top of page

జీవితం అదే.. స్క్రిప్ట్‌ మాత్రం ఎవడిది వాడిదే!

Guest Writer
అక్కడ ప్రకాష్‌రాజ్‌.. ఇక్కడ మారుతీరావు..

ప్రణయ్‌ అమృతలు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. కులం వీలు కాదు పొమ్మంది.. మా మనసులే ఒకటయ్యాక మీ కులాలతో మాకు పనేంటి? అని పెద్దలను ఎదిరించి ఇద్దరు ఒకటయ్యారు. ఈ పెళ్లి అమృత తండ్రి మారుతీరావుకి ఇష్టం లేదు. కుల విద్వేషంతో రగిలిపోయాడు. కుర్రాడ్ని లేపేయమని రౌడీలను పురమాయించాడు. రౌడీలకి కావాల్సిన ఏర్పాట్లు చూడమని తమ్ముడు శ్రావణ్‌కు టాస్క్‌ ఇచ్చాడు.

వేట మొదలైంది.. రౌడీలు కుర్రాడి కోసం చెట్టూ పుట్టా గాలించడం మొదలుపెట్టారు. తండ్రి తన భర్తను లేపేయడానికి రౌడీలను పురమాయించాడని తెలుసుకున్న అమృత, ప్రణయ్‌ను తీసుకుని ఊరు విడిచిపోతుంది. ఇద్దరూ కలిసి రహస్యంగా ఓ చోట ఉంటారు. వీళ్లిద్దరూ ఉండే చోటు అమృత తండ్రి మారుతీరావు పసిగడతాడు. ప్రణయ్‌ను వేసెయ్యడానికి రౌడీలతో వెళ్తాడు. రౌడీలు అరుచుకుంటూ ఆరంగుళాల కత్తి తిప్పుకుంటూ ప్రణయ్‌ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. అది చూసి అమృత భయంతో గట్టిగా అరుస్తుంది. ఇంతలో హఠాత్తుగా ప్రణయ్‌ వైపు వెళ్లిన రౌడీ నెత్తురు కక్కుకుంటూ కింద పడిపోతాడు. మారుతీరావు ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే రౌడీలు ఒకరొకరుగా భూమిలోకి, ఆకాశంలోకి దూసుకుపోతుంటారు.

ఏం జరుగుతుందో అర్ధంకాక మారుతీరావు కళ్లు నులుముకుని చూస్తుండగా రేగిన దుమ్ము వెనకనుంచి అల్లు అర్జున్‌ వస్తాడు. మారుతీరావు కోపంగా ‘ఎవడ్రా నువ్వు?’ అని అరుస్తాడు. అప్పుడు అల్లు అర్జున్‌ కూల్‌గా ‘చూడు మామా గుండెల మీద పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచిన కన్న కూతురి గుండెల్లో మంట పెట్టే అవకాశం నీకెవరిచ్చారు? పరువూ ప్రతిష్ట అంటూ ఆవేశంలో ఆ కుర్రాడ్ని వేసేస్తే నీ కూతురి భవిష్యత్తు ఏమౌతుందో ఆలోచించావా? సొసైటీలో ఏదో పెద్ద పేరుంది అనుకుంటున్న నీ భవిష్యత్తు ఏమౌతుందో ఆలోచించావా? కులం కోసం జీవితాల్లో నిప్పులు పోసుకుంటారా?

సమాజం గురించి పట్టించుకోకు మామా. నీ కూతురు కులాంతర వివాహం చేసుకుంటే మహా అయితే రెండ్రోజులు స్క్రోలింగ్‌ వేస్తారు. తర్వాత ఎవడి పని వాడు చేసుకుంటాడు. కానీ నువ్వు గానీ ఈ కుర్రాడ్ని వేసేస్తే.. నీ కూతురు ఒంటరి అవడమే కాదు జీవితంలో ఎవడూ చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా నీ వెనకున్న డబ్బును చూసి చేసుకుంటాడేమో కానీ సుఖంగా కాపురం చేయగలరా? ఎంతో పరువుగా బతికిన నువ్వు జీవితాంతం కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వనుకుంటున్న పరువు నీకు ఉంటుందా? ఆలోచించుకో.. కూల్‌గా చెప్పాడు అల్లు అర్జున్‌.

