top of page

జెమీమాపై ఎందుకంత విద్వేషం?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 2
  • 2 min read
ree

మనది ప్రజాస్వామ్య దేశం.. అందులోనూ లౌకికవాద (సెక్యూలర్‌) దేశంగా పేద్ద పేరు. లౌకికవాదం అంటే పౌరులకు మత స్వేచ్ఛనివ్వడం, మత సహనం పాటించడం, కులమతాలకు అతీతంగా దేశాన్ని పరిపాలించడం. లౌకికవాదాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏ అంశాలు, రంగాల్లోనూ మత ప్రమేయం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల నుంచి మొదలుకొని చాలా రంగాల్లో మత ప్రమేయం కనిపిస్తోంది. ఇప్పుడు అది క్రికెట్‌రంగానికి కూడా పాకినట్లు రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. దీనికి కేంద్ర బిందువు మహిళా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌. ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా జట్టును సెమీ ఫైనల్‌లో ఎదిరించి చివరికంటా నిలబడి అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి కొండలా కనిపించిన భారీ స్కోరును కరిగించి భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన ఈ యువ క్రికెటర్‌కు ఇప్పటికీ దేశమంతా జేజేలు పలుకుతోంది. కానీ మరోవైపు ఆమెను జట్టు నుంచే తొలగించాలన్న డిమాండ్లు వినిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఈ డిమాండ్‌కు కారణం మతం. సెమీ ఫైనల్‌లో భారత్‌ విజయతీరాలకు చేరిన తర్వాత కన్నీటి పర్యంతమవుతూ జెమీమా వ్యక్తం చేసిన భావాలు.. చేసిన వ్యాఖ్యలు. వీటినే ఇప్పుడు పలు హిందూ సంఘాలు, సెలబ్రిటీలమని చెప్పుకొనే కొందరు వ్యక్తులు వివాదం చేస్తున్నారు. క్రికెట్‌, నలుగురితో ఆనందంగా గడపడం తప్ప ఇంకో ప్రపంచం తెలియని ఒక యువ క్రీడాకారిణికి మతం రంగు పూసేశారు. ప్రతిభకు వివాదాల పూత పూసేశారు. ఆమెను ఏకంగా జట్టు నుంచే తొలగించేయాలని రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఆనాడు తీవ్ర భావోద్వేగానికి గురైన జెమీమా ఏం మాట్లాడిరదంటే.. ‘ముందు నేను జీసస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనే నన్ను ముందుకు నడిపించాడు. నేను సొంతంగా పోరాడలేకపోయాను. ఆ దేవుడు నన్ను భరించాడు. గత నాలుగు నెలలు నాకు చాలా కఠినంగా గడిచింది. ఇప్పుడు నాకు ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. నేను నా వ్యక్తిగత సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించాలన్న ఆలోచనే నా మైండ్‌లో ఉంది. నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు’ అంటూ జెమీమా చేసిన వ్యాఖ్యల్లో జట్టు విజయం గురించి, తన సెంచురీ కంటే జట్టు గెలవడమే ముఖ్యమన్నట్లు చెప్పడాన్ని పట్టించుకోని మతవాదులు ‘ఈ పోరాటంలో తనను జీసస్‌ ముందుండి నడిపించాడు’ అని చెప్పడాన్నే వివాదం చేస్తున్నారు. అలా చెప్పినందుకు ఆమెపై హిందూ వ్యతిరేకి అన్న ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌ చేస్తూ నిరసనలు ప్రకటిస్తున్నారు. జీసస్‌ పేరు ఉచ్ఛరించిన పాపానికి ఆమెను ఏకంగా టీమిండియా నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెమీమా తండ్రికి