top of page

జ్ఞానానికీ.. పాండిత్యానికీ అర్థాలు మారాయి..!

Writer: ADMINADMIN

వేదం చదవడం, వేదోపదేశం తీసుకోవడం అంతా ఒక దశలో విజ్ఞానమనే అనుకున్నారు. అందుకే వేదమూ, విజ్ఞానమూ, వేదోపదేశాన్ని ఒకే గాడిలో కట్టగట్టి పదేశారు. అయితే ఆధునిక ఆలోచనా ధోరణితో వైజ్ఞానిక ప్రగతి సాధిస్తున్నకొద్దీ స్పష్టమైందేమంటే.. వేదం గానీ, వేదోపదేశంగానీ విజ్ఞానానికి సరిరావు. వేదాలు, వేదోపదేశాలు గొప్పవి అని విశ్వసించే వారితో మనకు వాదనలేదు. వారి విశ్వాసాలు వారివి. విజ్ఞానం - సైన్సు ఈ విశ్వానిది.

సైన్సు.. ఏ ఒక్క మతమో విశ్వసించేది కాదు. నిజానికి అన్ని మత విశ్వాసాల్ని బద్దలుకొట్టేది. వాస్తవాల్ని తేటతెల్లం చేసేది సైన్సు. అందువల్ల పూర్వీకులు భావించిన జ్ఞానం వేరు. ఇప్పుడీ అత్యాధునిక యుగంలోని జ్ఞానం వేరు. ‘జ్ఞాన మొసగ రాదా.. సుజ్ఞాన మొసగరాదా’ అని త్యాగరాయ కీర్తన ఉంది. అక్కడ జ్ఞానమంటే ఏమిటీ? ఓ ప్రభూ.. ఓ దేవా నిన్ను పూజించే, నిన్ను కీర్తించే జ్ఞానం నాకివ్వరాదా.. అని ప్రాధేయపడడం. అంతేగాని, మనం అనుక్షణం పీల్చే ప్రాణవాయువు.. ఆక్సిజన్‌ ఎలా తయారవుతుందన్న అవగాహన ఇమ్మని కాదు. జ్ఞానమంటే గుడ్డిగా ప్రతిదాంట్లో దేవుణ్ణి చూడగలగడం కాదు. దేవుణ్ణి ప్రశ్నించేది జ్ఞానం. దేవుణ్ణి శోధించేది జ్ఞానం. నమ్మడం జ్ఞానం కాదు. నమ్మకాల్ని చేధిస్తూ, వాస్తవాల్ని వెలికితీసేది జ్ఞానం. ‘జ్ఞాన మొసగరాదా’ అంటే ఉన్న ఫళాన ఎవరో ప్రసాదించేది కూడా కాదు.. జ్ఞానం!

మొదట అక్షరాలు, సంఖ్యలు నేర్చుకుని ఆ తర్వాత భూమి గూర్చి, విశ్వం గూర్చి, సమాజం గూర్చి, సమాజంలోని అనేకానేక విషయాల గూర్చి, ముఖ్యంగా జీవ పరిణామం గూర్చి నిరంతరం లోతుగా అధ్యయనం చేస్తూ ఉండడమే జ్ఞానం! ఆదీ-అంతం లేనిది జ్ఞానం!! పరిపూర్ణ జ్ఞానసాధన అంటూ ఏదీ ఉండదు.

‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అంటే పొట్ట పోసుకోవడానికి కొందరు నానా గడ్డీ తింటూ జనం ముందు వేషాలు వేస్తుంటారు. వారిదంతా జ్ఞానమూ కాదు. వారంతా జ్ఞాన గురువులూ కాదు.

గతంలోని రుషుల్ని, సాధువుల్ని, వారు ఆయా కాలాలలో, సమాజాలలో చేస్తూ వచ్చిన కృషిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఆయా కాలాలకు, ఆయా సమాజాలకు కావల్సింది వారు చేస్తూ వచ్చారు. అది అట్లా ఉండనిద్దాం. అయితే ఇప్పుడు ఆ కాలమూ, ఆ సమాజ స్వరూపమూ పూర్తిగా మారిపోయినప్పుడు.. ఇంకా మారిపోతూ ఉన్నప్పుడు వేల ఏళ్ల క్రితం రాసుకున్న మంత్రాలు, శ్లోకాలు, కీర్తనలు వగైరా సమకాలీన జీవనానికి ఏమాత్రం ఉపయోగపడవు. ముందు ఆ విషయం గ్రహించుకోవాలి. విహార యాత్రకు వెళ్లి మహాబలిపురం శిల్పాలు, అక్కడి రాతి రథాలు చూసి ఆనందించినట్టు, వీటని కూడా అలాగే పరిగణించాలి. ఆ రథాలు ఎలా ఉపయోగంలోకి రావో, ఈ మంత్రాలూ పనిచేయవు. శ్లోకాలకు, కీర్తనలకు ఏ శక్తీలేదు.

ఈ విషయం అందరూ గ్రహించుకోవడం మంచిది. లేదూ శక్తి ఉందీ అని ఎవరైనా అంటే.. మంత్రం వేసి చనిపోయిన వారిని బతికించాలి. లేదా బాగా జబ్బు పడ్డవారి ముందు కీర్తనలు పాడి ఆరోగ్యవంతుల్ని చెయ్యాలి. డాక్టర్లు, వైద్యపరికరాలు దరిదాపుల్లో లేకుండా ఈ పనులు చేసి చూపాలి. గతంలోని మంచిని మనం స్వీకరించాలి కదా అని అంటే నిజమే తప్పకుండా స్వీకరించాలి. ఉదాహరణకు ‘అబద్ధం ఆడకు’ సూక్తి వేల సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని స్వీకరిద్దాం. ఆచరిద్దాం.


