top of page

జీతాలు ‘గోవిందా’!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 25
  • 2 min read
  • అరసవల్లిలో అవుట్‌సోర్స్ ఉద్యోగుల గగ్గోలు

  • రెండేళ్లకోసారి మారిపోతున్న ఏజెన్సీ

  • మూడు నెలలుగా జీతాలదక అవస్థలు

  • ఇచ్చినప్పుడల్లా PF, ESI పేరుతో కోతలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అరసవల్లి దేవస్థానంలో ఉద్యోగుల నియామకాలు, వేతనాల చెల్లింపులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారిలో మెజారిటీ ఉద్యోగులు NMR, అవుట్ సోర్సింట్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారే. వీరి నియామకాల్లో స్థానిక రాజకీయ నేతల జోక్యం మితిమీరుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే చిరుద్యోగులు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఉద్యోగం కోల్పోవడం పరిపాటి. ఈ ఉద్యోగులను సరఫరా చేసే ఏజెన్సీలను రెండేళ్లకోసారి మార్చేస్తున్నారు. ఆ సందర్భంలో పాత ఏజెన్సీలో పని చేసే సిబ్బందికి రాజకీయాలను అంటగట్టి నచ్చనివారికి ఉద్వాసన పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయ పాలకమండలి, అధికారుల ప్రమేయంతో పనిలేకుండా నాయకులు జోక్యంతోనే ఈ వ్యవహారాలు సాగిపోతుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రథసప్తమి తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి లో పాత సంస్థను పంపించేసి స్వీపింగ్, సెక్యూరిటీ సర్వీసులను ది యారో సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థకు అప్పగించారు. BSFలో పనిచేసి రిటైర్ అయిన నగరానికి చెందిన గోవిందరావు పేరుతో ఈ సంస్థను నిర్వహిస్తున్నప్పటికీ, నగరానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. దీనికి రిజిస్ట్రేషన్ కూడా లేదని అంటున్నారు.

సంస్థ మారినప్పుడల్లా తిప్పలే

దేవస్థానంలో ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న 37 మంది సెక్యూరిటీ, 15 మంది స్వీపింగ్ సిబ్బందిని కొనసాగించాలన్న షరతుతో యార్ సంస్థను నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఐదుగురు స్వీపర్లను కొనసాగిస్తూ మిగతా పదిమందిని తొలగించి కొత్తవారిని నియమించినట్లు తెలిసింది. కొత్త స్వీపర్‌కు రూ.9వేలు, సీనియర్లకు రూ.10వేలు, సెక్యూరిటీ గార్డుకు రూ.12 వేలు వేతనం ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అయితే సెక్యూరిటీ గార్డులకు మÖడు నెలలుగా సంస్థ వేతనాలు చెల్లించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేతనంలో కూడా కోతలు పెడుతున్నారు. స్వీపర్లకు నెల జీతంలో రూ.వెయ్యి తగ్గించి ఇస్తూ PF, ESI కటింగ్ అని చెబుతున్నారని అంటున్నారు. సెక్యూరిటీ గార్డుల జీతం రూ.12 వేలు కాగా, కేవలం పదిమందికి అది కూడా రూ.9 వేలు చొప్పున చెల్లించి మిగతా 27 మందికి మూడు  నెలలుగా నాగా పెడుతున్నారు. ఇదేమిటని నిలదీసిన ఒకరిద్దరిని కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. పది మందికి కోత వేసిన రూ.3వేలకు కూడా PF, ESI కటింగ్ అని చెబుతున్నారు. అయితే తమకు PF, ESI ఖాతాలే తెరవలేదని సెక్యూరిటీ గార్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదని, తాము మాత్రం ఒప్పదం ప్రకారం ప్రతి నెలా ఏజెన్సీ నిర్వాహకుడు గోవిందరావు పేరుతో చెక్కు ఇచ్చేస్తున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page