
జగన్మోహన్రెడ్డి దయవల్ల టీడీపీకి 2, బీజేపీకి 1 రాజ్యసభ ఎంపీ సీట్లు వచ్చాయి. ఆయన ఎత్తుకున్న సామాజిక కూర్పు అంశంలో తన సొంత మనిషి అనుకున్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వలేదు. బీద మస్తాన్‌రావును టీడీపీ నుంచి తెచ్చి రాజ్యసభ ఇచ్చారు. ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఆర్.కృష్ణయ్యకు తెలంగాణ నుంచి పిలిచి రాజ్యసభ ఇవ్వడం కూడా నభూతో న భవిష్యత్.. అదే ఆర్.కృష్ణయ్యకు ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సీటు ఇవ్వడం విశేషం. రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, నామినేటెడ్ పదవులు కానీ పార్టీకి సేవ చేసినవారికి, నమ్ముకున్న వారికి ఇస్తే కొంత కాలం పార్టీ నడుస్తుంది. పార్టీ మీద నమ్మకం ఉంటుంది. ఇంకొకరికి భవిష్యత్‌లో అవకాశం వస్తుందని పార్టీని నమ్ముకుని ఉంటారు. జగన్ తన లిమిటెడ్ కంపెనీలో కుల సామాజిక వర్గాలు, తనను చూడగానే కాళ్లకు మొక్కేవారిని, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా మూలన పడినవారిని సామాజిక కూర్పు అనే ఒక పదం తెచ్చి జనాల మీద రుద్దారు. జగన్ కోసం గత 8 ఏళ్లు ప్రతిపక్షంలో పని చేసినవారు అందరూ పిచ్చోళ్లు అయ్యారు. జగన్ ఆశీస్సులతో రాజ్యసభకు వెళ్లిన ఆర్.కృష్ణయ్య ఎంపీ కావడం ద్వారా తన స్థాయి తగ్గిందని ఇంతకు ముందు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే వ్యక్తి బీజేపీ ద్వారా రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆయన మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసలు కృష్ణయ్యను నిందించటం ఎందుకు? ఇచ్చినోళ్లకు లేనిది తీసుకునేవాళ్లకు ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి ఈ మాట విన్నదే. పార్టీలు పిలిచి ఎమ్మెల్యే టికెట్లు, రాజ్యసభ సీటు ఇస్తే కృష్ణయ్య తీసుకొన్నారు అనుకోవాలి, డబ్బులు ఇచ్చి రాజ్యసభ కొనుక్కునే పరిస్థితి కృష్ణయ్యకు లేదు. 2014లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ సీట్ కృష్ణయ్యకు ఇచ్చింది. అప్పటి వరకు ఎల్బీ నగర్ టీడీపీ, తెరాస, బీజేపీ పార్టీల ఇన్‌ఛార్జిలుగా ఉన్న ఎస్వీ కృష్ణప్రసాద్, కాచం సత్యనారాయణ, కళ్లెం రవీందర్ రెడ్డిలు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. సుధీర్ గెలుపు సులభం అనుకున్నారు కానీ కృష్ణయ్య 12,500 తేడాతో తెరాస అభ్యర్థి రామ్ మోహన్ గౌడ్ మీద గెలిచారు. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కృష్ణయ్య టీడీపీని అడిగారా? లేదు.. బీసీ సీఎం అనే నినాదంతో తమ ఓటుబ్యాంక్‌ను కాపాడుకోవాలని టీడీపీనే పిలిచి టికెట్ ఇచ్చింది. 2018 ఎన్నికలు.. మిర్యాలగూడ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది.. 2014లో గెలిచిన జానారెడ్డి శిష్యుడు నల్లమోతు భాస్కర్‌రావు తెరాసలోకి ఫిరాయించటంతో 2018లో తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవాలని జానారెడ్డి ప్రయత్నం చేసినా వర్గపోరులో కుదరలేదు. ఒక వర్గానికి ఇస్తే మరో వర్గానికి కోపం.. ఇవన్నీ ఎందుకు అనుకోని కృష్ణయ్యను పిలిచి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముప్పై వేల తేడాతో తెరాస భాస్కర్‌రావు చేతిలో ఓడిపోయారు. 2019లో సీఎం అయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేసిన రాజకీయంలో భాగంగా ఎవరు సలహా ఇచ్చారో కానీ కృష్ణయ్యను పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చారు. రాజ్యసభ రాకముందు జీవితంలో ఒక్కసారి కూడా కృష్ణయ్య జగన్‌ను కలిసిఉండరు. కృష్ణయ్య 2019 ఎన్నికల్లో వైకాపా కోసం అసలు పనిచేయలేదు. 2024లో కూడా ఏదో చేసాం అంటే చేసాం అన్నట్లు నాలుగు సభల్లో పాల్గొన్నారు. ఇంతా చేసి కృష్ణయ్య యాదవ అనుకొని జగన్ రాజ్యసభ ఇచ్చినట్లున్నారు కానీ ఆయన కుర్మ/కురుబ. సీట్ ఇచ్చిన జగన్ కృష్ణయ్యను వాడుకుంది లేదు. కానీ ఆంధ్రాలో బీసీ నాయకులు లేరా అంటూ చాలామంది బీసీ నాయకులు వైకాపాకు దూరమయ్యారు. బీజేపీ ఎందుకు కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చింది? 2014 ఎన్నికల్లోనే మోడీని బీసీ ప్రధాని అని బీజేపీ దక్షిణాదిలో ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా బీసీ ప్రధాని అని బాగా ప్రచారం చేశారు. ఇది పని చేయడంతో బీజేపీ బీసీ కార్డ్‌ను బాగా వాడటం మొదలుపెట్టింది. హర్యానాలో జాట్‌లను కాదని బీసీలకు సీట్లు ఇచ్చింది, గెలిచింది కూడా. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి కౌంటర్‌గా ‘మాధవ్’ అనే పేరుతో బహుజనులకు ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. మాధవ్ అంటే మాలి, దంగర్, వింజారీ ఫ్యాక్టర్. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు టార్గెట్ తెలంగాణ. ఇక్కడ కూడా బీసీ నినాదంతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది. బండి సంజయ్ (మున్నూరు కాపు), అరవింద్ (మున్నూరు కాపు), ఈటెల రాజేందర్ (ముదిరాజ్)లతో ఇప్పటికే ఉన్న బీసీ నాయకత్వానికి కృష్ణయ్య (కురుమ లేదా గొల్ల కురుమ) అదనవు బలాన్ని జత చేస్తుంది. త్వరలో ఒక పద్మశాలీ నేతను కూడ చేర్చుకుంటారు. బీజేపీ స్ట్రాటజీకి బీసీ నేతలు కార్యసాధకులు అవుతారో లేదో కానీ బీజేపీకి ఓటు బ్యాంక్ తయారు చేయటానికి ఉపయోగపడతారు. జగన్ పదవి ఇచ్చి వాడుకోలేదు కానీ బీజేపీ తీరు వేరే. పక్క ప్రణాళికతో పనిచేస్తుంది నాయకులతో పని చేయిస్తుంది.
Comments