జరిగింది పొరపాటు.. చేస్తారా సర్దుబాటు?
- NVS PRASAD

- Aug 13
- 3 min read
రాజకీయ రచ్చ సృష్టించిన నామినేటెడ్ జాబితా
కాళింగ, కళింగ వైశ్య వర్గాల్లో ఎడతెగని చర్చ
తప్పును గ్రహించి కళింగ కార్పొరేషన్ నియామకం రద్దు
మొదలవలస రమేష్‌కు రాష్ట్రస్థాయి పదవి ఇచ్చే ఛాన్స్
జిల్లాలో పెండిరగు పదవులకూ పలువురి యత్నాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా మొదలవలస రమేష్.. ఈ పదవి, ఈ నాయకుడు ట్రోల్ అయినట్టుగా ఈమధ్య కాలంలో జిల్లా లో ఇంకెవరూ కాలేదు. రాష్ట్రంలో 31 కుల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పొందర కుల కార్పొరేషన్ చైర్మన్ పదవి శ్రీకాకుళం జిల్లాకే వచ్చిందని.. ఇప్పటికే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉన్న నరసన్నపేట నియోజకవర్గానికి మరో పదవి రావడం హర్షదాయకమని భావించిన సమయంలో జాబితాలో కాస్త కిందికి దిగితే కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్ పేరు కనిపించింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాళింగ సామాజికవర్గానికి చెందిన మొదలవలస రమేష్‌ను కళింగకోమటి కులంలో చేర్చడంపై స్వయంగా టీడీపీలోనే గందరగోళం ఏర్పడిరది. అత్యంత బలమైన డేటాబేస్ ఉన్న టీడీపీలో కాళింగులకు, కళింగవైశ్యులకు తేడా తెలియకుండా మొదలవలస రమేష్‌ను ఎలా నియమించారనే చర్చ హోరెత్తగా, కాళింగుల వాట్సప్ గ్రూపుల్లో దీనిపై కామెడీ, సెటైర్లతో కూడిన జోకులు కనిపించాయి. ఇప్పటికే కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా నరసన్నపేటకు చెందిన రోణంకి కృష్ణంనాయుడును నియమించినందున మొదలవలస రమేష్‌కు కళింగకోమటి సంఘానికి అధ్యక్షుడిని చేశారని కొందరు, తమ కుల కార్పొరేషన్‌కు ఇంతవరకు చైర్మన్‌ను ప్రకటించకపోగా, కాళింగులకు చెందిన మొదలవలస రమేష్‌ను చైర్మన్‌గా తమపై రుద్దడమేమిటని కళింగకోమట్లు మంగళవారమంతా మల్లగుల్లాలు పడ్డారు.
రాజకీయ, సామాజికవర్గాల్లో గందరగోళం
దీనికి తోడు బుధవారం ఉదయం ప్రముఖ దినపత్రికలో తనను కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ మొదలవలస రమేష్ ప్రకటించినట్లు ఒక వార్త వచ్చింది. అంతవరకు ఇదేదో పొరపాటున ప్రకటించి ఉంటారని, బుధవారానికి సరిదిద్దుకుంటారని కళింగకోమట్లు భావించారు. కానీ దీన్ని స్వాగతిస్తున్నట్టు ఒక పత్రికలో రమేష్ ఫొటోతో వార్త రావడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో గందరగోళం ఏర్పడిరది. వాస్తవానికి మొదలవలస రమేష్‌ను కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గతంలో పార్టీకి సూచించారు. చివరి నిమిషం వరకు ఆయన పేరే వినిపించింది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో రోణంకి కృష్ణంనాయుడును ఆ పదవి వరించింది. దీంతో మొదలవలసకు మరో విడతలో అవకాశం ఇవ్వాలన్న భావనతో పార్టీ ఉంది. ఆ మేరకు 31 నామినేటెడ్ పదవుల జాబితాలో ఆయన పేరు ఉన్నా, అది కూడా తప్పుడు కాలమ్‌లో ఉండటంతో కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌నే మార్చారని, అయితే కాళింగ కార్పొరేషన్ బదులు కళింగ కోమటి కార్పొరేషన్ అని తప్పుగా టైపింగ్ జరిగిందేమోనని అందరూ తొలుత భావించారు. కానీ రెండిరటిలో ఏదీ కరెక్ట్ కాదు. వాస్తవానికి మరో 20 కులాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. మంగళవారం ప్రకటించిన 31 కార్పొరేషన్ల జాబితాలో కొన్ని కులాలు లేకపోవడం వల్ల టీడీపీ మంగళగిరి పార్టీ కార్యాలయంపై ఒత్తిడి పడిరది. ఈ నెల 16లోగా వీటిని భర్తీ చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా టీడీపీ సీనియర్లు దీనిపై కసరత్తు ప్రారంభించారు. కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా తన పేరు ప్రకటించినట్లు మొదలవలస రమేష్‌కు తెలియదు. అప్పటికి తిరుపతిలో ఉన్న ఆయన ఈ విషయం తెలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడలో దిగి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి జిల్లాలో జరిగిన రచ్చను వివరించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల మొదలవలస చైర్మన్‌గిరీపై పార్టీకి స్పష్టత లేకుండాపోయింది. అయితే అంతకు ముందే పార్టీ తన తప్పును గ్రహించి 31 పోస్టుల్లో 30 మాత్రమే అమలులో ఉన్నాయని, ఒక పోస్టును రద్దు చేస్తున్నట్టు మంగళవారం రాత్రే ప్రకటించింది.
