top of page

జేఎంఎం అస్త్రసన్యాసం.. ఎవరికి నష్టం?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 23
  • 2 min read
ree

దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ప్రధాన ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ముఖచిత్రం కనిపిస్తోంది. జాతీయస్థాయిలో మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమే ఇక్కడా అధికారంలో ఉంది. ఈ కూటమి తన ప్రధాన భాగస్వామి అయిన జేడీయూ నేత నితీష్‌కుమార్‌ నేతృత్వంలో మరోసారి ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వంపై ఉండే సహజమైన వ్యతిరేకత, అసంతృప్తి, జేడీయూ`బీజేపీల మధ్య లుకలుకలతోపాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌తో కూడిన మహా ఘటబంధన్‌ ఇటీవలి కాలంలో బలం పుంజుకున్నట్లు పలు సర్వేలు వెల్లడిరచాయి. అయితే కూటముల మధ్య సీట్ల పంపకాల దగ్గరే ఎవరిది పైచేయి కావచ్చో తెలిసిపోయింది. అధికార ఎన్డీయే కూటమి మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తినా వాటిని బీజేపీ కేంద్ర పెద్దల చొరవతో వెంటవెంటనే సర్దుబాటు చేసుకోగలిగారు. ఫలితంగా ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాలు సానుకూలంగా సాగాయి. మొత్తం 243 సీట్లలో ప్రధాన భాగస్వాములైన బీజేపీ, జేడీయూ సమానంగా 101 చొప్పన సీట్లలో పోటీ చేస్తున్నాయి. కూటమిలో మిగతా పక్షాలైన లోక్‌జనశక్తి పార్టీకి 19, రాష్ట్రీయ లోక్‌ మోర్చా, హిందుస్థానీ అవామ్‌ మోర్చాలకు చెరో ఆరు స్థానాలకు కేటాయించారు. రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా వాటి నామినేషన్లకు ముందు ఎన్డీయే సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని ఎన్నికల బరిలోకి దిగింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన మహా ఘటబంధన్‌ నామినేషన్ల ఘట్టం ముగిసేవరకు కుమ్ములాటలు, కీచులాటలతో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంది. గత కొన్ని ఎన్నికల నుంచి మహా ఘటబంధన్‌లో ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగిన జార్ఖండ్‌ ముక్తిమోర్చా(జేఎంఎం) వీటి కారణంగానే కూటమితో బంధాన్ని తెంచుకోవడమే కాదు.. ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి పూర్తిగా తప్పుకొంది. సీట్‌ షేరింగులో ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కట్రలే తన నిర్ణయానికి కారణమని జేఎంఎం ఆరోపించింది. జేఎంఎం పోటీ నుంచి తప్పుకోవడం వల్ల మహా ఘటబంధన్‌ బలహీనపడుతుందని, ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామాలకు ఆర్జేడీ, కాంగ్రెస్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని, భవిష్యత్తులోనూ ఆ పార్టీలతో పొత్తు కొనసాగించే అంశంపై తాము సమీక్షిస్తామని ఆ పార్టీ పెద్దలు హెచ్చరించారు. రెండు దశల నామినేషన్ల ఘట్టం పూర్తి అయి, ప్రచారం ముమ్మరమవుతున్న తరుణంలోనూ విపక్షం ఇండియా కూటమి (మహా ఘటబంధన్‌)లో విభేదాలు సమసిపోలేదు. సీట్ల పంపకాలు మాత్రం ఏదోలా పూర్తి చేశారు. ఆర్జేడీ 143, కాంగ్రెస్‌ 60, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) 16, సీపీఐఎంఎల్‌ (లిబరేషన్‌) 20, సీపీఐ 9, సీపీఎం 4 స్థానాల్లో పోటీ చేయాలని అధికారికంగా నిర్ణయించాయి. కానీ ఈ ఒప్పందానికి విరుద్ధంగా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, ఆర్జేడీ అభ్యర్థులు బరిలోకి దిగడం ఆ కూటమికి చేటు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు నర్కటియాగంజ్‌, కహల్‌గాం, వైశాలి వంటి పలు నియోజకవర్గాల్లో మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇంకా పలు నియోజకవర్గాల్లో ఇటువంటి అనైతిక పోటీ నెలకొంది. అయితే ఆయా పార్టీలు దీన్ని స్నేహపూర్వక పోటీ అని అభివర్ణిస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల అవకాశాలను మెరుగుపరుస్తుందంటున్నారు. మరోవైపు జేఎంఎం బరి నుంచి తప్పుకోవడం మహాఘటబంధన్‌పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. అవిభక్త బీహార్‌ రాష్ట్ర ఎన్నికల రాజకీయాల్లో జేఎంఎం కీలకపాత్ర పోషిస్తూ వచ్చింది. బీహార్‌ విడిపోయి జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడినా బీహార్‌ రాజకీయాల్లో జేఎంఎం పాత్ర ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఎన్నికల్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీకి అపారమైన పట్టుంది. అందువల్ల ప్రతి ఎన్నికల్లోనూ బీహార్‌-రaార్ఖండ్‌ సరిహద్దు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ వస్తోంది. ఎక్కడా గెలవకపోయినా గణనీయ సంఖ్యలో ఓట్లు సాధిస్తున్న చరిత్ర ఉంది. ఆ ఓట్లు మహాఘటబంధన్‌ అభ్యర్థులకు ఉపయోగపడేవి. అటువంటి పార్టీ ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడం.. దానికి కారణం కాంగ్రెస్‌, ఆర్జేడీలేనని తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లు ఆ రెండు పార్టీలకు పడే అవకాశాలు కనిపించడంలేదు. ఫలితంగా ఈసారి ఆ ఓట్లు వృథా కావచ్చు లేదా ప్రత్యర్థి ఎన్డీయే కూటమికైనా పడవచ్చు. ఏది జరిగినా మహాఘటబంధన్‌కు నష్టం తప్పదు. జేఎంఎం నిర్ణయం ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ కూటమిలోని ప్రధాన భాగస్వామి బీజేపీ తీవ్రంగానే స్పందించింది. రaార్ఖండ్‌ ముక్తి మోర్చా తన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిందని, ఇది ఆ పార్టీకే కాకుండా జార్ఖండ్‌కే మచ్చగా నిలుస్తుందని అభివర్ణించడం ద్వారా జేఎంఎం నిర్ణయం తమకు రాజకీయంగా లభిస్తుందన్న వాదనలను తిరస్కరించేందుకు ప్రయత్నించింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేదికలో రాజకీయ హీట్‌ మరింత పెరుగుతోంది. ఒకవైపు మహాఘటబంధన్‌ విభేదాలు, మరోవైపు బీజేపీ దూకుడు మధ్య ఈసారి బీహార్‌ ప్రజలు ఎటువంటి తీర్పు చెబుతారోనన్న ఆసక్తి పెరుగుతోంది. బీహార్‌లో రెండు దశల్లో వచ్చే నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం ఇప్పటికే పూర్తిగా ప్రచారం ఊపందుకుంటోంది. నవంబర్‌ 14న ఫలితాలు ప్రకటిస్తారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page