top of page

జర్నలిజం అంటే.. నీళ్లు తాగించడమే!

Writer: ADMINADMIN

(డి.వి.మణిజ)

అది 2007. అప్పటికి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌లో అభివృద్ధి ఆకాశపథాన దూసుకుపోతోందని గోడీ మీడియా మనల్నే కాదు ప్రపంచాన్నంతా నమ్మిస్తోన్న పురిటి కాలం. అప్పటికి అంత ప్రఖ్యాతం కాని ఒక జర్నలిస్టు గుజరాత్‌ ముఖ్యమంత్రిని ఒక టెలివిజన్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వమని కోరాడు. పత్రికలకు ఎప్పుడూ ముఖం చాటేసే ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఏ కలనున్నారో గాని, కరణ్‌థాపర్‌ అనే యువజర్నలిస్టుతో ఇంటర్వ్యూలో కూర్చోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ మొదలైంది. దేశమంతా లైవ్‌ చూస్తోంది. ప్రశ్న తర్వాత ప్రశ్నకు మోదీ శరీరం వెనుక భాగాన నెమ్మదిగా చెమట పట్టడం మొదలయింది. అక్కడ మోదీ రెండు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పటి ఇంటర్వ్యూ చూసి (ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని యూట్యూబ్‌ నుంచి మోదీ భక్తులు తొలగించారు) ఇప్పటికీ విశ్లేషకులు వివరిస్తున్నారు. కరణ్‌ థాపర్‌ ప్రశ్నలన్నింటినీ అనర్గళంగా ఇంగ్లిషులో అడగడం మొదటి కారణమైతే, గుజరాత్‌లో వ్యాపారపరంగా, మత కలహాల కారణంగా జరిగిన హత్యలన్నింటికీ నరేంద్ర మోదీ అధికార దాహానికి ముడిపెట్టడం మరో కారణమని వారు చెప్తారు. నిజానికి ఆ ఇంటర్వ్యూ పూర్తి కాకముందే, ఆయన అనుమతి తీసుకుని, మైకు విసిరేసి, ఒక గుక్కెడు నీళ్లు తాగి మోదీ అక్కడి నుంచి ఉడాయించారు. అది లగాయితు ఇంతవరకూ మోదీ ఏ జర్నలిస్టుకూ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఉపన్యాసాలు చెప్పడమే తప్ప, ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూకు మాత్రం మోదీ ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా, విస్పష్టంగా నో అనే చెప్తారు.

అప్పటినుంచీ ఇంటర్వ్యూ లేదంతే..!

కాని కరణ్‌ థాపర్‌ జర్నలిస్టు ప్రస్థానం మాత్రం విజయపథంలో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన ‘ది వైర్‌’ ఆన్‌లైన్‌ పత్రిక కోసం ఒక ఇంటర్వ్యూ చేసి, దేశమంతా సంచలనం సృష్టించారు. ఆ ఇంటర్వ్యూ చేసింది పీకే అనబడే ప్రశాంత్‌ కిషోర్‌తో. ఆనాడు నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి కావడానికి ప్రత్యక్షంగా సహకరించారు పీకే. తన పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఐప్యాక్‌తో గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కష్టపడ్డాడు పీకే. తర్వాత మోదీ ఇంతింతై వటుడిరతై అన్నట్టుగా ఎదిగి, దేశానికే ప్రధాన మంత్రి కావడానికి కూడా ఐప్యాక్‌ ద్వారా ఆయన ఎంతో కృషి చేశారు. అనంతరం ఐప్యాక్‌ సంస్థ ఎవరికి ఎన్నికలలో మద్దతిచ్చినా వారు గెలుస్తూనే వచ్చారు. కింగ్‌ మేకర్‌గా ఎదిగిన పీకే, తానే కింగ్‌ కావాలనుకున్నారు. ఐప్యాక్‌ సంస్థను విడిచిపెట్టేశారు. రాజకీయ గోదాలోకి దూకారు. బీహార్‌ వెళ్లారు. నితిష్‌ కుమార్‌ పంచన చేరారు. ఇద్దరికీ చిన్న అభిప్రాయ భేదం వచ్చి విడిపోయి సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ జన సురాజ్‌ పార్టీకి బీహార్‌ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని పాదయాత్ర మొదలుపెట్టారు, అదంత సులువుకాదని జ్ఞానోదయమై ఆరంభంలోనే రాజకీయ పార్టీ క్రియాశీలతను విరమించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఇంతవరకూ తన ఐప్యాక్‌ సంస్థ ద్వారా సహాయం చేసిన వ్యక్తులకు ఎందుకో తెలియదు గాని శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు.

ఐప్యాక్‌పై కోపమా?

