జిల్లాలో మూడు అన్నా క్యాంటీన్లు
- ADMIN
- Aug 14, 2024
- 1 min read
ప్రారంభించనున్న మంత్రులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో మూడుచోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకొని రాష్ట్రవ్యప్తంగా అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించడానికి నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో పాతబస్టాండ్, ఏడురోడ్లు కూడలి, పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీల్లో బస్టాండ్ వద్ద ఒకటి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిని ఈ నెల 16న కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించనున్నారు. 2018 ఆగస్టులో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు 2019 ఫిబ్రవరిలో మూతపడ్డాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు తెరుచుకోలేదు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు గతంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి తెరపించడానికి మున్సిపల్‌శాఖ ద్వారా ఒక్కో క్యాంటీన్‌కు రూ.13లక్షలు నిధులు విడుదల చేశారు. ఈ నిధులను వెచ్చించి గతంలో నిర్మించిన భవనాలను క్యాంటీన్లుగా మార్పులు చేసి ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు, ఒక కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 70మంది ఒకేసారి భోజనం, అల్పాహారం చేసేందుకు వీలుగా స్టీల్ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టోకెన్లు జారీ చేయడానికి నిర్ణయించారు. వీటి నిర్వహణ బాధ్యతను గతంలో మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా హరేరామ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. గతంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మాత్రమే సరఫరా చేసేవారు. ప్రస్తుతం మూడుపూటలా ఆహారం సరఫరా చేయడానికి హరేరామ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.
మెనూ ఇలా..
మెనూలో వారంలో ఆరు రోజులు అల్పాహారంగా ఇడ్లీతో పాటు ఆరు రోజుల్లో రెండు రోజులు పూరి, ఉప్మా, పొంగల్ అందుబాటులో ఉంచనున్నారు. అల్పాహారంగా ఇడ్లీలు మూడు, ఉప్మా, పొంగల్ 250 గ్రాములు, చట్నీ 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు ఇవ్వనున్నారు. లంచ్, డిన్నర్‌లో వైట్‌రైస్`400 గ్రాములు, పప్పు 120 గ్రాములు, కూర 100 గ్రాములు, పెరుగు 75 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు వడ్డించనున్నారు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్. ఆదివారం సెలవుగా నిర్ణయించడంతో మిగతా రోజుల్లో అల్పాహారం ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు, లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు, డిన్నర్ 7.30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కేవలం 5 రూపాయలకే వీటిని సరఫరా చేయనున్నారు. సెల్ఫ్ సర్వీస్ మోడ్‌లో వీటిని వినియోగదారులకు సరఫరా చేస్తారు. రోజూ మూడు పూటలు కలుపుకొని 1200 మందికి ఆహారం సరఫరా చేయాలని ఆలోచన చేస్తున్నారు. ధరల పట్టికతో పాటు మెనూ బోర్డును అన్నాక్యాంటీన్లలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మొదట మూడు ఇడ్లీలు సరఫరా చేసి రద్దీ పెరగడంతో రెండు ఇడ్లీలను సరఫరా చేశారు. రద్దీ పెరిగితే మెనూలో మార్పులకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Comments