బట్టీ పట్టిన శ్లోకాలు అనర్ఘళంగా చదవగలిగితే, భాషా పాండిత్యముంటే.. ‘మహా పండితుడు-జ్ఞాని’ అని వాడుకలో వ్యవహరిస్తున్నాం.అతనెప్పుడో చిన్నప్పుడు చదువుకున్న అమరం, రామాయణం, భాగవతం వగైరాలు ఒప్పజెప్పడం తప్ప, అందులో సృజనాత్మకత ఏముందీ? అతని ఒరిజినాలిటీ ఏముందీ? ఈ కఠిన వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే మనం ‘జ్ఞానం’, ‘పాండిత్యం’ వంటి అనేక పదాలకు నిర్వచనం మార్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే వాటి పరిధి పెరిగింది. అవి విస్తరించాయి. ఒక్కోసారి అర్థం కూడా మార్చుకుంటున్నాయి.

ఈ పంతుళ్లు, పండితులు, జ్యోతిష్యులు, ప్రవచనకారులు, బాబాలు, స్వాములు, పీఠాధిపతులు, మానవ దేవుళ్ల వల్ల ప్రపంచంలో ఎక్కడా రవ్వంతయినా అభివృద్ధి జరగలేదు. గ్యారెంటీగా ఇక ముందు కూడా జరగదు. వీళ్లేమైనా ఆర్థికరంగ నిపుణులా, రక్షణ శాఖ నిపుణులా? చరిత్ర పరిశోధకులా? లేక వీరికి ఏ కళలోనైనా ప్రవేశముందా? వైజ్ఞానిక స్పృహ ఉన్నవారా? కనీసం ఇంగితజ్ఞాన సంపన్నులా? ఏదీకారే? ‘విషయం’ ఇదీ అనేది లేకుండా జీవాత్మ పరమాత్మ అంటూ మనువాదమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేవారిని పక్కన పెడితే ప్రజలు బాగుపడతారు. ఎవరికి ఏ విషయం మీద పరిజ్ఞానం ఉందో అది వారి నుంచి తెలుసుకోవాలి. అంతేగానీ, మానసిక బలహీనులకు జనం ఎందుకు సమయమిస్తున్నారో వారే ఆలోచించుకోవాలి. అభూత కల్పనల్ని ఎందుకు నమ్ముతున్నారో వారికి వారే అవలోకించుకోవాలి. బలహీనతల్లోంచి జనం బయటపడితే దొంగస్వాముల ఆటలు సాగవు. జనం తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తే వారికి వారే మేలు చేసుకున్నవారవుతారు.

వాడుకలో లేని సంస్కృత శ్లోకాలు చదివి, జనాన్ని మభ్యపెట్టేవారిది, భయపెట్టే వారిది ఏమాత్రం జ్ఞానం అనిపించుకోదు. భాషా పండితులే కాదు, మత జ్ఞానాన్ని ప్రసాదించే ‘పెద్దలు’ కూడా కొందరుంటారు. ఇలాంటి వారిది అజ్ఞానమే కానీ, జ్ఞానం కాదు. ‘మోడీ ఎన్నికయితే విదేశాల్లో ఉన్న 40 లక్షల కోట్ల నల్లధనాన్ని దేశంలోకి తీసుకొస్తార’ని పతంజలి రామ్‌దేవ్‌ బాబా చెప్పారు. మోడీ అధికారంలోకి వస్తే ‘డాలరు విలువ రూ.40కి దిగువ ఉండేట్టు చూస్తార’ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ ప్రవచించారు. ఈ ‘జ్ఞానగురువు’ల జోస్యాలు తప్పాయి. కానీ మీ ‘జ్ఞానం’ ఇలా తగులబడిరదేమని అడిగేవారు లేరు. ఆయా విషయాలలో వీరికి ఏ ప్రవేశం ఉందని ఈ ప్రకటనలిచ్చారు? నిజంగా వారు మహిమాన్వితులే అయితే అవి నిజం కావాలి కదా? అహంభావంతో తమది ‘జ్ఞానబోధ’ అనుకునే ఇలాంటి జ్ఞాన గురువులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజకీయ నేతల సహకారంతో వ్యాపారాలు చేసుకుంటున్న ఈ జ్ఞాన గురువులు వాస్తవాలు గ్రహిస్తే మంచిది. తమను తాము మోసం చేసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. మరోవైపు సామాన్య జనం వివేకవంతులై, అలాంటి వారిపై దృష్టి సారించకుండా, పట్టించుకోకుండా ముందుకు పోవడం అవసరం! నాన్చుడు ధోరణి మాని, పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా ఆలోచించుకోవాల్సి ఉంది. ఆచరించాల్సి ఉంది. సంశయాలతో, సందిగ్ధాలతో బతుకు దుర్భరం చేసుకోనవసరం లేదు.

- డాక్టర్‌ దేవరాజు మహారాజు

ప్రముఖ సాహితీవేత్త, రిటైర్డ్‌ బయాలజీ ప్రొఫెసర్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page