top of page

జీవితమైనా.. ఉద్యోగమైనా..నీవో సగం.. నేనో సగం!

Writer: DV RAMANADV RAMANA
  • `సేవల్లోనూ పాలూతేనెలా కలిసిపోయేతత్వం

  • `ఆదర్శంగా నిలుస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ జంట

  • `ఒకే జిల్లాలో ఎస్పీ, జేసీలుగా పనిచేసే సువర్ణావకాశం

  • `అంతకుముందు పాడేరు ఏజెన్సీలోనూ కలిసే ఉద్యోగాలు

  • `అక్కడే మనసులు కలిసి.. ఒక్కటైన యువజంట

‘మనసులోన.. మనుగడలోన.. నాలో నీవే సగపాలు

వేడుకలోను.. వేదనలోను.. పాలు తేనెగ ఉందాము’..

ఒక సినీ కవి మనసులోంచి పుట్టుకొచ్చిన ఈ ప్రేమ సందేశాన్ని ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తున్న ఓ జంటకు అతికినట్లు సరిపోతుంది. చదవుకొంటున్న సమయంలోనే చిగురించిన ప్రేమనే దాంపత్య బంధమనే అందమైన పొదరిల్లుగా అల్లుకున్న ఈ దంపతులు.. దాంపత్య జీవనంలోనే కాకుండా అధికారిక వ్యవహారాల్లోనూ, సామాజిక సేవలోనూ కలిసి పాల్గొంటూ పాలు తేనెలను తలపిస్తున్నారు. ‘మనసులోన.. మనుగడలోన.. నాలో నీవే సగపాలు’ అన్న పాటను గుర్తుచేస్తున్నారు. ఆ యువజంటే.. ప్రతాప్‌ శివకిషోర్‌, ధాత్రిరెడ్డి. ఒకరు ఐఏఎస్‌ అయితే.. ఇంకొకరు ఐపీఎస్‌. వీరి ప్రేమ జీవితం ఎంత మధురమో.. వీరి ఉద్యోగ జీవితమూ అంతే మధురం. ఇంకా చిత్రం ఏమిటంటే.. దంపతులైన సివిల్‌ సర్వీస్‌ అధికారులను సాధారణంగా పక్కపక్క జిల్లాల్లోనో.. సమీప ప్రాంతాల్లోనూ ఏమాత్రం సంబంధంలేని శాఖలకు నియమిస్తుంటారు. కానీ వీరద్దరు మాత్రం ఇంతకుముందూ.. ఇప్పుడూ ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం అందుకున్నారు. దాంతో దాదాపు కలిసే కుటుంబ, ఉద్యోగ జీవితం కలిసి సాగించే సౌలభ్యాన్ని సొంతం చేసుకున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మనజీర్‌ జిలానీ సమూన్‌, తమీమ్‌ అన్సారియా.. వీరిద్దరూ ఒకరు కలెక్టర్‌గా, మరొకరు మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీకాకుళంలో కలిసి ఒకేచోట పని చేసే అవకాశం అందుకున్నారు. కానీ ఆ ముచ్చట స్వల్ప కాలానికే పరిమితమైంది. తమీమ్‌ అన్సారియా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కాగా.. ఆమె భర్త మనజీర్‌ జిలానీ సమూన్‌ అమరావతి ప్రాంతానికి వెళ్లిపోయారు. వీరిద్దరూ ఐఏఎస్‌ అధికారులే.

వీరికి విరుద్ధంగా మరో జంట రెండు బదిలీల్లోనూ ఒకేచోటకు వెళ్లడం విశేషం. వారిలో ఒకరైన కొమ్మిన ప్రతాప్‌ శివకిషోర్‌ 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి కాగా.. మరొకరు పెద్దిటి ధాత్రిరెడ్డి 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. రాష్ట్రంలో ఎందరో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పని చేస్తున్నారు. వారిలో భార్యాభర్తలు కూడా పలువురు ఉన్నారు. కానీ వీరిద్దరూ మాత్రం వెరీ స్పెషల్‌. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ జంట మనసులు కలిశాయి. దాంపత్య బంధంతో ఒక్కటయ్యాయి. ఇప్పుడు ఉద్యోగ జీవితంలోనూ తనవూమనసూ ఒకటే అన్నట్లు ఒకేచోట కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరూ సేవాగుణసంపన్నులే కావడంతో ఇంతకుముందు పనిచేసిన పాడేరు ఏజెన్సీలోనూ.. ఇప్పుడూ పనిచేస్తున్న ఏలూరు జిల్లాలోనూ జీవితం.. ఉద్యోగం.. సేవ.. అన్నీ కలసిమెలిసి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇద్దరిదీ గ్రామాణ నేపథ్యమే

