(సత్యంన్యూస్, టెక్కలి)

టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి(డీఎస్పీ)గా డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తిని నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్కలి పోలీస్ సబ్ డివిజన్‌లో 13 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. దీనికి డీఎస్పీగా మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1991లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కోటబొమ్మాళిలో తొలిసారి బాధ్యతలు స్వీకరించిన మూర్తి ఇప్పుడు అదే డివిజన్ కేంద్రం టెక్కలికి డీఎస్పీగా వస్తున్నారు. నందిగాం, నరసన్నపేట, వీరఘట్టం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, టెక్కలిలో ఆయన ఎస్‌ఐగా పని చేశారు. అనంతరం సీఐగా టెక్కలి, నరసన్నపేట, పాతపట్నంలలో పని చేసి జిల్లాపై పూర్తి అవగాహన ఉన్న పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం వైజాగ్ ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తుండగానే డీఎస్పీగా పదోన్నతి రావడంతో మహిళా పోలీస్ స్టేషన్, అనకాపల్లిలో దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేశారు. 2019 సమయంలో విశాఖ భూముల కుంభకోణంపై దర్యాప్తునకు వేసిన సిట్‌లో ఆయన డీఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత విశాఖ సిటీలో ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తుండగా, శ్రీకాకుళం బదిలీ అయింది. ఇక్కడ కూడా ఉమెన్ పోలీస్‌స్టేషన్, టౌన్ డీఎస్పీగా పని చేశారు. బదిలీపై విశాఖ స్పెషల్ బ్రాంచ్‌లో రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సేవలందించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా వైజాగ్ ఈస్ట్‌జోన్‌లో పని చేస్తూ బదిలీపై తాడేపల్లిగూడెం వెళ్లారు. విజయవాడ అవినీతి నిరోధక శాఖలో డీఎస్పీగా పని చేస్తున్న మూర్తిని ఇప్పుడు టెక్కలి డీఎస్పీగా కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత తీసుకువచ్చారు. మూర్తికి జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఆయన ఏదో ఒక హోదాలో పని చేశారు. కోవిడ్ పాండమిక్ మొదటి సీజన్‌లో శ్రీకాకుళానికి మహమ్మారి చాలా ఆలస్యంగా రావడం వెనుక కృషి చేసిన యంత్రాంగంలో మూర్తి కూడా ఒకరు. శ్రీకాకుళం డీఎస్పీగా ఉన్న ఆయన డేంజర్ జోన్ ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో ఆయన కూడా కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు.
Comments