top of page

టెక్కలి ఓటర్లకు ఆయనే మర్యాద రామన్న!

Writer: NVS PRASADNVS PRASAD
  • `ఫోన్‌ చేస్తే చాలు పలుకుతారని అచ్చెన్నపై నమ్మకం

  • `అదే అధికారంలో లేకపోయినా నిలబెడుతోంది

  • `సమస్య చెబితే పరిష్కారిస్తారన్న ధీమా కూడా కారణం

  • `దువ్వాడ శ్రీనివాస్‌లో కనిపించని ఫోన్‌ మర్యాద

  • `ఇవే టీడీపీని మరోసారి గెలిపిస్తాయని ప్రచారం




ప్రతి వందమంది ఓటర్లలో అదనంగా ఆరుగుర్ని తమవైపు తిప్పుకోడానికి పార్టీలకు గట్టిగా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ఆ ఓటు తమదేనని వైకాపా భావిస్తున్నా తటస్థ, మధ్యతరగతి ఓటర్లను తిప్పుకోపోతే గెలుపు ఓటములు తలకిందులయ్యే ప్రమాదం ఉందని గత చరిత్ర చెబుతోంది. ఎలక్షన్‌ సర్వేలు, అధ్యయనాలను క్రోడీకరిస్తే కూటమికి 52 శాతం, వైకాపాకు 40 శాతం మంది మద్దతుగా ఉన్నారని ఆ పక్షం భావిస్తుంటే.. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా అటునుంచి ఇటు అంకెలు ఉన్నాయని వైకాపా చెబుతోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఈ అంకెలు, శాతాలు అన్ని నియోజకవర్గాల్లో ఒకేలా ఉండవు. స్థానిక అంశాలు, సామాజిక సమీకరణాలను బట్టి మారుతుంటాయి. రెండు పక్షాల మధ్య కనిపిస్తున్న 12 శాతం వ్యత్యాసంలో ఎవరు ఏడు శాతం మందిని తమవైపు తిప్పుకోగలుగుతారో వారే విజేతలు. ఇప్పుడు ఇటువంటి ఓటర్లను తిప్పుకునే అంశమే చివరి ఘట్టంలో కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఓ శాంపిల్‌ను చెప్పుకుందాం. కేవలం ఫోన్‌కాల్‌కు స్పందించడమనే ఒకే ఒక అంశం ఇక్కడ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకువచ్చిందంటే నమ్మడానికి కాస్త వింతగా ఉంటుంది. కానీ, ఇది ముమ్మాటికీ వాస్తవం. టెక్కలి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు, వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనుల మధ్య కేవలం ఫోన్‌ ఎటికెట్‌ (మర్యాద) వల్లే ఓట్ల తేడా చాలా ఉంటుందనే దాని కోసం ఇప్పుడు చెప్పుకుందాం.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గతంలో పలు పదవులు నిర్వహించి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ, ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌ తాను పదవుల్లో, ఏ హోదాలో ఉన్నా తనకు వచ్చే 90 శాతం ఫోన్‌ కాల్స్‌కు అటెండ్‌ కారు. ఫోన్‌ చేసినవారు పార్టీ నాయకులైనా, ఆపదలో ఉన్న నియోజకవర్గ ప్రజలైనా, తన సామాజికవర్గ నేతలైనా ఆయనకు ఒకటే. ఫోన్‌ వచ్చే సమయంలో ఆయన సభలోనో, సమావేశంలోనో, మరో ముఖ్యమైన పనిలోనో ఉండొచ్చు. కానీ ఆ తర్వాత కాల్‌ లిస్ట్‌ చూసి ఏ ఫోన్‌ కాల్‌ ఎవరి నుంచి వచ్చింది.. వారికి ఏం పని పడిరది అని మళ్లీ వారికి ఫోన్‌ చేసి తెలుసుకునే అలవాటు దువ్వాడ శ్రీనుకు మొదట్నుంచీ లేదు. ఒక వ్యక్తికి పదే పదే ఫోన్‌ చేసినా రెస్పాన్స్‌ లేకపోతే సాధారణంగానే చేసిన వ్యక్తి ఇగో దెబ్బతింటుంది. ఇటువంటి అనుభవం ఎదుర్కొన్నవారు టెక్కలి నియోజకవర్గంలో కనీసం ఐదువేల మంది వరకు ఉంటారనడంలో సందేహంలేదు. ఇక బయటివారి పరిస్థితి వేరేగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా దీనికి భిన్నంగా ఉంటుంది అచ్చెన్నాయుడు వ్యవహార శైలి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా పని చేసినా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు మోస్తున్నా సరే.. ఫోన్‌ వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా ఎత్తుతారు. ఒకవేళ అప్పటికప్పుడు ఎత్తలేకపోయినా అదే రోజు ఏదో ఒక సమయంలో మిస్డ్‌ కాల్స్‌ చూసి.. అవతలివారికి మళ్లీ ఫోన్‌ చేసి విషయమేమిటో కనుక్కుంటారు. ఇటువంటి అంశాలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తాయని వేరేగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందించింది. ఈసారి అధికారంలోకి వస్తే తాము కూడా వీటికి మించి అందిస్తామని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు పార్టీల పరంగా దాదాపు ఒకే రకమైన మేనిఫెస్టో కనిపిస్తున్నందున, దానితోపాటు ఓటర్లు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా చూస్తారు.