నరేంద్ర మోదీ నిరంకుశుడనీ తిట్టడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలలో సహకరిస్తానని ముందుకొచ్చారు గాని, ఆయన గొంతెమ్మ కోరికలు తీర్చలేక కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పక్కన పెట్టింది. మళ్లీ నరేంద్రమోదీ రాగం మొదలుపెట్టారు. చంద్రబాబు గోప్యంగా కలిసి మంతనాలు జరిపిన తర్వాత జగన్‌ ఓడిపోతారని ఎక్కడ పడితే అక్కడ వాగడం మొదలుపెట్టారు. అడిగినా అడగకపోయినా జగన్‌ ఓడిపోబోతున్నారంటూ విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ఎంతో సహాయం చేసిన పీకే, ఇప్పుడు ఆమెను కూడా తూర్పారబెట్టడం విశేషం. ఐప్యాక్‌ సంస్థతో సమన్వయం చేసుకుంటున్న ప్రతి రాజకీయ పార్టీ అధినేతనూ టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌, ఈసారి అడ్డంగా కరణ్‌థాపర్‌కు దొరికిపోయారు. దేశంలో నరేంద్రమోదీకి మూడు వందల స్థానాల పైపెచ్చు బలం లభించనుందని పీకే జోస్యం చెప్పడాన్ని కరణ్‌థాపర్‌ ప్రశ్నించారు. ఇంతకుముందు మీరు చెప్పిన చాలా జోస్యాలు విఫలమయ్యాయి కదా అని కరణ్‌ వేసిన ప్రశ్నకు సమాధానంగా నేనెప్పుడూ తప్పుడు జోస్యం చెప్పలేదే అని పీకే బుకాయించబోయారు. వెంటనే కరణ్‌ ఆన్‌లైన్‌ పత్రికల్లో వచ్చిన ఆనాటి వార్తలను చూపించారు. అందులో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎన్నికల ఫలితాల విశ్లేషణలు ఉన్నాయి. వాటిని పీకే పట్టించుకోకుండా, పత్రికలు ఏమైనా రాస్తాయి లెండి, మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వీడియో ఫుటేజ్‌ను చూపించమని సవాల్‌ విసిరాడు. అక్కడితో ఆగకుండా, తాను తప్పుడు జోస్యం చెప్పిన వీడియోలు చూపిస్తే తాను బీహార్‌లో స్థాపించిన జన సురాజ్‌ పార్టీని మూసేస్తానని అన్నాడు. దాంతో స్వయంగా పీకే చేసిన ట్విటర్‌ వ్యాఖ్యలను కరణ్‌ థాపర్‌ చూపించేసరికి బిత్తరపోయాడు. వెంటనే పక్కనున్న గ్లాసు తీసుకుని గుక్కెడు నీళ్లు తాగాడు.

స్వతంత్ర జర్నలిజం

ఇంటర్వ్యూ ప్రసారమవుతుండగానే దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఒకవైపు కరణ్‌ ప్రశ్నలకు పీకే బుకాయించాలని ప్రయత్నించడం చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. ఆయన అడిగిన ప్రతి సవాల్‌నూ స్వీకరించి, అప్పటి టీవీ వార్తల క్లిప్‌లను సైతం అక్కడికక్కడే కామెంట్లలో నెటిజన్లు పెట్టడం విశేషం. ఒకవైపు వైర్‌ జర్నలిస్టుల బృందం, మరోవైపు నెటిజన్లు ధీటుగా పీకేకు సమాధానం ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూను చూసేవారికి వీధిపోరాటం చూస్తున్నంత హుషారు వచ్చింది. జర్నలిజంలో స్వతంత్ర జర్నలిస్టులు చేస్తున్న కృషికి ప్రజలు స్వచ్ఛందంగా దాసోహం అవుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తనకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి మీడియా ఛానెల్‌నూ తన గుజరాత్‌ వాణిజ్యవేత్తలతో కొనిపించేసి, పూర్తిగా ఇండియాలో మీడియా అంతటినీ తన గుప్పిట్లో బంధించుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి, ఆయన పాలన గురించిన అసలు నిజానికి ఒకవిధంగా ఈ దేశ ప్రజలకు తెలియకుండా పోయేవే. వీటన్నింటినీ ఎదిరించి రిపోర్టింగ్‌ చేసిన వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, పోలీసు కేసులు పెట్టి అరెస్టులు సాగిస్తూ ఒక విధమైన నిర్బంధకాండ దేశంలో అమలవుతోంది. దీనికి ధీటుగా ఎదురొడ్డి నిలుస్తున్న యువ జర్నలిస్టు ధృవ్‌ రాఠీ దేశం విడిచిపెట్టి వార్తల వెనుక వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన దుస్థితి. అలాంటి సమయంలో కరణ్‌ థాపర్‌ లాంటి వారు గొప్ప ఆశాకిరణాలుగా కనపడతారు. ఇండిపెండెంట్‌ జర్నలిజాన్ని ధైర్యంగా కాపాడుకుంటోన్న ‘ది వైర్‌’కు జోహార్లు!

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page