(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

‘అధికారాంతమున చూడవల అయ్యగారి సౌభాగ్యములు’ అన్నాడు ప్రాచీన కవి ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానక, తానే సర్వభూపాలుడనని, తన పదవి శాశ్వతం అని, తనకు ఎదురులేదని భ్రమల్లో మునిగి తేలితే అధికారం చేజారాక అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. ఓడిపోయిన తర్వాత శత్రువుని కనికరించి వదిలేయడానికి ఇది పురాణ కాలం కాదు. గెలిచినప్పుడు తాను శత్రువులతో ఎలా వ్యవహరించాడు అనే అంశం మీదే తనతో శత్రువులు ఎలా ఉండాలో తేలుతుంది.
ప్రస్తుతం జగన్ పరిస్థితి అతని గత వ్యవహార శైలికి అద్దం పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఏకవ్యక్తి కేంద్రంగా పాలన సాగింది. జగన్ - జనం మధ్యలో ఎవ్వరు ఉండకూడదు అనుకున్నారు. కార్యకర్తలు, మంత్రులు, అధికార వ్యవస్థ, జీవోలు.. ఇవేవీ ఆయనకు అప్రస్తుతం అని కలలుగన్నారు. అఖండ మెజారిటీని శాశ్వత అధికారానికి బాటగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ జరుగుతోంది. ప్రతి ఏడాది, ప్రతి నెల డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. జనమంతా తనకే ఓట్లు వేస్తారు అనే భ్రమలో ఆయన బతికేశారు.
చివరకు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టారు. ఆయన దారి నచ్చక, సీనియర్ లీడర్లు సైతం తమ దారి తాము చూసుకున్నారు. తండ్రి వల్ల సంక్రమించిన మీడియా శత్రుత్వం కూడా ఉండనే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఒకనాడు అనుభవించారు. తమ్ముడిని, మామగారి బిడ్డలను దూరం పెట్టారు. 2019లో అధికారం పోయిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని మచ్చిక చేసుకున్నారు. పురంధేశ్వరితో పునః సంబంధాలు ప్రారంభించారు. ఇది గెలిచే గుణం. మోదీ వెంట తిరిగింది కూడా అందుకే. జగన్ నియంతృత్వాధికారం వల్ల, తనకు అధికారం ఉంటే చాలు.. ఎవరి అవసరం లేదు అనే ధోరణి వల్ల దూరమైపోయిన కుటుంబ సభ్యులను తనదారికి తెచ్చుకున్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు వదిలిన బాణాలు పరిశీలిస్తే.. ఆయన తప్పులను సరిదిద్దుకున్న పద్ధతి అర్థం అవుతుంది. మోదీని తనతో కలుపుకోగలిగారు, పురంధేశ్వరి కుటుంబానికి చెరువ కాగలిగారు, షర్మిలను జగన్‌పై ప్రయోగించే తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్నికల వరకు జనాలలో నానేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. తన సొంత బంధువులతో డీల్ చేయడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద కష్టం కాదు. కానీ అధికారం ఆయనను అంధుడిని చేసింది. ఫలితంగా ఎన్నికల ముందు ఒంటరివాడయ్యాడు. అప్పటికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడ్ని అని చెప్పుకున్నా, జనం మాత్రం వైకాపాలో కౌరవులను చూశారు. ఇది చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక చతురతకు గొప్ప నిదర్శనం.
జగన్ పని అయిపోయిందా అని అడగొచ్చు. అది జనం చేతుల్లో ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కూటమి పాలన నచ్చకపోతే, మరో ఆప్షన్ లేకపోతే జగనే జనానికి కావాలి. జనం జ్ఞాపకశక్తి చాలా చిన్నది. మళ్లీ అధికారాన్ని అందుకోవడం అనేది జగన్ తన తప్పుల్ని దిద్దుకోవడంపై ఆధారపడి ఉంది. సరస్వతి పేపర్స్‌లో ఉండే మొత్తం షేర్లు తనవే అని విజయమ్మ కోర్టుకు చెప్పినట్లు ఈరోజు పేపర్లలో వార్తలు వచ్చాయి. అంటే తల్లి, చెల్లి దాదాపుగా దూరమైపోయారు. అతని నమ్ముకుని పేట్రేగిపోయిన నాయకులు జైల్లో ఉన్నారు. మరికొంతమంది అధికారపక్షంతో కలిసిపోయారు. ప్రతి సందర్భంలో జనం తనకు అండగా ఉంటారు అనుకోడానికి లేదు. వాళ్ల అండదండ కేవలం ఎన్నికలప్పుడే బయటపడుతుంది. ఈ ఓటమి నేర్పించే పాఠాలు ఏమిటి? వాటిని నేర్చుకుంటున్నానా లేదా అనేది జగన్ ఇష్టం. జగన్ ఆలోచనలకు ఇప్పుడు ఒక కాయకల్ప చికిత్స కావాలి. దానిని జగన్ స్వయంగా చేసుకోవాలి. అలా అయితేనే రాజకీయంగా జగన్ నిలబడతారు. లేకపోతే ఎంతోమంది పతనాలు చూసిన చరిత్రకు మరో వ్యక్తి పతనం గొప్ప విషయం కాకపోవచ్చు.
Comentarios