నకిలీ సదరం సర్టిఫికేట్‌లే ఇందుకు కారణం
ఇప్పటికే పూర్తయిన ర్యాండమ్ చెక్
ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల ధ్రువీకరణలోనూ తప్పులు దొర్లాయి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పింఛన్లు ఏరివేతపై కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు అధిక సంఖ్యలో వచ్చాయి. దీంతో ప్రభుత్వం ర్యాండమ్‌గా పింఛన్లు తనిఖీ చేయాలని నిర్ణయించి జిల్లాకు ఒక వార్డు, గ్రామ సచివాయం పరిధిలో పింఛన్లు తనిఖీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 వార్డు/ గ్రామ సచివాలయాల పరిధిలో అన్ని కేటగిరీల్లో 10,958 మంది పింఛన్లను తనిఖీ చేస్తే, అందులో 563 మంది అనర్హులుగా గుర్తించారు. వీరి పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ల పెన్షన్లను కట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు వారికి నోటీసుల జారీకి సిద్ధమైంది. ఈ నోటీసులను గ్రామ, వార్డు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా జారీ చేయడానికి సన్నద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రంలో సుమారు 65 లక్షల సామాజిక భరోసా పింఛన్లు ఇస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఈ సంఖ్య 63.92 లక్షలకు తగ్గింది. ఈ లెక్కన 1.56 లక్షల మందికి పింఛన్లు నిలిచిపోయినట్టు సెర్ఫ్ విడుదల చేస్తున్న ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేశారు. జిల్లాల్లో తనిఖీ చేసిన ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం సచివాలయం పరిధిలో అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. అలాంటి పింఛన్లు కట్ చేయాలని ఏపీ సర్కారు డిసైడ్ అయింది.
దివ్యాంగుల్లో అనర్హులే అధికం
అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి తనిఖీ చేసిన పింఛన్లలో 5 శాతం అనర్హులు ఉన్నట్టు తేలింది. జిల్లాలో అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని గ్రీవెన్స్‌లో అనేక ఫిర్యాదులు రావడం, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇన్నాళ్లూ అనర్హులు పింఛన్లు పొందుతూ వచ్చారు. సదరం ధ్రువీకరణతో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నవారు జిల్లాలో 31,997 మంది ఉన్నారు. వీరిలో అనర్హులు 10 శాతానికి మించి ఉంటారన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది.
కోటబొమ్మాళి మండలం దంత సచివాలయం పరిధిలో 484 మంది వివిధ కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 78 మంది దివ్యాంగుల ఉండగా, అందులో 56 మంది అనర్హులుగా కలెక్టర్ ఆదేశాలతో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో గుర్తించారు.
ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నవారిలో అనర్హులు 12 మంది ఉన్నారని ఫిర్యాదు రాగా, అందులో 8 మందిని తొలగించారు. ఇలా జిల్లావ్యాప్తంగా వందల్లో అనర్హులు ఉంటారన్న వాదన బలంగా వినిపిస్తుంది. దీంతో ఇటీవల కలెక్టర్లు కాన్ఫరెన్స్‌లో అన్ని కేటగిరీల్లో పింఛన్లు తనిఖీచేసి మూడు నెలల్లో అనర్హులను పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. దీంతోపాటు దివ్యాంగుల పింఛన్లపై ప్రత్యేక వైద్య సిబ్బందితో వైకల్య నిర్ధారణ చేసి అనర్హులను ఏరివేయాలని ఆదేశించారు.
17 మంది అనర్హులు గుర్తింపు
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం సచివాలయం పరిధిలో బలిజిపేట, నందిగాం, చిన్నరావుపల్లి గ్రామాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ లెక్క ప్రకారం 482 మంది వివిధ కేటగిరీల్లో పింఛన్లు తీసుకుంటున్నారు. వీటిని పక్క మండలానికి చెందిన సచివాలయం సిబ్బంది ఎచ్చెర్ల ఎంపీడీవో ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లో వివరాలను అప్‌లోడ్ చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 17 మంది అనర్హులుగా తేలారు. వీరిలో ఎక్కువ మంది ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్నవారే ఉన్నట్టు గుర్తించారు. వీరితో పాటు డప్పు కళాకారుల పేరుతో పింఛన్లు పొందుతున్నవారూ ఉన్నారని తెలిసింది. అనర్హులని అనుమానం కలిగినవారితో తనిఖీ సమయంలోనే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడి నేరుగా వివరణ కోరినట్టు తెలిసింది. దివ్యాంగ పింఛన్లు పొందుతున్నవారిలో ర్యాండమ్‌గా ఇద్దరితో కలెక్టర్ మాట్లాడినట్టు తెలిసింది. వృద్ధాప్య పింఛన్ల విషయంలో వంద శాతం జెన్యూనిటీ ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా కేటగిరీల్లో 1`5 శాతం వరకు అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు లెక్కగడుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ నెల ఒకటికి ఉన్న మొత్తం 3,13,255 పింఛన్లలో 96 శాతం మందికి మాత్రమే పంపిణీ చేశారు. నవంబర్‌లో 3,14,385 మందితో పోలిస్తే డిసెంబర్ నాటికి సుమారు 950 మంది తగ్గారు.
భారీగా కోత తప్పదు
అనర్హుల ఏరివేత పూర్తిస్థాయిలో ప్రారంభమైతే జిల్లాలో సుమారు 12 నుంచి 15 వేలు వరకు తొలగించే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. వీటన్నింటినీ మార్చి నాటికి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వీరందికీ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే పింఛన్ కొనసాగిస్తారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ/ వార్డు సచివాలయాల కార్యదర్శులకు సర్కారు నుంచి సూచనలు రానున్నాయి.
Comentarios