top of page

జై షా లాంటివారి అవసరం ఉంది

Writer: DV RAMANADV RAMANA

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేత భారత్‌. రెండేళ్లలో రెండు ఐసీసీ కప్‌లు భారత్‌కి అందించి నందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి అభినందనలు. ఐసీసీ సీటీ 2025ని పాకిస్థాన్‌లో నిర్వహించడం తప్పనిసరి అయినా జై షా చాకచక్యంగా వ్యవహరించి పాకిస్థాన్‌ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఐసీసీకి చైర్మన్‌గా ఎవరు ఉన్నా బీసీసీఐ మాట వినాల్సిందే. 18,300 కోట్ల విలువ ఉన్న బీసీసీఐ మాటని ఏ దేశం కూడా కాదనలేదు. క్రీడల మేనేజ్మెంట్‌ అనేది ఇప్పుడు ఒక ప్రొఫెషన్‌. స్పోర్ట్స్‌ మేనేజ్మెంట్‌లో ముఖ్యంగా క్రికెట్‌లో భారత్‌ రోల్‌ మోడల్‌గా ఉండిపోయింది. మరి అత్యంత ధనవంతమైన బీసీసీఐకి జై షా లాంటి వారి అవసరం ఉండి తీరాలి. ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహిస్తే భారత జట్టు పాకిస్తాన్‌ వెళ్లదు అన్నాడు జై షా. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకేమో ఛాంపియన్స్‌ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించకపోతే ఇప్పటికే కష్టాలలో ఉన్న బోర్డు మరింత కష్టాలలోకి వెళ్లిపోతుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరిగితే టికెట్ల ద్వారా ఆదాయం వచ్చి కొంతలో కొంత అన్నా కోలుకోవచ్చు అనే ఆశ పాక్‌ బోర్డుకి ఉందని తెలిసే జై షా మైండ్‌ గేమ్‌ ఆడాడు. భారత్‌ కనుక పాకిస్థాన్‌లో ఆడకపోతే భారత్‌ లేకుండానే టోర్నమెంట్‌ నిర్వహిస్తామని మియాందాద్‌ లాంటి వాళ్లు మాటల యుద్ధానికి తెరతీశారు. జై షా చాలా నిశ్శబ్ధంగా పని చేసుకుపోయాడు. పాకిస్థాన్‌లో కాకపోతే న్యూట్రల్‌ వేదిక మీద టోర్నమెంట్‌ జరుగుతుందని సందేశం వెళ్లింది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకి. భారత్‌ ఆడే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో జరిగేట్లుగా ఒప్పుకుంటే మిగతా మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగేట్లుగా పాకిస్తాన్‌ ఒప్పుకుంది. ఐసీసీ నుంచి 1800 కోట్లు పాకిస్తాన్‌కి వెళ్లాయి అదీ ఆలస్యంగా. 1180 కోట్లు ఖర్చు పెట్టి స్టేడియంలు బాగుచేసింది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. ఇచ్చిన ఎస్టిమేషన్‌ 1200 కోట్లు అయితే, అందులో స్టేడి యంలో కుర్చీలు కొత్తవి ఫిక్స్‌ చేస్తామని చెప్పి విరిగిపోయిన కుర్చీల స్థానంలో కొత్తవి బిగించి పాతవి అలానే ఉంచి హాట్‌ బ్లోయర్స్‌తో వేడి చేసి తళతళలాడేట్లు చేసింది. అంటే ఇచ్చిన ఎస్టిమేషన్‌లో ఎంతో కొంత నొక్కే యాలానే ప్లాన్‌ అన్నమాట. కానీ స్టేడియంలోకి ఎవరూ రాకుండా ఆపలేకపోవడంతో పాకిస్తాన్‌ యువకులు మొబైల్‌తో వీడియో తీసి వైరల్‌ చేశారు. చాలా కాలం తర్వాత ఐసీసీ ఈవెంట్‌ జరుగుతుండడంతో చాలా సంబరపడిపోయారు పాకిస్తాన్‌ క్రికెట్‌ ప్రేమికులు. తీరా టోర్నమెంట్‌ మొదలైన తర్వాత స్టేడియంలు ఖాళీగా కనిపించాయి. టికెట్‌ కొని క్రికెట్‌ మ్యాచ్‌ చూసే స్థోమత పాకిస్తాన్‌ ప్రజలకి లేదు. పోనీ తమ జట్టు ఏవన్నా బాగా ఆడితే వెళ్లేవాళ్లు ఏమో. సెమిస్‌కి రాకుండానే బయటికి వెళ్లిపోయింది పాకిస్తాన్‌. జై షా వ్యూహం ఏమిటో భారత్‌ సెమీ ఫైనల్‌ గెలిచిన తర్వాత కానీ అర్ధం కాలేదు. పాకిస్థాన్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌లు భారీ స్కోర్‌ నమోదయ్యాయి. అదే