ఆ పదవులకు తీవ్ర పోటీ
జిల్లాకు సంబంధించి శిష్టకరణాలు, పోలినాటి వెలమ కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించలేదని.. అసలు ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉందో లేదోనన్న ప్రచారం జరుగుతోంది. వెలమల్లో కొప్పల వెలమ కార్పొరేషన్ పోస్టును ప్రభుత్వం ఇంతకు ముందే భర్తీ చేసింది. మిగిలింది పోలినాటి వెలమలే. వీరికి కూడా ఒక కార్పొరేషన్ ఉండాలని జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాల్లో ఉన్న వెలమలు పట్టుపడుతున్నారు. అదే సమయంలో ఇక్కడ ఒక కేంద్రమంత్రి, ఒక రాష్ట్రమంత్రి పదవులు ఈ సామాజికవర్గానికి ఉన్నాయని, అంతకంటే ముందు మిగిలిన కులాలకు కార్పొరేషన్లు వేయాలని కోరినవారూ లేకపోలేదు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కుల కార్పొరేషన్ల పేరుతో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుందని తెలిసిన వెంటనే ముందుగా సిఫార్సు లేఖలకు ఎగబడినవారు పోలినాటి వెలమలే. వైకాపా హయాంలో ఈ రెండు వెలమ కులాలకు రెండు వేర్వేరు కార్పొరేషన్లు ఇచ్చారు. అందులో ఒకటి ఎస్.కోటకు, మరొకటి నరసన్నపేట నియోజకవర్గానికి కేటాయించారు. సంఖ్యాపరంగా చూసుకుంటే నరసన్నపేట నియోజకవర్గంలోనే పోలినాటి వెలమలు ఎక్కువగా ఉన్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఈ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉంది. కోటబొమ్మాళికి చెందిన వెలమల కామేశ్వరరావు ఈ పదవిపై కన్నేశారు. అయితే అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల సొంత నియోజకవర్గానికి చెందినవారే కావడం వల్ల వెనక్కు తగ్గాల్సివస్తోంది. నరసన్నపేట టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శిమ్మ చంద్రశేఖర్ కూడా ఈ పదవి కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి తెలగ సామాజికవర్గానికి చెందిన అడపా చంద్రశేఖర్‌కు ఇచ్చారు. ఇదే సమయంలో సారవకోట మండలానికి చెందిన ధర్మాన తేజకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆశీస్సులు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిట్టి నాగభూషణం తనకు ఓ సిఫార్సు లేఖ ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ఆమధ్య కోరారు. అయితే ఇద్దరు మంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉండటం వల్ల వారి మాటే చెల్లుబాటవుతుందని, తన అభిప్రాయం అడిగితే మాత్రం చిట్టి నాగభూషణం పేరు చెబుతానని చెప్పడంతో ఆ కథ అక్కడితో ముగిసింది. ఇక శిష్టకరణ కార్పొరేషన్ ఛైర్మన్‌ను ఈ 31 మంది జాబితాలో ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ మంగళవారం నాటి లిస్టులో ఈ కులం లేదు. త్వరలో భర్తీ కాబోయే 20 కార్పొరేషన్లలో కళింగకోమట్లు, శిష్టకరణాలు, పోలినాటి వెలమలు ఉంటారని భావిస్తున్నారు. శిష్టకరణ కార్పొరేషన్‌కు కూడా పెద్ద ఎత్తున పోటీ ఉండగా మచిలీపట్నానికి చెందిన ప్రస్తుత శిష్టకరణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అక్కుమహంతి రాజా పేరు మొదటి వరుసలో ఉంది. రాజాం, పార్వతీపురం వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ పదవికి పోటీ పడుతున్నా కొందరు మాత్రం వైకాపా నుంచి టీడీపీలోకి రావడం వల్ల పార్టీ ఆ కోణంలో ఆలోచిస్తుందన్నవారూ లేకపోలేదు. కళింగకోమటి కార్పొరేషన్‌కు సంబంధించి బోయిన గోవిందరాజులు, కోరాడ హరిగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కళింగకోమటి కార్పొరేషన్‌కు చైర్మన్‌గా తప్పుగా ప్రకటించిన మొదలవలస రమేష్‌ను ఏం చేస్తారనేది తేలాల్సిన ప్రశ్న. ఆయన కులానికి సంబంధించిన కార్పొరేషన్ పోస్టు ఇంతకు ముందే భర్తీ అయిపోవడంతో మొదలవలస రమేష్‌ను రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు అయిన ఫైబర్‌నెట్, సీడ్ కార్పొరేషన్, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి ప్రాధాన్యత గల సంస్థల చైర్మన్ ఇస్తారని తెలుస్తోంది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా బుధవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి వెళ్లి మొదలవలస భవితవ్యాన్ని తేల్చనున్నారు.










Comments