top of page

జీవోలో సొమ్ములు.. కాంట్రాక్టర్‌ జేబుకు చిల్లులు

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 11
  • 3 min read
  • ఇంకా గ్రౌండ్‌ కాని 1800 పైచిలుకు పనులు

  • జీవో విడుదలైనా జమకాని నిధులు

  • జిల్లాలో రూ.91 కోట్లకు కేవలం రూ.19 కోట్లే చెల్లింపు

  • మెటీరియల్‌ కాంపొనెంట్‌ బిల్లులు రాక గగ్గోలు

  • ప్రభుత్వంపై పెరుగుతున్న ఎమ్మెల్యేల ఒత్తిడి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి, కనీసం రోడ్ల మరమ్మతుకు కూడా ముందుకు రాని వైకాపా ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో ఓడిరచిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా నడుపుతామంటూ రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటమి ఏడాది కాలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా బిల్లుల చెల్లింపులో మాత్రం వైకాపా పంథానే అనుసరిస్తుంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో బేలచూపులు చూస్తుంది. తాజాగా ఉపాధిహామీ పథకంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు రూ.2,500 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఈ నెల ఆరున ఒక జీవో విడుదల చేసింది. కానీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన నిధులు జమ కాలేదు. 2,500 కోట్లలో 1,250 కోట్ల వరకే చెల్లిస్తారని కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ప్రకటించారు. ప్రస్తుతం అంతో ఇంతో రోడ్లు, కాలువల నిర్మాణం గ్రామాల్లో జరుగుతుందీ అంటే.. అది ఉపాధిహామీ పథకం వల్లే. ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి లేబర్‌ కాంపొనెంట్‌. అంటే కనీసం 100 రోజులు పని కల్పించాలనే లక్ష్యంతో చెరువులు, గుంతలు తవ్వుతున్న కూలీలకు వేతనాలు ఇవ్వడం. రెండోది మెటీరియల్‌ కాంపొనెంట్‌. ఇందులో గ్రామాలకు అవసరమైన రోడ్లు, కాలువలతో పాటు పశువుల శాలలు నిర్మించడం. ఇందులో లేబర్‌ కాంపొనెంట్‌లో భాగంగా నిధులు మంజూరవుతున్నా మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేస్తున్న పనులకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలేదు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఐదేళ్లలో ఇదే పని చేసింది. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద జరుగుతున్న పనులకు సంబంధించి ప్రతీ వారం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామాల్లో అనేక చోట్ల తారు, సిమెంట్‌ రోడ్లతో పాటు కాలువలు కూడా నిర్మిస్తున్నారు. తొలినాళ్లలో ప్రతీవారం బిల్లులు జమ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో జడ్పీ ఆమోదించిన కోట్లాది రూపాయల పనులకు కాంట్రాక్టర్లు కార్యరూపం ఇచ్చారు. కానీ గత ఏడాది డిసెంబరు రెండో వారం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రూ.2,500 కోట్లు ఇందుకోసం విడుదల చేసినట్లు జీవో రావడంతో కాంట్రాక్టర్లు కొంత మేరకు బిల్లుల చెల్లింపు జరుగుతుందని భావించారు. కానీ జిల్లాల వరకు ఆ సొమ్ము చేరలేదని తేలడంతో ప్రభుత్వం జీవో అయితే ఇచ్చింది కానీ, సొమ్ములు మాత్రం విదల్చలేదని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. మరో నెల రోజుల్లో తల్లికి వందనం పేరిట ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో ఒక పథకాన్ని అమలుచేయనుంది. దీంతో ఈ నిధులను అటువైపు మళ్లించారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం కూడా ఉపాధిహామీ పథకంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనుల మంజూరుపై ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈమేరకు కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసినట్టు భోగట్టా. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,200 కోట్ల పెండిరగ్‌ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి మంజూరు చేయాలని, అప్పటి వరకు కలెక్టర్ల పరిశీలనలోనే పనుల ప్రతిపాదన ఉండాలని సూచించింది. 2024`25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమయ్యాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, డైరెక్టర్‌ ఇప్పటికి నాలుగుసార్లు ఢల్లీి వెళ్లి పెండిరగ్‌ నిధులు విడుదల చేయాలని కోరారు. ఎందుకంటే ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి ఉంది. నిధులు విడుదల కాకపోవడం, వర్షాలు ముందుగా రావడంతో ఆదరాబాదరాగా పనులు చేపట్టకూడదన్న ఉద్దేశంతో కొత్త పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంలేదు. వాస్తవానికి 2025`26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక ప్రకారం ఏప్రిల్‌ నుంచే కొత్త పనులు మొదలవ్వాలి. అన్ని చెల్లింపులు సరిగా జరిగుంటే ఈ ఏడాది 4వేల కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అదే జరిగితే రాష్ట్రంలో గ్రామీణ రహదారులన్నీ బాగైనట్టే. లేబర్‌ కాంపొనెంట్‌ కింద పనులు చేపట్టిన కూలీలకు రెండు నెలలు జీతాలు ఇవ్వలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సర్దుబాటు చేసింది. ఇందుకోసం రూ.60 కోట్లు వెచ్చించింది. కానీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ పరిస్థితి అలా కాదు. ఎందుకంటే.. సంబంధిత నిర్మాణ పనులకు మెటీరియల్‌ సరఫరా చేసేవారు వెండర్ల కింద రిజిస్టర్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోనే వేస్తుంది. గతంలో ఈ సొమ్ములు పంచాయతీకి వచ్చేవి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెల్లించి పంచాయతీ ఖాతాలో జమైనప్పుడు వెనక్కు తీసుకునేది. 2019 నుంచి ఆ పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం లేబర్‌ కాంపొనెంట్‌కు నిధులు సర్దుబాటు చేసినట్లు మెటీరియల కాంపొనెంట్‌కు చేయలేకపోతోంది. ఇక జిల్లాలో ఈ కేటగిరీలో సమగ్రశిక్ష, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్‌, ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, బీఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ శాఖలు 6311 పనులు చేపట్టాయి. ఇందులో ఇప్పటి వరకు 4018 గ్రౌండ్‌ అయ్యాయి. అందులో 2274 పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.91 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.19 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ప్రభుత్వం తాజాగా ఈ నెల 6న ఇచ్చిన జీవో మేరకు నిధులు విడుదల చేసినా మిగిలిన పనులు పూర్తవుతాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page