జిల్లాకు జ్వరమొచ్చింది!
- BAGADI NARAYANARAO

- Sep 13
- 2 min read
అన్ని ప్రాంతాల్లోనూ వైరల్ జ్వరాల విజృంభణ
జ్వరపీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
కేసులు వేగంగా పెరుగుతున్నట్లు చెబుతున్న అధికార లెక్కలు
అయినా ఆస్థాయిలో నియంత్రణ చర్యలు నిల్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జలుబు, జ్వరం, దగ్గు.. ఒకటే ఒళ్లు నొప్పులు.. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఒకటే నిస్సత్తువ. ఇటువంటి కేసులతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా జిల్లా అంతా జ్వరాలతో అల్లాడిపోతోంది. గత నెల రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా రోజుల తరబడి ముసురు పట్టడం.. తరచూ భారీ వర్షాలు కురుస్తుండగా.. అంతలోనే మధ్యలో తీవ్ర ఎండలతో వాతావరణం క్షణానికోలా మారిపోతోంది. జిల్లా అంతటా రోడ్లు, లోతుట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీనివల్ల విషజ్వరాలు విజృంభించి ప్రజలు జ్వరాల బారిన పడి మంచమెక్కుతున్నారు. జిల్లావ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 11 నుంచి ఈ నెల ఆరో తేదీ సుమారు నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 48 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించిన వారి లెక్క. దీన్నిబట్టి జిల్లాలో వైరల్ జ్వరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటే.. గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల వారు సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఫీవర్ సర్వే చేస్తున్నా అందుకు తగిన చర్యలు తీసుకోవడంలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)కు జనాలు క్యూ కడుతున్నారు.
పారిశుధ్య లోపమే ప్రధాన కారణం
పారిశుధ్య లోపంతో దోమలు వృద్ధి చెందడంతో పాటు నీరు కలుషితమై జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిందంటే.. వారి వెనుకే వారం లోపు మిగతావారు జ్వర పీడితులవుతున్నారు. విష జ్వరాలతో రిమ్స్ ఓపీకి రోజూ 200 మంది వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. జ్వరాల తీవ్రతతో ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా పెరిగినట్లు చెబుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే లెక్కలు పక్కన పెడితే జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మలేరియా, డెంగీ వ్యాధులపాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న వారి వివరాలు మాత్రం నమోదు కావడం లేదు. విషజ్వరాలు ప్రబలడానికి బారిన అపారిశుధ్యమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. 15వ ఆర్ధిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు విడుదల చేయలేదు. నిధులు లేకపోవడంతో పారిశుధ్య పనులు చేయించడానికి అవకాశం లేకుండా పోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులను జూన్‌లోనే పూర్తి చేయాల్సి ఉన్నా నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. బావులు, రక్షిత మంచినీటి పధకాలు క్లోరినేషన్ , దోమల మందుల పిచికారీ వంటివేవీ జరగడం లేదు. దీంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పెరుగుతున్న కేసులు
జిల్లాలో మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యాతో బాధ పడుతున్న కేసులు మాత్రమే నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అది కూడా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నవారి వివరాలు మాత్రమే నమోదు చేసినట్టు చెబుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 32 మలేరియా, ఐదు డెంగ్యూ, ఐదు చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఎక్కువగా జూన్, జులై, ఆగస్టు నెలల్లోనే నమోదు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 33 మలేరియా, 37 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిలో మలేరియా కేసులు జులై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో నమోదయ్యాయి. డెంగీ కేసులు ఆగస్టు, సెప్టెంబర్‌లో వెలుగు చూశాయి. డెంగీ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. ఫీవర్ సర్వే వివరాల ఆధారంగా విషజ్వరాల బారిన పడినవారికి పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాధి వివరాలు నమోదు చేస్తున్నారు. గత మూడు నెలలుగా జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి అధికారిక లెక్కలే నిదర్శనం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారినే లెక్కలోకి తీసుకుంటుండగా.. అంతకంటే కొన్ని రెట్లు అధికంగా రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా.. ఆ లెక్కలు మాత్రం ఆరోగ్యశాఖ వద్ద లేవు. లక్షణాలు ఉన్నా, లేకున్నా డెంగీ పేరుతోనే రోగులకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లోనే డెంగీకి సంబంధించి ఎలీసా టెస్టులు చేసే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు, లేబొరేటరీల్లో అనధికారికంగా పరీక్షలు చేసి డెంగీ సోకినట్లు నిర్ధారించేస్తున్నారు.










Comments