టీఎంసీ వద్దు.. మమతే ముద్దు
- Guest Writer
- Apr 24
- 2 min read
అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా ఆమెపైనే నమ్మకం
మొదటి విడతలో దాదాలను కాదని దీదీ వైపే మొగ్గు చూపారంటున్న విశ్లేషకులు
అత్యధిక పోలింగ్ శాతంపై అనుమానాలు

అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. గురువారం బెంగాల్‌లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గినా, 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ అభ్యర్థినని మమతా బెనర్జీ ప్రకటించారు. తన అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నప్పటికీ, తనపైనే నమ్మకం ఉంచాలని ఓటర్లను కోరారు. ఆమెకున్న ప్రజాదరణ బెంగాల్ రాజకీయ ప్రచారంలో ఆమెను కీలక వ్యక్తిగా నిలబెట్టింది. అయితే రాష్ట్రంలో, టీఎంసీలో ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఆమె మద్దతుదారులు ఆమెను అలాగే ఆదరిస్తారా అనేది ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న.
ఫిబ్రవరి 4న బెంగాల్‌లో SIR కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించిన మొదటి ముఖ్యమంత్రిగా మమత నిలిచారు. తన సాధారణ కాటన్ చీర, రబ్బరు చెప్పులు, నల్లటి స్కార్ఫ్‌తో ‘స్ట్రీట్ ఫైటర’గా ఆమె కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్, సీపీఎంల దాడులకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాల ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఆమె ‘శాశ్వత బాధితురాలిగా’ ముద్ర వేసుకున్నారు. ఈ ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఆమె సాధారణ పౌరులతో, క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలతో అనుసంధానమయ్యారు. ప్రత్యర్థుల నుంచి ఎదురైన మాటల దాడులను, భౌతిక దాడులను తట్టుకుని నిలబడటానికి ఇది ఒక మార్గంగా మారింది. 2021 ఎన్నికల్లో వీల్‌చైర్‌లో కూర్చుని చేసిన ప్రచారం ఆమెను ఎవరూ ఆపలేని నాయకురాలిగా చూపించింది.
2011 నుంచి టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మమత కేంద్రబిందువుగా ఉన్నారు. 2021లో ఐ-ప్యాక్ చేపట్టిన ‘బెంగాల్‌కు తన సొంత కుమార్తె కావాలి’ అనే ప్రచారం ఆమె బ్రాండ్‌ను మరింతగా పెంచింది. ప్రస్తుతం, మమతకు ఓటు వేయడమంటే బెంగాల్‌కు ఓటు వేయడమే అన్న అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు.
టీఎంసీపై అవినీతి, దోపిడీ, హింసకు పాల్పడుతుందనే ముద్ర బలంగా ఉంది. ఎసఎస్‌సీ, శారదా కుంభకోణాలు, సందేశ్ ఖాలీ, ఆర్‌జీ కర్ ఘటనలు టీఎంసీలో బలవంతుల ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాల్లో పదవుల్లో ఉన్న ఈ వ్యక్తులు, స్థానిక ఆర్థిక వ్యవస్థలను నియంత్రిస్తూ, దోచుకుంటూ సొంత సిండికేట్‌లను సృష్టించుకున్నారు. ‘దీదీ’ ఫ్రాంచైజీ కింద, వారు తమ ప్రాంతాల్లో ‘దాదా’ (కండబలం ఉన్నవారి) సంస్కృతిని విజయవంతంగా నడుపుతున్నారు. కానీ విచిత్రమేమిటంటే, మమత ప్రతిష్ట ఏమాత్రం తగ్గలేదు. తన పార్టీలోని అవినీతి బురదలో కూడా ఆమె ఒక నీతిమంతురాలైన నాయికగా కనిపిస్తారు. ఆమె అధికారంపై ఉన్న నమ్మకం, జరుగుతున్న నష్టాన్ని కప్పిపుచ్చుతోంది. తన సొంత పార్టీ, ప్రభుత్వం సృష్టించిన గందరగోళం మధ్యలో కూడా మమత ఎలా విజేతగా నిలుస్తున్నారో, ఆమె మద్దతుదారులు ఎలా వైరుధ్యాలతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నారో అనేది ఒక ఆసక్తికరమైన అధ్యయనం.
అదేవిధంగా, పరిశ్రమల క్షీణత, భారీ అప్పులు, అధిక నిరుద్యోగిత రేటు టీఎంసీ 15 ఏళ్ల పాలనలో చాలా దయనీయమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ నమూనా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ లోతైన ఆర్థిక సమస్యలను కప్పివేస్తుంది. ‘లక్ష్మీర్ భండార’ పథకంలో రూ. 500 పెంపు, ‘బంగ్లార్ యువ సాథీ’, ‘కృషక్ బంధు’ పథకాల ప్రవేశం... ఇవన్నీ మమత అనుసరిస్తున్న సంరక్షణ రాజకీయాల్లో భాగమే.
కేంద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందకుండా టీఎంసీ అడ్డుకుంటోందని బీజేపీ ఆరోపిస్తుంటే, రాష్ట్ర ఖజానాలో కేవలం 5% మాత్రమే ఖర్చయ్యేలా 100కు పైగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్ర ఆర్థిక స్తంభనను మమత రాజకీయంగా వాడుకుంటున్నారు. దీనిని ‘మమత సంక్షేమం వర్సెస్ బీజేపీ వివక్ష’గా మార్చడంలో ఆమె సఫలీకృతం అయ్యారు.
ఈ ఎన్నికల్లో, మమతను పొగుడుతూనే.. పార్టీని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం అనే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె వ్యక్తిత్వం, రాజకీయ వ్యూహాలు ఎన్నికల ప్రచారాన్ని, ఓటర్ల దృష్టిని రాష్ట్రంలోని సమస్యల నుంచి మళ్లించి, ఆమెను ప్రధాన ప్రతిపక్షంగా, అమిత్ షా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. ఒకవేళ ‘దీదీ’ టీఎంసీని మళ్లీ అధికారంలోకి తెచ్చినా, ఆ పార్టీ దీర్ఘకాలిక మనుగడ ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.
- సాత్యకి బారువ, టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం..






Comments