ప్రస్తుతం ఏలూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శివకిషోర్‌ స్వగ్రామం నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామం. ఆ జిల్లాలోనే ఇంటర్‌ వరకు చదువుకున్న ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అనంతరం బెంగళూరులోని బోచ్‌ సెంటర్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీలో సీనియర్‌ సైంటిస్ట్‌గా సుమారు నాలుగేళ్లు పని చేశారు. అయితే సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి యూపీఎస్సీ పరీక్షలు రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. 153వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాలో ట్రెయినీ ఐపీఎస్‌గా తొలి పోస్టింగ్‌ అందుకున్నారు. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ సమయంలోనే సమర్థతకు గుర్తింపుగా ప్రధాని సిల్వర్‌ కప్‌ అందుకున్నారు. ఇటీవలి బదిలీల్లో ప్రభుత్వం ఆయన్ను ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించింది. ఇక తెలంగాణకు చెందిన ధాత్రిరెడ్డి యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామానికి చెందినవారు. హైదరాబాద్‌లోనే స్కూల్‌, ఇంటర్‌ విద్య అభ్యసించారు. అనంతరం ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఈమె కూడా సివిల్స్‌పై మక్కువతో పరీక్షలు రాసి 2019లోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగంలో కూడా చేరారు. కానీ ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో మళ్లీ పరీక్షలు రాసి 46వ ర్యాంకు సాధించడం ద్వారా ఐఏఎస్‌ హోదా అందుకున్నారు. తొలుత ఆమెను ఒడిశా క్యాడర్‌కు కేటాయించారు. అక్కడే 2020 అక్టోబర్‌లో సబ్‌ కలెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 2023లో ఏపీ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. పాడేరు సబ్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇటీవలి బదిలీల్లో ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

కలిసిన మనసులు

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వీరిద్దరూ దాదాపు ఒకే సమయంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేసినా పరస్పరం పరిచయం లేదు. కానీ తొలి ఉద్యోగులు వేర్వేరు రాష్ట్రాల్లో చేసినా.. మలి ఉద్యోగాలు ఒకే జిల్లాలో చేయడం వల్ల పరస్పరం విధి నిర్వహణలో భాగంగా కలుసుకునే అవకాశం లభించింది. చింతపల్లి ఏఎస్పీగా ఉన్న శివకిషోర్‌, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా ఉన్న ధాత్రిలను అధికారిక కార్యక్రమాలు కలిపాయి. ఇద్దరూ యుక్తవయస్కులే కావడం, ఆలోచనలు కలవడం, తరచూ సమావేశాల్లో కలుస్తూ మాట్లాడుకోవడంతో మనసులు కూడా కలిసిపోయాయి. దాంపత్య బంధంతో తమ అనుబంధాన్ని జీవితపర్యంతం పెనవేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు వివరించి వారి ఆశీర్వాదంతోనే మూడుముళ్ల బంధంతో దంపతులయ్యారు. వీరు పని చేస్తున్న పాడేరు, చింతపల్లి ఒకే జిల్లాలో ఉన్న పూర్తి ఏజెన్సీ ప్రాంతాలు. పూర్తిగా వెనుకబడి ఉన్న ఇక్కడి గిరిజనులను తీర్చిదిద్దాలన్న తపనతో ఈ దంపతులిద్దరూ కృషి ప్రారంభించారు. గిరిజనుల పిల్లలకు విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు శ్రమించారు. పిల్లలను పాఠశాలలకు పంపించే విధంగా వారి తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ గిరిజనుల ఆదరాభిమానాలు అందుకున్నారు.

సేవా కార్యక్రమాల్లో మేటి

మొదట వీరు పనిచేసిన చింతపల్లి, పాడేరు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలైనా ఇద్దరిదీ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం కావడం.. ఇద్దరిలోనూ సేవా దృక్పథం ఉండటంతో ఆ వాతావరణంలో ఇమిడిపోయారు. ప్రజల్లో కలిసిపోయారు. పేదలకు సాధ్యమైనంత సేవ చేయాలనేది ఈ జంట ఆలోచన. గిరిజనుల పిల్లలకు ప్రతి ఒక్కరికీ విద్య అందేలా కృషి చేశారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించేవిధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో చాలావరకు విజయం సాధించారు. ధాత్రిరెడ్డి చదువుకునే రోజుల నుంచే సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతూ పాల్గొనేవారు. 2016లోనే ఫీడ్‌ ఇండియా పేరుతో ఎన్జీవో(స్వచ్ఛంద సంస్థ) స్థాపించారు. హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆకలితో అల్లాడిపోయే అభాగ్యులకు పంచి పెట్టేవారు. ఉద్యోగంలో చేరిన తర్వాత స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గిరిజనులు ఆమెపై అభిమానం పెంచుకున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి గిరిజనులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు

వరద ప్రాంతాల్లోనూ కలిసే పర్యటనలు

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో వీరిద్దరూ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్కడ వరదలు బీభత్సం సృష్టించాయి. దాంతో ఇద్దరూ కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సమావేశాలు ఏర్పాటు చేసి వివరించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page