top of page

జమిలి ఎన్నికలు - అతకని సమర్థనలు!

Writer: DV RAMANADV RAMANA

జమిలి ఎన్నికలపై తన అజెండాను అమలు జరిపేందుకు బిజెపి పూనుకుంది. ఆ విధానాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. గోడ మీది పిల్లులు ఎటు వాటంగా ఉంటే అటు దూకాలని చూస్తున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలుజరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసింది. రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చేసిన సిఫార్సులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు 2న తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్ర పతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది. 2047 నాటికి వికసిత భారత్‌కు జమిలి ఎన్నికలే జిందా తిలిస్మాత్‌ అంటే జనం చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. 1952 నుంచి 1967 వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అప్పుడేమీ దేశం గంతులు వేస్తూ అభివృద్ధి చెందిన దాఖలాలేమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రూపాయి విలువ తగ్గింపు, ఐఎంఎఫ్‌ రుణం, ధరల పెరుగుదల తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటమి, కాంగ్రెస్‌లో చీలికతో 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాల పతనం వంటి పరిణామాలన్నీ జరిగాయి. జస్టిస్‌ బి.పి.జీవన్‌ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్‌ 1999-2000లో ఖర్చు తగ్గింపు, పాలన మెరుగుదలకు జమిలి ఎన్నికల గురించి పరిశీలించాలని చెప్పింది తప్ప అభివృద్ధికి ముడిపెట్టలేదు. ఇంత పెద్ద దేశానికి ఓటర్లకు, ఓట్ల పెట్టెలకు రక్షణ లేని ఈ దేశంలో ఎన్నికల సమయంలో భద్రతా సిబ్బంది నియామకం, ఎన్నికల సిబ్బందికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదు. దాన్నే భూతద్దంలో చూపి ఆ కారణంగానే దేశం వృద్ధి చెందటం లేదంటున్నారు. జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 26 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి, 38 మంది ప్రధానులు మారారు. గత కొన్ని దశాబ్దాలుగా పక్షవాత రోగి మాదిరి దాని అర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి నమూనాగా ఒకప్పుడు జపాన్‌ను చెప్పారు. దాన్ని చూసి నేర్చు కోవాలన్నారు. దాని పరిస్థితి ఏమిటి? 2012లో జిడిపి ఆరు లక్షల కోట్ల డాలర్లు దాటింది. ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు పడిపోయింది. రామనాధ్‌ కోవింద్‌ కమిటీ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్‌, ఇండో నేషియా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసింది. అక్కడ ఏక కాలంలో జరిగే వాటిని మాత్రమే తీసుకుంది తప్ప దామాషా ప్రాతిపదికన ప్రతి ఓటుకూ విలువ నిచ్చే నిజమైన ప్రజాస్వామిక పద్ధతిని సిఫార్సు చేయకుండా వదలివేసింది. వాటిని గమనించినట్లు మాత్రం పేర్కొన్నది. ఎందుకుంటే సిఫార్సు చేస్తే బిజెపికి ఆగ్రహం వస్తుంది గనుక. ప్రపంచంలో జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు-అవి స్వీడన్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64 లక్షలు (40 శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటువచ్చింది. ప్రతి ఓటుకూ విలువ ఇచ్చే అసలు సిసలు ప్రజాస్వామ్యం అంటే ఇది కదా! కానీ మన దేశంలో జరుగు తున్నదేమిటి? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు, సీట్లకు పొంతన ఉంటోందా? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36 శాతమైతే, సీట్లు 55.8 శాతం. అదే 2024లో ఓట్లు 36.56 శాతం కాగా, సీట్లు 44 శాతం వచ్చాయి. తక్కువ ఓట్లతో అధికారాన్ని పొందింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసి నంతగా మరొకరికి తెలియదు. అలాగే తన పాలన వైఫల్య దిశగా పోతున్నదని అందరి కంటే ముందుగా గ్రహించిన వ్యక్తి మోడీ. ప్రతి ఎన్నికలలోనూ పాతదాన్ని వదిలి కొత్త నినాదాన్ని ముందుకు తేవటం తెలిసిందే. అధికార యంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు. మరోవైపు జమిలిని వ్యతిరేకించే పార్టీలకు నీతులు చెబుతున్నారు. ‘మీరు కొంత కాలం జనాలందరినీ వెర్రివారిగా చేయగలరు. కొంత మందిని కొంత కాలం చేయగలరు. అందరినీ ఎల్లకాలం వెర్రివారిని చేయలేరు.’ అన్న అబ్రహం లింకన్‌ మాట మోడీజీ మరచినట్టున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page