జగన్‌లో ఈ మార్పేమిటబ్బా?!
- DV RAMANA

- Oct 25
- 2 min read

ఏదైనా అనుభవం అయితే గానీ తత్వం బోధపడదంటారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగినట్లుంది. ఇన్నేళ్ల అనుభవం, ఒక ఘోర పరాజయం తర్వాత ఆయనకు రాజకీయతత్వం ఆకళింపుకొచ్చింది. ఇంతకాలం అనుసరిస్తూ వచ్చిన వ్యూహాలను మార్చడంతోపాటు కాస్త లౌక్యం కూడా ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎప్పుడో తప్పనిసరైతే తప్ప జగన్ విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు కాదు. అలాగే చంద్రబాబు, లోకేష్ తప్ప బాలకృష్ణను విమర్శించేవారు కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, ప్రభుత్వం నడిపినప్పుడు కూడా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు సంధించేవారు. కానీ ఇప్పుడు వీటన్నింటికీ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం ఏడాదికిపైగా బయటకురాని జగన్.. ఈమధ్యే యాక్టివ్ అయ్యారు. తన సహజశైలికి భిన్నంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నెల్లూరు, గుంటూరు నర్సీపట్నం తదితర పర్యటనలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గతంలో పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి మీడియాతో జగన్ మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఇప్పుడు పర్యటనల్లోనూ ఆయా ప్రాంతాల మీడియాను అడ్రస్ చేసి మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, తమ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఎండగడుతున్న మాజీ సీఎం.. ఆ క్రమంలో ప్రభుత్వాధినేత చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్‌పైనే ఆరోపణలు, విమర్శలను కేంద్రీకృతం చేస్తున్నారు. వారిద్దరి మీదే పూర్తి ఫోకస్ పెడుతున్న ఆయన కూటమిలోనూ, ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీల ఊసెత్తడం లేదు. ప్రెస్‌మీట్లు, ప్రసంగాల్లో వీలు చిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ ఒకటి రెండు మంచి మాటలు చెబుతున్నారు. జగన్‌లో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయవర్గాలను ఆలోచింపజేస్తోంది. ఆయన రాజకీయ వ్యూహం ఏమిటన్న చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే తన ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే వైకాపా విరుచుకుపడేది. అధికారంలో లేనప్పటి సంగతి పక్కన పెడితే వైకాపా ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో పవన్‌ను బాగా టార్గెట్ చేశారు. ఒక దశలో అయితే చంద్రబాబును పక్కన పెట్టి పవన్‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారా అనిపించింది. దాని దుష్ఫలితాలు 2024 ఎన్నికల్లో కనిపించాయని అంటున్నారు. పవన్‌ను, ఆయన పార్టీని అప్పట్లో వైకాపా చాలా లైట్ తీసుకోవడంతోపాటు సొంత పార్టీ విషయంలో అతి ధీమా అప్పట్లో పవన్‌కల్యాణ్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడటానికి కారణం. ఆయన వెనుక ఒక బలమైన సామాజికవర్గం ఉందని, తన వైఖరి వల్ల అది వ్యతిరేకమవుతుందన్న విషయం అర్ధమయ్యేసరికి పుణ్యకాలం ముగిసిపోయి పుట్టి మునిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించినందునే గతంలో వ్యక్తిగత అంశాలను కూడా లాగుతూ పవన్‌పై విమర్శలతో చెలరేగిపోయిన జగన్.. గత పదహారు నెలలుగా పవన్ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండగా అందులో జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ పెద్దన్నగా వ్యవహరిస్తున్నందున టీడీపీనే వైకాపా ప్రధానంగా టార్గెట్ చేస్తుండవచ్చన్న అభిప్రాయం ఒకటైతే.. మరో కోణంలో ఆలోచిస్తే పవన్‌ను విమర్శించడం వల్ల పెద్దగా లాభం లేకపోగా పార్టీపరంగా భారీ నష్టం వాటిల్లుతుందని గత అనుభవంతో తెలుసుకున్నందునే వైకాపా అధినేత పవన్‌ను వ్యూహాత్మకంగా వదిలేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 70 చోట్ల ఆ వర్గం ఓట్లే గెలుపు ఓటములను శాసిస్తుంటాయి. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన కాపులు 2019 నాటికి వైసీపీ వైపు మరలి అధికారం కట్టబెట్టారు. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ రూటు మార్చి కూటమికి జై కొట్టారు. దాంతో వైసీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. అయితే ప్రతీ ఎన్నికకూ కాపులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఆ వర్గం రాజకీయ రూటు మార్చినప్పుడల్లా రూలింగ్ పార్టీల ఫేట్ మారిపోతుందని 1983 ఎన్నికల నుంచి నిరూపితమవుతూ వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2029 ఎన్నికల నాటికి కాపులు మళ్లీ తమవైపు రావచ్చన్న ఆశాభావంతో ఉన్న వైకాపా.. తనవంతుగా వారిని ఆకట్టుకుని తానే చేరువ కావాలని చూస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే వారు ఎంతగానో అభిమానించే పవన్‌కల్యాణ్ విషయంలో వైకాపా అధినాయకత్వం మౌనం పాటిస్తోందని అంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఈ మధ్యే వైకాపా ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ స్పందించిన తీరు కూడా దీన్ని బలపరుస్తోంది. చిరంజీవి గురించి ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడారన్నారు. అదే సమయంలో గతంలో చిరంజీవి నేతృత్వంలో సినీ ఇండస్ట్రీ సీఎంగా ఉన్న తన వద్దకు వచ్చినప్పుడు తాను చిరంజీవికి మర్యాద ఇవ్వలేదని పవన్‌కల్యాణ్ సహా పలువురు చేసిన ఆరోపణలపైన మాత్రం స్పందించలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిరచి జగన్ తమను బాగానే చూసుకున్నారని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే వైకాపా అధినేత కాస్త ప్రాప్తకాలజ్ఞతతో తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది.










ఎన్ని యేశాలేసినా..,ఆరు నూరైనా.., ఆకు మేకైనా కచ్చితంగా జీవితంలో మళ్లీ సీఎం కాలేడు..!