top of page

జిల్లాలో ఎరువుల కొరత ఉంది

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • అధికారులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారు

  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

  • హౌసింగ్‌ డీఈకి పది బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో ఎరువులు కొరత ఉందని ప్రభుత్వం ద్వారా ఒప్పుకుంటున్నామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. జెడ్పీ చైర్‌పెర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో రవికుమార్‌ మాట్లాడారు. జిల్లాలో ఎరువుల డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడం వల్ల కొరత తీవ్రంగా ఉందని, దీనికి వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన రాహిత్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువులు నిల్వ చేయడం, ఇండెంట్‌ పెట్టి దిగుమతి చేసుకోవడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారన్నారు. ఖరీఫ్‌ వ్యవసాయ పనులు పూర్తయినా రైతులకు ఎరువులు అందుబాటులో లేవన్నారు. వాస్తవాలను దాచిపెట్టి సభలో అధికారులు అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరతకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. రైతుసేవా కేంద్రాల్లోనే ఎరువులు అందుబాటులో ఉంచి డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌, మహిళా సమాఖ్యల ద్వారా ఎరువుల సరఫరాకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వ్యవసాయశాఖ జేడీ స్పందిస్తూ గత ఖరీఫ్‌తో పోల్చితే ఈ ఏడాది ఎరువుల సరఫరా గణనీయంగా తగ్గిందని వివరించారు. జిల్లాకు వచ్చే ఎరువుల్లో 50 శాతం ప్రైవేట్‌కు, మిగతా 50 శాతం రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. రణస్థలం జెడ్పీటీసీ టొంపల సీతారాం మాట్లాడుతూ ఎరువులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో పెట్టి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎరువులతో పాటు పురుగు మందులు రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కోరారు.

ఒక్కరికి పది బాధ్యతలా?

హౌసింగ్‌ డీఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న అప్పారావుకు అదనపు బాధ్యతలు, ఇన్‌ఛార్జిగా ఆ శాఖలో వివిధ విభాగాల్లో పది కీలకమైన పోస్టుల్లో కొనసాగిస్తుండటాన్ని ప్రస్తావించారు. ఇదే పద్ధతిలో జలవనరుల శాఖలో ఇంజినీర్లు ఇఎఫ్‌ఏసీ, ఇన్‌ఛార్జిలుగా ఏళ్లతరబడి కొనసాగుతున్నారన్నారు. జలవనరుల శాఖలో జోన్‌`1లో అర్హులైన ఇంజినీర్లు దశాబ్దాల తరబడి ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదని, దీనికి జోన్‌`5 నుంచి జిల్లాకు వచ్చిన ఇంజినీర్లే కారణమన్నారు. ప్రమోషన్లలో అన్యాయానికి గురైన ఇంజినీర్లను గుర్తించి న్యాయం చేయడానికి సభలో తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. దీన్ని సభ్యులంతా ఆమోదించాలని కోరారు. నీటిపారుదల కాలువల నిర్వహణ గాలికొదిలేశారన్నారు. ప్రత్యేక నిధులు మంజూరుచేసి అవసరమైన చోట కాలువల్లో గుర్రపుడెక్కలు తొలగించే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

టీడీపీ మద్దతుదార్లకే ఎరువులు

టీడీపీ మద్దతుదార్లకే ఎరువులు సరఫరా చేశారని నందిగాం ఎంపీపీ నడుపూరి శ్రీరామూర్తి సమావేశంలో లేవనెత్తారు. నందిగాం మండలంలో టీడీపీ నాయకుల సిఫార్స్‌తో ఆ పార్టీ మద్దతుదార్లకే ఎరువులు పంపిణీ చేసి మిగతా రైతుల పట్ల వివక్ష చూపించారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి కలిగిన జిల్లాలో ఎరువుల కొరత ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సైలాడ గ్రామంలో ఎరువుల కోసం వ్యవసాయ అధికారిపై దాడికి దిగారని వివరించారు. వైకాపా హయాంలో ఆర్‌బీకేలో పేర్లు నమోదు చేసుకున్న రైతులందరికీ ఎరువులు సకాలంలో సరఫరా చేశారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎరువులు పంపిణీ చేసేందుకు కలెక్టర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ వైకాపా హయాంలో వాలంటీర్ల ద్వారా పార్టీ మద్దతుదార్లకే ఎరువుల పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. దీంతో వైకాపాకు చెందిన పలువురు ఎంపీపీ, జెడ్పీటీసీలు ఎమ్మెల్యే శంకర్‌తో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌ జిల్లాలో ఎరువుల కొరత ఉందని తామంతా అంగీకరిస్తున్నామని, సభ్యులంతా గౌరవసభలో రాజకీయాలకు అతీతంగా సమస్యలపై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దీంతో సభ్యులంతా శాంతించారు.

అక్రమ రొయ్యల చెరువులు తొలగించాలి

శ్రీకాకుళం రూరల్‌ మండలంలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను తొలగించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. సముద్రంలో కలిసే ప్రాంతానికి కొన్ని మీటర్లు దూరంలో నాగావళి నదీ ప్రవాహం దిశ మార్చుకోవడానికి రొయ్యల చెరువులే కారణమన్నారు. దీనివల్ల సమీపంలో ఉన్న గ్రామాలు కోతకు గురై నదీగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. పూర్తికాలం పనిచేసే పద్ధతిలో లష్కర్లను నియమించాలని కోరారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువ ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం పరిధిలో వంశధార ఎడమకాలువపై నిర్మాణం చేసిన వంతెనలు శిథిలావస్థకు చేరాయని, వీటి పుననిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జేసీ ఫర్మాన్‌ అహమ్మద్‌ ఖాన్‌, జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page