top of page

జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 13, 2025
  • 4 min read
  • ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో మారిన పరిస్థితి

  • వారిలో నలుగురు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు

  • రాష్ట్ర ప్రభుత్వంపైనా పెరుగుతున్న వ్యతిరేకత

  • ఎన్నికల హామీలు చాలావరకు అమలుకావడంలేదని విమర్శలు

  • ఐఐటీయన్ల సర్వేలో మోగిన ప్రమాద ఘంటికలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయ్యింది. అంటే ఐదేళ్ల పాలనా కాలంలో మూడో వంతు గడిచిపోయింది. ఈ మూడోవంతు పదవీ కాలంలోనే రాష్ట్రంలో, ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ ప్రజాప్రతినిధులు తమ పట్ల ప్రజలకు మొహం మొత్తేలా.. వ్యతిరేకత ఏర్పడేలా చేసుకున్నారా? అంటే.. అవుననే చెబుతోంది.. హైదరాబాద్‌ ఐఐటీయన్ల బృందం నిర్వహించిన సర్వే నివేదిక. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు ఈ బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మరో ముగ్గురిపైనా అసంతృప్తి కనిపించగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే పట్ల సానుకూలత వ్యక్తం కావడాన్ని ఒక హెచ్చరికగా భావించాల్సి ఉంది. జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ అధికార కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలవారీగా.. ప్రతి జిల్లాలో సగటున 1200 మంది నుంచి మూడ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఐఐటీయన్ల గ్రూపు అభిప్రాయాలు సేకరించింది. వివిధ వర్గాలు, రంగాలు, వయసులు, మహిళలు, పురుషులను దామాషా పద్ధతిలో ఎంపిక చేసి మరీ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు వివిధ పథకాల అమలు తీరుపై ప్రశ్నలు సంధించడం ద్వారా రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి తుది నివేదిక రూపొందించారు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఒక ప్రభుత్వం లేదా ఒక ఎమ్మెల్యే పనితీరును అంచనా వేయడానికి ఏడాదిన్నర కాలం స్వల్పమే. మరో మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఈ అసంతృప్తి ప్రతిఫలిస్తుందని గానీ, పథకాలు, ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉంటుందని గానీ, కూటమి కొనసాగింపు, ప్రస్తుత ఎమ్మెల్యేలే పోటీ చేస్తారా అనే అంశాలు తేలకుండా ఈ సర్వే ఫలితాలను రాబోయే ఎన్నికలకు అంటగట్టలేం. కానీ ఈ సర్వే అంచనాలను ఒక హెచ్చరికగా తీసుకుని, అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని పాలక ఎన్డీయే కూటమి గుర్తించాల్సిన అవసరం ఉంది.

సేఫ్‌ జోన్‌లో ఒక్కరే

ఈ సర్వే రిపోర్టు ప్రకారం శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చూస్తే పాలక కూటమికి నిరాశాజనకంగానే కనిపిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఎనిమిది చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు చెరో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఒక్క టీడీపీ ఎమ్మెల్యేనే 46 శాతం సంతృప్తి రేటుతో సేఫ్‌జోన్‌లో ఉన్నారు. మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు 34 నుంచి 45 శాతం మధ్య సంతృప్తి రేటుతో ఫర్వాలేదు అనిపించుకుంటున్నారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం 33 శాతంలోపు సంతృప్తి రేటుతో పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుని రెడ్‌జోన్‌లో ఉన్నారు. వీరిలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే కాగా.. మిగిలిన ఇద్దరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల్లో చాలవరకు ఆచరణలోకి రాకపోవడం లేదా సక్రమంగా అమలు కాకపోవడం వంటి పరిస్థితులు, రాష్ట్రస్థాయి పరిణామాలు వెరసి.. ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతున్నాయని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. ఎంపీల విషయంలోనూ అసంతృప్తే కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమికి 21 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 13 మంది 33 శాతంలోపు అసంతృప్తి రేటుతో రెండ్‌ జోన్‌లో ఉన్నారు. 34 నుంచి 45 శాతంలోపు అసంతృప్తి రేటుతో ముగ్గురు ఎంపీలు ఫర్వాలేదు అన్నట్లు ఉండగా ఐదుగురు ఎంపీలు 46 శాతానికి మించిన సంతృప్తి రేటుతో సురక్షిత స్థానంలో ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి

