెర్సస్ అదర్స్ అన్నట్లుగా మారింది. కూటమి పార్టీల నేతలు జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అటు జగన్ కూడా పవన్, చంద్రబాబులను అదే రీతిలో కౌంటర్ అటాక్ చేయడంతో అభివృద్ధి లేదు అనే ప్రధాన విమర్శ రాను రాను సాకుగా మారిపోయింది. జగన్ కావాలా.. వద్దా.. అనేది అజెండాగా మారిపోయింది. వేవ్ లేదన్న విషయం ప్రధాన పార్టీలకు, వాటి అనుకూల మీడియాకు బాగా తెలుసు. ఈ పరిస్థితిని వేవ్‌గా మార్చేందుకు రెండు పక్షాల అనుకూల మీడియా కిందామీదా పడుతోంది. న్యూట్రల్ ఓటర్లను తమ వైపు మళ్లించేందుకు వీలుగా వార్తలు వండి వారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ అయిన 88 స్థానాలు ఎవరు సాధించగలరన్నది పాయింట్. వైకాపాకు అన్ని రాష్ట్రంలో ఎక్కువ అడ్వాంటేజ్ రాయలసీమ జిల్లాల్లోనే ఉంది. ఆ జిల్లాల్లోనే యాభైకి పైగా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 40కిపైగా సీట్లు సాధించగల పార్టీ 88 లక్ష్యాన్ని చేరుకోవడం ఈజీ అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మిగతా 48 సీట్లను ఇతర జిల్లాల్లో సాధించగలగడం పెద్ద కష్టం కాదు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో వైకాపాకే కొంత సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కూటమిలో రేగిన సీట్ల చిచ్చు వైకాపాకే అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను పొత్తు పేరుతో బీజేపీ, జనసేనలకు కేటాయించడం కూటమికి మైనస్‌గా మారేలా ఉంది.
చేరికల మంత్రాంగం
ఎన్నికల ముందు అన్ని పార్టీల్లోనూ చేరికలు సాధారణంగా జరిగేవే. అయితే ఈ ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ, జనసేనల్లో చేరితే వారికే టికెట్లు ఇచ్చేశారు. ఇది ఆ పార్టీల్లో మొదటినుంచి ఉన్న వారిలో అసంతృప్తి రేపింది. వైకాపా టికెట్లు నిరాకరించినవారే టీడీపీ, జనసేనల్లో చేరారు. అదే సమయంలో టీడీపీ, జనసేనలకు చెందిన ద్వితీయ శ్రేణి, స్థానిక నేతల చేరికలను వైకాపా ప్రోత్సహిస్తోంది. పెద్దస్థాయి నాయకులకంటే చిన్న నాయకుల చేరికలే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే.. పోల్ మేనేజ్‌మెంట్‌లో వారిదే కీలకపాత్ర. బూత్ లెవల్ మేనేజ్‌మెంట్, ప్రచారం వారి చేతుల్లోనే ఉంటాయి. ఇటువంటి వారు ఎక్కువగా వైకాపాలో చేరుతుండటం వల్ల పైస్థాయిలో అగ్రనేతలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం గ్రామస్థాయిలో జరగడంలేదు. ఇది అంతిమంగా అధికార పార్టీకి మేలు చేస్తుందని అంటున్నారు. మరోవైపు జగన్ తాను చేసిన మంచిన చెబుతున్నారు. వాటిని గుర్తించి, మీకు మేలు చేశానని భావిస్తేనే ఓటు వేయండి.. అని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా జగన్‌ను ఓడిరచండి అని ప్రతిపక్షం.. మేలు చేశానని భావిస్తే నాకే మరో అవకాశం ఇవ్వండని జగన్ చెబుతుండటమే ఇప్పుడు కీలకంగా మారింది. మరి ఓటర్లు ఏం అనుకుంటున్నారు.. ఎవరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారన్నదే సస్పెన్స్.
Comments