ఆకులతంపరలో ఆందోళన చేసిన కలమట
నివగాం ఊసెత్తని రమణ
పరిశీలనకు వెళ్లిన మైన్స్ అధికారులు
(సత్యంన్యూస్,కొత్తూరు)

జిల్లాలో ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయని చెప్పడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద ఇసుక తవ్వకాలను అడ్డుకుంటూ హడావుడి చేయడమే నిదర్శనం. ఆకులతంపర ఇసుక ర్యాంపు వద్ద కలమట వెంటరమణ ఆందోళన చేయడం ఇది రెండోసారి. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన ఆగస్టులో ర్యాంపుల నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి పార్టీ ప్రతిష్టను దిగజార్చినట్టు పరోక్షంగా ఆరోపించారు. ఆ తర్వాత గమ్మున ఉండిపోయారు. సుమారు 5 నెలల తర్వాత ఆకులతంపర వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ రోడ్డెక్కారు.
వాస్తవంగా కలమట వెంకటరమణ నివాసానికి కిలోమీటరు దూరంలో నివగాంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కలమట సైట్ మీదుగానే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. నివగాం వద్ద ఇసుక రీచ్‌ను మాతల వంతెనకు సుమారు 500 మీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇసుక రీచ్‌ను ప్రతి 14 రోజులకు ఒకసారి రెన్యువల్ చేస్తూ గత ఆరు నెలలుగా ఇసుకను రేయింబవళ్లు తవ్వుతున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలను విశాఖ, తునికి చెందిన వ్యక్తులకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ తవ్వకాల కారణంగా మాతల వంతెనకు నష్టం కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన చేసినా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. కలమట వెంకటరమణ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నివగాం రీచ్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టీడీపీ అధ్యక్షులు కలమట వెంకటరమణ ఇద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఎవరూ మాట్లాడటంలేదని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఆకులతంపర వద్ద డీసిల్ట్రేషన్ చేయడానికి శ్రీకాకుళానికి చెందిన వ్యక్తులు కాంట్రాక్ట్ అప్పగించారు. స్కై ఇన్‌ఫ్రా పేరుతో అప్పటికప్పుడు ఓ సంస్థను సృష్టించి తవ్వకాలకు అర్హతను పొందారు. ఈ రెండుచోట్లా తవ్వుతున్న ఇసుక నేరుగా విశాఖపట్నం తరలిపోతుంది. ఆకులతంపర విషయంలో ఇద్దరూ అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 5న మామిడి, కలమట సమావేశమై నివగాం, ఆకులతంపర ఇసుక తవ్వకాలపై మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఆతర్వాత కలమట వెంకటరమణ గురువారం ఆకులతంపర వద్ద హడావుడి చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నివగాం వద్ద లేని అభ్యంతరం ఆకులతంపర వద్ద ఎందుకు వచ్చిందో కలమట వెంకటరమణకే తెలియాలి. నివగాం వద్ద భారీ యంత్రాల సహాయంతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఆకులతంపరలో డీ సిల్ట్రేషన్ పద్ధతిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినందున ఇక్కడ పూర్తిగా మాన్యువల్ ద్వారానే ఇసుకను తవ్వి ఒడ్డుకు చేర్చాలి. కానీ అది జరగడంలేదు. ఏకంగా నదీగర్భంలోకే ప్రొక్లెయినర్లను తీసుకెళ్లి తోడేస్తున్నారు. వాస్తవానికి ఈ రెండుచోట్లా నిరంతరం జేసీబీలు పని చేస్తునే ఉన్నాయి. పరిధికి మించి ఎప్పుడో తవ్వేశారు. జిల్లాలో అన్ని రీచ్‌ల్లో భారీ యంత్రాలను ఉపయోగించి, ఇసుక లారీలకు లోడ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నివగాం, ఆకులతంపరలో నిబంధనలకు విరుద్ధంగా 2010 వంశధార గ్రీన్ ట్రిబ్యునల్ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులకు మించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నదుల్లో మట్టితో బాటలు వేసి నేరుగా లారీలు, టిప్పర్లను తరలించి యంత్రాల సాయంతో లోడ్ చేస్తున్నారు. లారీల్లో లోడ్ చేసిన ఇసుకను విశాఖకు, టిప్పర్లలో లోడ్ చేసిన ఇసుకను జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆకులతంపర వద్ద డీసిల్ట్రేషన్ పేరుతో నదిలో ఇసుక నిబంధనలకు విరుద్ధంగా నాలుగు ఐదు మీటర్ల లోతులో తవ్వడం వల్ల పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. నివగాంలో సాధారణ రీచ్ పేరుతో ఇసుకను 9 అడుగుల లోతులో తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వెనుక కూటమి పెద్దలు, నాయకుల జోక్యం స్పష్టం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలోనే టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ అకస్మాత్తుగా ఆకులతంపర ర్యాంపు వద్ద ప్రత్యక్షమై ఇసుకను అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కలమట రమణ ఆందోళన చేయడంతో శుక్రవారం మైన్స్‌శాఖకు చెందిన డీడీతో పాటు సర్వేయర్ వరకు ఆకులతంపర ర్యాంపును పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌కు ఏమేరకు నివేదిక అందిస్తారో వేచిచూడాలి.
Comments