ఇద్దరి మధ్య తేడా అదే

ఆ లెక్కన చూసుకుంటే అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు ఫోనెత్తని సందర్భం లేదని నియోజకవర్గంలో చెప్పుకుంటారు. టెక్కలి నియోజకవర్గంలో ఇదే ప్రభావం చూపనుంది. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా కష్టపడకుండానే అచ్చెన్నాయుడు వైపు వేవ్‌ కనిపిస్తుందంటే.. దానికి ఇలాంటి కారణాలెన్నో దోహదం చేస్తున్నాయి. అచ్చెన్న మంత్రిగా పని చేసిన రోజుల్లో కూడా ఆయన్ను కలవడానికి మధ్యలో వేరే నాయకుడు సహాయం తీసుకోవాల్సిన అవసరం నియోజకవర్గ ఓటర్లకు ఉండేదికాదు. అలాగే ఎర్రన్నాయుడు రాజకీయాల్లో ఉన్న రోజుల నుంచి గ్రామాల్లో ఏ సమస్యలున్నాయో రాసుకోవడం, వాటిని పరిష్కరించిన తర్వాత ఆ విషయాన్ని స్థానిక నాయకులకు చెప్పడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఏదైనా రికమండేషన్‌తో అచ్చెన్నాయుడు వద్దకు వెళితే.. మళ్లీ ఆ పని అయిపోయిన తర్వాత ఆయనే ఫోన్‌ చేసి పని పూర్తయిందని సమాచారం అందించేవారు. ఇది ఎర్రన్నాయుడు వద్దా ఉంది, ఇప్పుడు ఎంపీ రామ్మోహన్‌నాయుడు వద్దా కనిపిస్తుంది. అచ్చెన్నాయుడు మాదిరిగా దువ్వాడ శ్రీనివాస్‌ మంత్రి పదవైతే చేయలేదు కానీ, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఆయన మాటకు తిరుగులేని అధికారాలను జగన్మోహన్‌రెడ్డి ఇచ్చారు. ఈ సమయంలో అందరికీ అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

స్వచ్ఛందంగా చేరికలు

ప్రస్తుతం అచ్చెన్నాయుడు పూర్తి స్థాయిలో ప్రచారం చేసే అవకాశాన్ని కూడా అక్కడి ఓటర్లు ఇవ్వడంలేదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి చేరికలతోనే ఆయన కు సమయం సరిపోతోంది. పక్క పార్టీ నాయకులే కాకుండా ఓటర్లే నేరుగా వచ్చి కండువాలు కప్పించుకుని వెళ్లిపోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నా అచ్చెన్నాయుడు మీద నమ్మకం సడలకపోవడానికి కారణం.. ఆయన ఫోన్‌లోనైనా అందుబాటులో ఉండటమే. దీన్ని పార్టీలో చేరికలే నిరూపిస్తున్నాయి. నిన్నటికి నిన్న కురుడు పంచాయతీకి వెళితే.. అక్కడ దొరలుగా పేరుపడ్డ రొక్కం అచ్చుతరావు అచ్చెన్నాయుడుకు మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతంలో గతంలో రొక్కం మధుసూదనరావు, ఇప్పుడు ఆయన సోదరుడు అచ్చుతరావులకు పట్టుంది. వయసు రీత్యా తాను పార్టీలో కీలకంగా తిరగలేనని చెప్పిన అచ్చుతరావు అచ్చెన్నాయుడు వెళ్లిపోయిన వెంటనే పరిసర ప్రాంతాల్లో టీడీపీకి మద్దతు తెలపాలని సూచించారు. మరోవైపు జిల్లాకు టీడీపీ తరఫున అచ్చెన్న నాయకత్వం అవసరమని భావించే పలాస నుంచి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోట్ని దుర్గాప్రసాద్‌, సోంపేట నుంచి సానా షన్ముఖరావు, శ్రీకాకుళం నుంచి పైడిశెట్టి జయంతి వంటి వైశ్య ప్రముఖులు టీడీపీ వెంట నడుస్తున్నారు. ఇక కోటబొమ్మాళిలో బోయిన గోవిందరాజులు కుటుంబం ఆయనకు ఎప్పుడూ అండగానే ఉంది. ఇక్కడ ఒక్క బోయిన నారాయణమూర్తి తప్ప మిగిలిన బోయిన కుటుంబాలన్నీ అచ్చెన్నాయుడుకే మద్దతు తెలుపుతున్నాయి. అన్నింటికంటే విచిత్రమైన విషయమేమిటంటే.. వైకాపా అభ్యర్థి సొంత మండలం టెక్కలి నుంచే టీడీపీలోకి ఎక్కువ చేరికలు ఉంటున్నాయి. ఇక్కడ సేరివీధి, బెంతు ఒరియాలతో పాటు తెలగాలకు సంబంధించిన దోని కొండలరావు నాయకత్వంలో అనేకమంది అచ్చెన్నాయుడు ముందు క్యూ కట్టి మరీ కండువాలు వేయించుకున్నారు. ఇక సంతబొమ్మాళి ఎలాగూ టీడీపీకి పెట్టని కోట. వైకాపా ప్రభుత్వం పోర్టు కట్టిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్న మూలపేట పరిసర ప్రాంతాల నుంచే జీరు భీమారావు, అప్పిన వెంకటేష్‌ల సారధ్యంలో అనేక మంది వైకాపా ఓటర్లు టీడీపీలో కలిశారు. అచ్చెన్నాయుడు చూడటానికి కఠినంగా ఉంటారు. కానీ చెప్పిన పని కూడా ఎంత కఠినమైనా చేసిపెడతారన్న ప్రచారంతో పాటు స్వయంగా ఆయన వల్ల లబ్ధి పొందినవారే ఇప్పుడు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సాధారణంగా దివంగత ఎర్రన్నాయుడుతో, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావుతో స్నేహంలో మాధుర్యం ఉంటుంది. కానీ అచ్చెన్న విషయానికి వచ్చేసరికి కఠినంగా కనిపిస్తారు. కానీ పనులు జరగాలి అంటే.. ఆయనే సరైనోడన్న భావన నియోజకవర్గంలో ఉంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page