top of page

జగన్‌ 2.0 సాధ్యమేనా..?

Writer: NVS PRASADNVS PRASAD


‘జగన్‌ 2.0 వెర్షన్‌ను చూడబోతున్నారు. మొన్నటి వరకూ జనం గురించే ఆలోచించాను. ఇకపై కార్యకర్తలను పట్టించుకుంటాను.’ బుధవారం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నోట నుంచి వచ్చిన మాటలు ఇవి. ఇలాంటి మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అనేవారు. ఇకపై కార్యకర్తలు తనకు దేవుళ్లు అనేవారు. అధికారం పోయింది కాబట్టి జగన్‌కు కూడా కార్యకర్తల అవసరం కనిపించి ఉండవచ్చు. జెండా మోసే కార్యకర్త లేకపోతే, పార్టీ ఎక్కువ కాలం ఉండదు. ఒకట్రెండు సార్లు అధికారంలోకి వచ్చినా, కలకాలం జెండా ఉండాలంటే, కార్యకర్తే పార్టీ అనే దీపాన్ని వెలిగించే ఇంధనం. జగన్‌ కార్యకర్తలకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. అధికారంలోకి రాగానే, పదేళ్లు పాటు పార్టీ జెండా మోసిన కార్యకర్తలను, డస్ట్‌ బిన్‌లో పడేశారు. వాలంటీర్లను తీసుకువచ్చి సంక్షేమ పథకాలకు వారధిగా మార్చారు. రాజకీయంగా తలలు పండిన నేతలకు కూడా పార్టీలో విలువ లేకుండా చేశారు. నలుగురు మనుషులతో అడ్డుగోడలు నిర్మించుకుని, ధృతరాష్ట్రునిలా పాలించాడు. తన సభలకు వచ్చే జనాన్ని చూసి ‘వైనాట్‌ 175’ అనుకున్నారు. ఐప్యాక్‌ కట్టిన గంతలతో విజయ ప్రపంచాన్ని ఊహించుకున్నారు. జగన్‌ ఓడిపోతున్నారనే విషయం ఆయనకు, ఆయన కోటరీకి తప్ప లోకమంతా తెలుసు. ముఖ్యంగా కార్యకర్తలకు మరింత క్లియర్‌గా తెలుసు. 2019లో ఉన్న ఉత్సాహం, కసి 2024 ఎన్నికల్లో వైకాపా కార్యకర్తల్లో కనిపించలేదు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఈ రుణాన్ని తీర్చుకునే పనిలో ఇప్పుడు లోకేష్‌ ఉన్నారు. తనకు యువనేత అండగా ఉంటాడనే నమ్మకాన్ని ఆయన క్యాడర్‌లో కలిగించగలిగారు. భవిష్యత్తులో జగన్‌ ఆ భరోసాను ఇవ్వగలరా అనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులూ చేపట్టకుండా, ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండానే వైకాపా అధినేత అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. దీంతో తనకు ఎదురే లేదనే అభిప్రాయం ఆయనకు వచ్చేసింది. లక్షల రూపాయలు జనానికి పంచేస్తే చాలు అనుకున్నారాయన. అధికారం జగన్‌ వల్ల, జగన్‌ చేత, జగన్‌ కోసం మాత్రమే వచ్చిందనే విష యం కార్యకర్తలకు చాలా తొందరగానే అర్థమైపోయింది. పార్టీ కోసం అహోరాత్రాలు శ్రమించినా, ప్రతి పక్షంగా ఇబ్బందులు పడినా కూడా... జగన్‌ హయాంలో తమకు ప్రభుత్వంలో కానీ, అధికారంలో కానీ ఎలాంటి భాగస్వామ్యం లేదనే విషయం తెలియగానే ద్వితీయ, తృతీయే శ్రేణి నేతలంతా డీలాపడి పోయారు. ఇదిగాక రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతం జగన్‌ కోటరీలో ఉండే నలుగురి ఆధీనంలోకే వెళ్లిపో యింది. స్థానికంగా ఉన్న సీనియర్‌ నాయకులు సైతం ‘ఆ నలుగురి’ ఎదుట చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తలెత్తింది. పార్టీ గెలిచినా, ఓడినా తమకు ఒరిగేదేం లేదనే అభిప్రాయానికి 90 శాతం మంది పార్టీ నేతలు వచ్చేశారు. ఇవన్నీ జగన్‌ పాలనకు చరమగీతం పాడేశాయి. నేతలంతా పార్టీని వీడి వెళ్తున్న వేళ జగన్‌కు కార్యకర్తల ప్రాధాన్యం తెలిసినట్లుంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకుల వెంట నడిచే కార్యకర్తలు కొందరుంటే, జగన్‌ను అభిమానించే కార్యకర్తలు మరి కొందరుంటారు. పార్టీ అధికారానికి దూరం కాగానే నాయకులు కూడా జగన్‌ని వీడి వెళ్తున్నారు. ఈ ఆయారామ్‌లు, గయా రామ్‌లు గోడమీద పిల్లుల్లాంటి వారు. అధికారం అందగానే, వీరిలో సగం మంది ఎగేసుకుని మళ్లీ పార్టీ పంచన చేరుతారు. అయితే తన అవమానకరమైన ఓటమి తర్వాత జగన్‌ ఏం నేర్చుకున్నారనేది అతి ముఖ్యమైన అంశం. ఇప్పటికీ జగన్‌ సూపర్‌ సిక్స్‌ పథకాల గురించే మాట్లాడుతున్నారు. చంద్ర బాబు మాట మీద నిలబడరని ఆయనకు ఓటేసిన వాళ్లలో సగం మందికి తెలుసు. 50 శాతానికి పైగా ఓటింగ్‌ కూటమికి వచ్చిందంటే, జగన్‌ పథకాల లబ్ధి పొందిన వాళ్లు కూడా కూటమికి ఓటేసినట్లే లెక్క. 2019 ఎన్నికల్లో జగన్‌ కోసం ఓటు వేస్తే, 2024 ఎన్నికల్లో జగన్‌ ఓడించడానికి ఓటు వేశారు. ఇది వైకాపా అధినేత స్వయంకృతాపరాధం.. తనను ప్రొటెక్ట్‌ చేసే నలుగురు నాయకులను ఆయన సంపా దించుకోలేకపోయారు. ఇది ఆయన అహంకారం. జగన్‌ 2.0 కావాలంటే చాలా మారాలి. 40 శాతం జనాలు ఇప్పటికీ జగన్‌ వెంట ఉన్నారు. ఆయన ఓ పరిణితి చెందిన నాయకుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకరు పోతే మరొకరు వస్తారని, తన ముఖం చూసే ఓట్లేస్తారని భావించడాన్ని జగన్‌ ముందు మానుకోవాలి. అందుకోసం అవసరమైతే మందులు వాడాలి. ఎన్టీఆర్‌ కంటే చరిష్మా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో లేరు. ఆయన కూడా ఓడిపోయారన్న విషయం తనను వీడి వెళ్లినవారిని బతిమాలడానికి వైశ్రాయ్‌ హోటల్‌కు కూడా వెళ్లారని గుర్తించాలి.

 
 
 

ความคิดเห็น


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page