top of page

జనగణన ఎప్పుడో మరి..!?

Writer: DV RAMANADV RAMANA

ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకాన్ని ప్రకటించటానికి ముందుగా చేసే కసరత్తు సదరు పథకం ఏ తరగతి ప్రజల కోసం? ఆ తరగతి ప్రజలు మొత్తం జనాభాలో ఎంతమంది ఉన్నారు అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవటం. అంటే ఓ పథకం ప్రకటించాలన్నా మొత్తం జనాభా ఎంతో తెలియాలి. అందులో సదరు ప్రభుత్వానికి వచ్చిన ఆలోచనల ఫలితంగా రూపొందే పథకానికి ఎందరు అర్హులో నిర్ధారించాలి. ఎంతమంది అర్హులు అన్నదాన్ని బట్టే సదరు పథకాన్ని అమలు చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వస్తుంది. ఇది సాధారణంగా జరిగే పరిపాలనపరమైన చర్య. కానీ గత పద్నాలు గేళ్లుగా భారతదేశంలో జనగణన జరగలేదు. అయినా కేంద్ర ప్రభుత్వం పథకాలు వండి వడ్డిస్తూనే ఉంది. బడ్జెట్లు కేటాయిస్తూనే ఉంది. పేదరికం తగ్గిస్తూనే ఉంది. అసలు మొత్తం జనాభా ఎంత, అందులో పేదలెందరు అన్నది లెక్కే తెలీనప్పుడు పేదరికం తగ్గింపు గజం మిథ్య పలాయనం మిథ్య అన్న చందమే కదా. పదేళ్లకొకసారి జరిగే జనగణన చివరిసారిగా 2011లో జరిగింది. అంటే 2021లో మళ్లీ జరగాలి. దానికి ముందే దాదాపు 2019 నుంచి లేదా కనీసం 2020 నుంచి అయినా కసరత్తు ప్రారంభం కావాలి. అంటే ప్రశ్నావళి రూపొందించటం, జనగణన చేయాల్సిన సిబ్బందికి ఓరియెంటేషన్‌ తరగతులు నిర్వహించటం, వివిధ భాషల్లో ప్రశ్నావళిని అచ్చు వేసి సిద్ధం చేయటం వంటి పనులు ప్రారంభం కావాలి. కానీ కేంద్రం ఇవేవీ చేపట్టలేదు. జమ్ము కాశ్మీర్‌ను ముక్కలు చేయటానికి ఉన్నంత ఆసక్తి అప్పట్లో కేంద్రానికి జనగణన మీద లేకపోయింది. దేశశ్యాప్తంగా రాజకీయ పక్షాలే కాక మేధావులు, గణాంక నిపుణులు విమర్శలు ఎక్కుపెట్టిన తర్వాత కోవిడ్‌ కారణంగా జనగణన వాయిదా వేస్తున్నామని ప్రకటిం చింది. కోవిడ్‌ దిగ్భంధనం ముగిసి ఇప్పటికి నాలుగేళ్లు. ఆర్థికవ్యవస్థ కూడా కోవిడ్‌ ప్రభావం నుంచి పూర్తిగా తేరుకున్నది, కోలుకున్నది అంటున్నారు. అలాంటప్పుడు ఇప్పటికైనా జనగణన చేపట్టకపోవటం లో ప్రభుత్వం ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న దేశం ముందున్నది. తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం జనగణన ఊసెత్తలేదు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైతం జనగణన జరిగింది. కానీ ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కూడా జనగణన చేపట్టే అవకాశాలు కనుచూపుమేర కనిపించటం లేదు. ఉదాహరణకు జాతీయ ఆహార భద్రత పథకం కింద 75 శాతం గ్రామీణ జనాభా, 50 శాతం పట్టణ ప్రాంత జనాభాకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు ఆహారధాన్యాలు సరఫరా చేయాలి. గత బడ్జెట్‌లో కేటాయింపులపై విమర్శలు వచ్చినప్పుడు జనాభా అంచనాల ప్రకారం కేటాయింపులు సవరిస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది. అదే అంచనాల ప్రకారం అయితే ఇప్పటికి కనీసం 110 కోట్ల మంది ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హులవుతారు. కానీ ఈ సంఖ్యను నిర్ధారించిందీ లేదు. కేటాయింపులు పెంచిందీ లేదు. ఇదే సమస్య ఇతర అన్ని పథకాలకూ వర్తిస్తుంది. మహిళలకు చట్టసభల్లో మూడోవంతు సీట్లు రిజర్వు చేస్తామని, జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్తీకరణ పూర్తి చేసి మహిళలకు ఏ నియోజకవర్గాలు రిజర్వు చేయాలో నిర్ణయిస్తామని బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని మొదలు హోంశాఖ మంత్రి వరకూ పార్లమెంట్‌లో వాగ్దానం చేశారు. ఇంతవరకూ జనగణనే మొదలు కానప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించీ ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం జనగణన విషయంలో అనుసరిస్తున్న వైఖరికి రెండు ప్రధాన కారణాలున్నాయని భావిస్తున్నారు. మొదటి అంశం కేంద్ర ప్రభుత్వానికి వాస్తవాలు అంగీకరించే లక్షణం స్వభావం లేదు అన్నది గత జాతీయ నమూనా సర్వే సంస్థ, జాతీయ గణాంక సంస్థలను నిర్వీర్యం చేయటం ద్వారా మనకు అర్థమవుతుంది. చివరకు అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశం గురించి ప్రాథమిక విష యాలు ఖరారు చేసుకోవడానికి కావల్సిన విశ్వసనీయమైన గణాంకాలు అందుబాటులో లేవని ఎత్తి చూపింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఇక రెండో కారణం శాస్త్రీయ దృక్ఫధం మీద ప్రభుత్వానికి ఉన్న విముఖత. గత పదేళ్లకుపైగా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాధినేతలు, విధాన కర్తలు చేస్తున్న ప్రకటనల సారాంశం దేశంలో మూఢవిశ్వాసాలను పెంపొందించటం. జనగణన దేశం ఎదుర్కొం టున్న అనేక సమస్యలను శాస్త్రీయ దృక్కోణంలో అర్థం చేసుకుని, విశ్లేషించటానికి అవకాశం కలిగిస్తుంది. గణాంకాలు అందుబాటులో ఉంటే స్వతంత్ర మేధావులు కూడా తమ తమ అధ్యయనాలు సాగిస్తారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తారు. ప్రభుత్వ విధాన వైఫల్యాలు బట్టబయలవుతాయి. అందువల్లనే సాధ్యమై నంత వరకూ జనగణన వాయిదా వేస్తోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల అవసరాలకూ, బడ్జెట్‌ కేటాయింపులకు మధ్య ఎటువంటి సంబంధం లేకుండా చివరకు బడ్జెట్‌ కసరత్తు కూడా అర్థంలేని కసరత్తుగా మారే ప్రమాదం ఉంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page