దుబాయ్‌కి వచ్చేసరికి మందకొడి పిచ్‌లతో అటు బ్యాటింగ్‌కి కానీ, ఇటు బౌలింగ్‌ కి కానీ సహకరించలేదు. భారత్‌ ఆడిన మ్యాచ్‌లన్నీ ఒకే స్టేడియంలో కాస్త అటు ఇటుగా ఉన్న రెండు పిచ్‌ల మీద ఆడిరది. దుబాయ్‌ స్టేడియంలో మొత్తం మూడు పిచ్‌లని సిద్ధం చేయించాడు జై షా. పిచ్‌ క్యూరేటర్‌గా ఆస్ట్రేలియా నుంచి పిలిపించారు. సెమీ ఫైనల్‌కి ముందు జరిగిన మ్యాచ్‌లు అన్ని ఒకే పిచ్‌ మీద ఆడారు. సెమీ ఫైనల్‌, ఫైనల్‌ ఒకే పిచ్‌ మీద ఆడారు. ఆస్ట్రేలియా గడాఫీ స్టేడియంలో భారీ స్కోర్‌ చేసి దుబాయ్‌కి వచ్చి విఫలం అయ్యింది. న్యూజిలాండ్‌ది కూడా అదే పరిస్థితి. ఈ రోజు ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తే ఫాస్ట్‌ బౌలర్స్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కరెక్ట్‌గా బౌల్‌ చేసినవి బ్యాటర్స్‌ ఆడలేకపోయారు. బాల్‌ ఏమాత్రం లైన్‌ తప్పినా వైడ్‌ బాల్‌గా వెళ్లి పోయాయి. ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌లు బౌండరి, సిక్స్‌లుగా వెళ్లిపోయాయి. బాల్‌ ఏ మాత్రం ఒక అంగుళం లెఫ్ట్‌ సైడ్‌ పిచ్‌ అయినా ఆఫ్‌ సైడ్‌ వైడ్‌ బాల్‌గా వెళ్లిపోయాయి. బాల్‌ ఏ మాత్రం కుడివైపు ఆగుళం పిచ్‌ అయినా లెగ్‌ సైడ్‌ వైడ్‌ బాల్‌గా వెళ్లిపోయాయి. ఇరు జట్లు 8 వైడ్‌ బాల్స్‌ రూపంలో అదనపు పరుగులు ఇచ్చాయి. మొహ మ్మద్‌ షమికి అది డెడ్‌ పిచ్‌తో సమానం. కాబట్టి షమిని ఏమీ అనడానికి వీలు లేదు. ఉదయం నెట్‌ ప్రాక్టీస్‌లో కోహ్లీకి గాయమయింది. అందుకనే రోహిత్‌ ఆచి తూచి ఆడాడు. ఇక ఎప్పటి లాగానే శ్రేయస్‌ అయ్యర్‌, కేఐ రాహుల్‌లు మిడిల్‌ ఆర్డర్‌లో తాము ఎంత ముఖ్యమైన ఆటగాళ్లమో మరోసారి నిరూపించుకున్నారు. ఈరోజు భారత్‌ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి విజయం సాధించింది. రోహిత్‌ శర్మ ఫ్లైయింగ్‌ స్టార్ట్‌ అనేది మ్యాచ్‌ విన్నింగ్‌ పాయింట్‌. ముఖ్యంగా రోహిత్‌ ముందుకు వచ్చి కొట్టిన సిక్సర్‌ 96 మీటర్ల దూరం వెళ్లడం చూస్తే రోహిత్‌ శర్మ ఇంకో సంవత్సరం ఆడగలడు అనిపించింది. అఫ్కోర్స్‌.. మ్యాచ్‌ మొదలువ్వక ముందే గౌతమ్‌ గంభీర్‌ వచ్చే టీ`20 వరల్డ్‌ కప్‌లో కూడా రోహిత్‌ ఆడతాను అంటే.. నాకేమి అభ్యంతరం లేదని ప్రకటించాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిధ్యం ఇచ్చిన పాకిస్థాన్‌లో సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌ జరగకుండా చేయడం ఏదైతే ఉందో దాని క్రెడిట్‌ జై షాకి ఇవ్వాల్సిందే. భారత జట్టు కనుక పాకిస్థాన్‌ వెళ్లి ఉంటే జయాపజయాల సంగతి ఎలా ఉన్నా కింగ్‌ కోహ్లీని చూడడానికి టికెట్స్‌ కొని మరీ స్టేడియంకి వచ్చే వాళ్లు పాకిస్తాన్‌ ప్రజలు. కోహ్లీకి పాకిస్తాన్‌లో ఉన్న ఆదరణ మన దేశంలో కంటే ఎక్కువే. పాకిస్థాన్‌ జెర్సీలు ధరించి వెనక కోహ్లీ పేరు ప్రింట్‌ చేయించుకుని మరి దుబాయ్‌ స్టేడియంకి వచ్చారు పాకిస్తాన్‌ యువతీ యువకులు సెమీఫైనల్‌ మ్యాచ్‌కి. అదీ కోహ్లీకి పాకిస్థాన్‌లో ఉన్న క్రేజ్‌! దుబాయ్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఒకప్పుడు భారత్‌ ఆడే మ్యాచ్‌ మీద ఆశ వదులుకునేవాళ్లు. దుబాయ్‌లో మ్యాచ్‌.. అంటే అది పాకిస్తాన్‌కి ఫిక్స్‌ అయిపోయినట్లే ఒకప్పుడు. ఇప్పుడు? మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేదు. దావూద్‌ తరఫున వీఐపీ బాక్స్‌లో బుకీలు కనిపించడం లేదు!

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page