సంబంధించిన విషయాలను తెరపైకి తెస్తున్నారు. జింఖానా క్లబ్‌ సౌకర్యాలను ఆమె తండ్రి ఇవాన్‌ రోడ్రిక్స్‌ మతమార్పిడుల కోసం దుర్వినియోగం చేశారని 2024 అక్టోబర్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవాన్‌ సోదరుడు మాన్యువల్‌ మినిస్ట్రీస్‌ అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడని, ప్రెసిడెన్షియల్‌ హాల్‌ లో అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి మతమార్పిడులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పట్లోనే ఈ ఆరోపణలను జమీమా తండ్రి ఖండిరచారు. తనకు మతమార్పిడులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ తన తండ్రిపై వచ్చిన ఆరోపణల వల్ల జమీమా ఎంతగానో నష్టపోయింది. ఇప్పుడు అవే మరోసారి ఆమెను వివాదాల్లోకి నెడుతున్నాయి. ఇక తరచూ వివాదాల్లో మునిగితేలే వెటరన్‌ హీరోయిన్‌ కస్తూరి శంకర్‌ ఈ వివాదంలో తలదూర్చి జెమీమాపై తను ఓ రాయి వేసింది. ఆస్ట్రేలియాపై విజయం తర్వాత జెమీమా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. తీవ్రంగా ఆక్షేపించింది. ‘అలా ఎలా జీసస్‌ పేరు ప్రస్తావిస్తుంది. ఇంకెవరైనా హిందూ దేవుళ్ల పేర్లు ప్రస్తావిస్తే ఊరుకుంటారా?’ అంటూ ట్వీట్‌ ద్వారా విరుచుకుపడిరది. క్రైస్తవ ఆటగాళ్లు ఏసుకు ధన్యవాదాలు చెబితే ఊరుకుంటారు.. అదే హిందూ లేదా సిక్కు ఆటగాళ్లు వారి దేవుళ్ల పేర్లు ప్రస్తావిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించడం ద్వారా ఒకరకంగా ఆమె మత విద్వేషాలను రెచ్చగొట్టారు. ఆ మధ్య తెలుగువారిపైనా కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంది. తమిళనాడులోని అంతఃపురాల్లో సేవలు చేసేందుకే తెలుగువారు వచ్చారని.. వారిలో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణీ అవుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. దాని ఫలితంగా జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులోనే భారతీయ జనతా పార్టీలో చేరిన ఆమె తాజా వివాదంలోనూ తలదూర్చి తన వాచాలత్వంతో విద్వేష వ్యాఖ్యలు చేసింది. జెమీమా తన భావ వ్యక్తీకరణలో భాగంగా చేసిన వ్యాఖ్యల్లో మిగతా అంశాలన్నీ ఈ సోకాల్డ్‌ హిందూవాదులు గాలికొదిలేశారు. ఆమె మాటల్లో దొర్లిన ‘జీసస్‌కు కృతజ్ఞతలు’ అన్న పదబంధమే వారికి పంటి కింద రాయిలా సలుపుతోంది. వారిలోని మత ఉద్రేకాలు తన్నుకొస్తున్నాయి. హిందూ మతానికి, దేవుళ్లకు అపచారం జరిగిపోతుందన్నట్లు రెచ్చిపోతున్నారు. అటువంటి సందర్భాల్లో.. అద్భుత విజయాలు సాధించినప్పుడు, ఊహించని విధంగా ప్రమాదాల నుంచి బయటపడినప్పుడు మనిషన్నవాడు సహజంగానే దేవుడిని తలచుకోవడం చాలా సహజం. ఆ దేవుడి దయ వల్ల లేదా రాముడు లేదా అల్లా దయ వల్ల విజయం సాధించాననో లేదా ప్రమాదం నుంచి బయటపడగలిగాను’ అని భావోద్వేగంతో స్పందించడం సహజ భావ ప్రకటన ప్రక్రియ. జెమీమా క్రిస్టియన్‌ కుటుంబానికి చెందినదైనందున జీసస్‌కు ఆ క్రెడిట్‌ ఇచ్చింది. మనమైనా అదే చేస్తాం కదా!.. ఇందులో తప్పుపట్టాల్సింది ఏముంది? వేటు వేయాల్సిన అగత్యమేముంది??

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page