ఓవరాల్‌ పరిస్థితి చూస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలపై వేర్వేరుగా ఆయా రంగాలకు చెందిన వారి నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికీ న్యాయం చేయడంలేదన్న అసంతృప్తి ఈ సర్వేలో ప్రస్ఫుటమైంది. ముఖ్యంగా మెడికల్‌ కళాశాలలు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఉద్యోగుల జీతాలు వంటి అంశాల్లో కూటమి సర్కారు మాట తప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

`వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 22 అంశాలపై ప్రశ్నలు సంధించగా.. ఏ ఒక్క విషయంలోనూ సంతృప్తి వ్యక్తం కాలేదు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేవని, ఉచిత పంటల బీమా అందడంలేదని 52 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదని 62 శాతం మంది మిర్చి పంటకు గిట్టుబాటు ధరను గత ప్రభుత్వం కంటే తగ్గించేశారని 56 శాతం మంది చెప్పారు. గత సీజను కంటే పొగాకు పంటకు గిట్టుబాటు ధర తగ్గిందని 61 శాతం, మామిడి గిట్టుబాటు ధర తగ్గిందని 68 శాతం రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమైన వరి పంటకు గిట్టుబాటు ధర తగ్గిందని 40 శాతం మంది, వేరుశనగ ధర తగ్గిందని 45 శాతం మంది, అరటి పంటకు గిట్టుబాటు కావడంలేదని 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కంటే మొక్కజొన్న గిట్టుబాటు ధర తగ్గిందని 49 శాతం, ఉద్యానవన పంటలకు గిట్టుబాటు లేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా విస్మరించి ఇప్పుడు రూ. ఏడు వేలే ఇస్తున్నారని 53 శాతం మంది ఆరోపించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందడంలేదని 43 శాతం, ఆర్బీకేలు ఆర్‌ఎస్కేల పనితీరు బాగులేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, ఈ విషయం ప్రతిపక్షం వాదన సమంజసమేనని 45 శాతం రైతులు చెప్పారు. యూరియా కొరత గురించి మాట్లాడకుండా దాన్ని ఎక్కువగా వాడితే క్యాన్సర్‌ వస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం అసమంజసమని 43 శాతం మంది, వరి సాగు తగ్గించాలని అదే సీఎం సూచించడాన్ని 59 శాతం మంది తప్పుపట్టారు. రైతులు పండిరచే పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యాలు సరిగ్గా లేవని 48 శాతం మంది చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పనితీరు ఏమాత్రం బాగులేదని 49 శాతం మంది చెబితే బాగుందని 31 శాతం మందే చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలు పరిష్కారం కావడంలేదని 55 శాతం రైతులు సర్వేలో అభిప్రాయపడ్డారు.

`గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు అసంతృప్తి మూడ్‌లోకి వెళ్లిపోయారు. తమ బకాయిలు సకాలంలో అందడంలేదని 64 శాతం మంది రిటైర్డ్‌ ఉద్యోగులు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, జీతాలు సకాలంలో అందకపోవడంపై 56 శాతం, ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా లేవని 40 శాతం, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో జరగడంలేదని 48 శాతం అసంతృప్తి వ్యక్తమైంది.

`గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్‌పరం చేయడాన్ని 42 శాతం ప్రజలు తప్పుపట్టగా, ఈ చర్య పేదలు, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేయడమేనని 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

`విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ తగదని 40 శాతం మంది తేల్చగా, ప్రైవేటీకరణను ఆపుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ విషయం పట్టించుకోకపోవడాన్ని, ఇనుప ఖనిజం గనులు కేటాయించకపోవడంపై 21 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

అవన్నీ బూటకపు హామీలే

కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనడం ఆచరణ సాధ్యం కాదని, అది కేవలం ఓట్ల కోసం ఇచ్చిన హామీగా 42 శాతం మంది తేల్చేశారు. నిరుద్యోగులకు రూ.మూడు వేల భృతి చెల్లిస్తామన్న హామీ కూడా ఇటువంటిదేనని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు.

`19`59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నెలకు ,ఊ.1500 పింఛను ఇస్తామనడం బూటకమని 43 శాతం మంది, షాపింగ్‌ మాల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు కారు చౌక రేట్లకు భూములు అప్పగించడం తప్పని 53 శాతం మంది స్పష్టం చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page