యూట్యూబ్ ఛానెళ్లకి అఘోరీ రూపంలో విందు దొరికింది. ఆమె శవాల్ని తింటే, వీళ్లు ఆమెని తినడం మొదలుపెట్టారు. వెనుకటికి తమిళ దర్శకుడు బాల ‘నేను దేవున్ని’ అనే సినిమా తీసాడు. దాంట్లో హీరో అఘోర. బాలకృష్ణని కూడా అఘోరగా చూశాం. హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అఘోరి ప్రత్యేకత ఏమంటే ఆవిడ కారు నడుపుతుంది. ఆ కారుకి నెంబర్ ప్లేట్ వుండదు. కారు నిండా పుర్రె లుంటాయి. భయంకరమైన బొమ్మలుంటాయి. అఘోరి నగ్నంగా వుంటుంది. వీడియోల్లో బ్లర్ చేస్తారు. ఆవిడ వీడియోలకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేసరికి యూట్యూబ్‌ల వాళ్లు జూలు దులుపుకుని పరిగె త్తారు. వెనక పడతామనే భయంతో ఆమెని వెతికి పట్టుకున్నారు. అఘోరి కూడా మంచిదే. అలసట లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. ఎక్కడో కేదార్‌నాథ్‌లో తపస్సు చేసుకునే ఆవిడ హఠాత్తుగా జనంలోకి వచ్చి పాపులారిటీ ఎందుకు కోరుకుంటూ వుందో తెలియదు. సనాతన ధర్మ రక్షణ కోసం అంటున్నారు. దానికి పవన్‌కల్యాణ్ ఉన్నారు కదా, మళ్లీ ఈవిడ ఎందుకు? ఈ మధ్య విగ్రహాల ధ్వంసమని వివాదంలోకి సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఎక్కింది. నిజానికి అది ఎక్క డుందో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ గుడికి అఘోరి వెళ్లి ఒంటికాలు మీద నిలబడి కాసేపు ధ్యానం చేసి గట్టిగా చప్పట్లు కొట్టి అరిచింది. అక్కడ కాపలా ఉన్న పోలీసులు కూడా అఘోరిని చూసి భయభక్తులతో నిలబడ్డారు. ఆమె చప్పట్లు కొట్టిన విధానం చూసి ట్రాన్స్‌జెండర్ అని నిరూపించడానికి కొన్ని ఛానెళ్లు కంకణం కట్టుకున్నాయి. కొంతమంది ట్రాన్స్‌జెండర్లతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. యాంకర్లు కూడా అఘోరి ఇంటర్వ్యూల్లో డోస్ పెంచారు. పీడియడ్స్ వస్తాయా? సెక్స్ కోరికలు వుండవా? ఏం అడక్కూడదో అవన్నీ అడిగి థంబ్‌నెయిల్స్ పెడు తున్నారు. జనం కూడా మతిస్థిమితం కోల్పోయి చాలా కాలమైంది కాబట్టి వేలంవెర్రిగా చూస్తున్నారు. కొంతమంది ఉత్సాహవంతులు వెనుకపడిపోయామన్న భయంతో పరిశోధన మొదలుపెట్టారు. అఘోరి తల్లిదండ్రుల ఇంటర్వ్యూ చేశారు. జూబ్లీహిల్స్‌లో అఘోరి పేరుతో కోట్ల రూపాయల ఇల్లు ఉన్నట్టు కనిపెట్టారు. ఒకాయన మెడ నిండా రుద్రాక్షలు ధరించి, సెమీ అఘోరాలా మారి ఇంటర్వ్యూలో జ్ఞాన ప్రదర్శన చేశాడు. రుద్రాక్షలు ఎన్ని రకాలు, ఉపయోగాలు ఏంటి? స్మశానంలో ఉన్న శివుడు కనిపిస్తాడా? పురుష కపాళం, స్త్రీ కపాళానికి తేడా ఏమిటి? (కపాళ మోక్షం తర్వాత అంతా ఒక్కటే కదా, కనీసం స్మశానంలో కూడా స్త్రీ, పురుషుల్ని సమానంగా వుండనివ్వరా? పుర్రెని చూస్తే టెర్రర్ తప్ప జెండర్ గుర్తొస్తుందా?) ఇలా రకరకాల ప్రశ్నలు వేసి అఘోరీని ఫెయిల్ చేసి ఫేక్ అని నిరూపించే ప్రయత్నం. రకరకాల యూట్యూబ్ ఛానెల్స్ చిత్రవిచిత్ర థంబ్‌నెయిల్స్‌తో లైవ్ హారర్ చూపిస్తున్నాయి. కెమెరాలతో తిరుగుతున్న అఘోరీలు వీళ్లు. తమాషా ఏమంటే మెయిన్ ఛానెల్స్ వాళ్లు ఇంకా అఘోరీని అందుకోలేదు. తమ స్థాయి కాదనుకున్నారేమో! వాళ్లు కూడా మొదలుపెడితే అఘోరీని స్టూడియోలో కూడా చూడొచ్చు. ఆమెతో పాటు ఐదారుగురు బట్టల్లేని నాగ సాధువులు, గడ్డాలున్న స్వామీజీలు అంతా కలిసి ప్రళయాన్ని ఆపే విధానాన్ని చర్చిస్తారు. దేవుడు ఎలాగూ కనపడడు. అఘోరీలు కనిపిస్తున్నారు. దండం పెడితే పుర్రెతో ఆశీర్వదిస్తారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు కేసు పెట్టాలా? వద్దా? కేసు పెడితే ఆమె బట్టలు లేకుండా వస్తానంటే జడ్జి ఒప్పుకోడు. వెనుకటికి మంగమ్మవ్వ బట్టల్లేకుండా తిరిగేది. పొడుగాటి జుత్తు ఉండడం వల్ల బ్లర్ చేయా ల్సిన అవసరం ఉండేది కాదు. ఆమె హత్య కేసులో ఇరుక్కుంటే, కోర్టుకి నగ్నంగా రావడానికి జడ్జి ఒప్పుకోలేదు. తెరల మధ్య తీసుకురావాల్సి వచ్చింది. కళ్లు ఉన్నందుకు ఎన్నెన్ని చూడాలో! విచిత్రమేమి టంటే.. ఏ పుర్రె చూసి భయపడతామో మనలోనే ఆ పుర్రె ఉంది. ఆ పుర్రెలో ఇమిడివున్న మస్తిష్కం తోనే మన ఆలోచనలు, మనము ముందుకు సాగుతామని మర్చిపోతాం. అంటే మనమంటేనే మనకు భయం. విపరీతంగా పుట్టుకొచ్చిన గొట్టాల వల్లే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియడంలేదు. అఘోరీ లంటే ఎవరో తెలీనోళ్లు అఘోరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఏ హిమాలయాల్లోనో, బాహ్య ప్రపంచానికి దూరంగా, భిన్నంగా బతికే ఓ జాతిని తీసుకువచ్చి తపస్సులు లేకుండా, యోగసాధనాలు లేకుండా అఘోరీలంటూ చూపించడం మనకే చెల్లింది. నిజానికి ఈ వింతజీవిని పట్టుకొని లోపలేసి నాలుగు తంతే అన్ని బూడిదలు తొలగిపోయి అసలు స్వరూపాలు బయటపడ తాయి. ఇక్కడ స్వరూపానందకే కాదు.. అందరికీ మరో స్వరూపాలు ఉన్నాయి.
top of page
bottom of page
Comentarios