మారుతీరావు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని ‘అమ్మా నువ్వు పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని నేను, అమ్మా మురిసిపోయాం. నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నువ్వు ఏదడిగితే అది లేదనకుండా నీకు తెచ్చిచ్చానమ్మా. ఇన్ని చేసినవాడిని నీ మనసును తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తా. పదమ్మా ఇంటికి వెళ్దాం’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ అల్లు అర్జున్‌ వైపు చూస్తూ ‘ఇంతకీ నువ్వు ఎవరు బాబూ?’ అని అడుగుతాడు.

అప్పుడు అల్లు అర్జున్‌ సిగ్గు పడుతూ ‘మీ చిన్న కూతురూ, నేనూ ప్రేమించుకుంటున్నాం.. మాదీ ఇంటర్‌ క్యాస్టే.. పనిలో పనిగా మా పెళ్లి కూడా చేసేయండి. ఖర్చు కూడా కలిసొస్తుంది’ అనడంతో అందరూ ఆనందబాష్పాలు కార్చుకుంటూ ఒకరినొకరు హత్తుకుంటారు.

ఏంటీ స్టోరీ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా? అల్లు అర్జున్‌ ‘పరుగు’ సినిమా చూసారా? దాదాపు ఇంతే ఉంటుంది. కాకపోతే అక్కడ మారుతీరావు ప్లేసులో ప్రకాష్‌రాజ్‌ ఉంటాడు. స్క్రిప్ట్‌ మన చేతుల్లో ఉంటే జీవితాలు ఎలాగైనా తీర్చిదిద్దుకోవచ్చు.

...

కానీ స్క్రిప్ట్‌ మన చేతుల్లో లేకపోతే.. రియల్‌ స్టోరీ ఇదిగో ఇలా కింద చెప్పిన విధంగా ఉంటుంది.

ప్రణయ్‌ అమృతలు ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. వీరి కులాంతర వివాహం అమృత తండ్రి మారుతీ రావుకి ఇష్టం లేదు. తమ్ముడికి చెప్పి రౌడీలను పురమాయించి ప్రణయ్‌ను లేపేస్తాడు. ప్రణయ్‌ అడ్డు తొలగిపోతే దారికి వస్తుంది అనుకున్న కూతురు తిరగబడి తండ్రి మీదే కేసు పెట్టింది. పోలీసులు మారుతీ రావును అరెస్ట్‌ చేసి లోపలేసారు. ఈ అవమానం భరించలేక మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల విచారణ అనంతరం మారుతీ రావు తమ్ముడితో సహా మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు, ప్రణయ్‌ను హత్య చేసిన ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

భర్తను కోల్పోయి మారుతీరావు భార్య.. ప్రణయ్‌ను కోల్పోయి అమృత.. కొడుకును కోల్పోయి ప్రణయ్‌ తల్లిదండ్రులు.. జీవిత ఖైదు పడిన తండ్రిని తల్చుకుంటూ శ్రావణ్‌ కుటుంబ సభ్యులు ఎవరికివారు విడివిడిగా ఏడుస్తున్నారు.

ఒక వ్యక్తి చేసిన అనాలోచిత చర్య వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయ్యాయి కాబట్టి సినిమాలు వేరు, నిజ జీవితాలు వేరు. సినిమాల్లో స్క్రిప్ట్‌ మన చేతుల్లో ఉంటుంది. నిజజీవితంలో మన చేతుల్లో ఉండదు. ఇందుకు మారుతీ రావు జీవితమే ఓ ఉదాహరణ. కాబట్టి పరువూ ప్రతిష్ట అంటూ తొక్కలో సమాజం గురించి ఆలోచిస్తూ జీవితాలు నాశనం చేసుకోకండి.

- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page