బాబు సమక్షంలో చేరేందుకు సన్నద్దం

(సత్యంన్యూస్, పలాస)
వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు, కౌన్సిలర్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతినిధి శ్రీకాంత్ ముహూర్తం ఫిక్స్ అయింది. పలాసలో సోమవారం నిర్వహించనున్న చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారసభలో దువ్వాడ శ్రీకాంత్ చేరనున్నారు. అందుకు రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మెహన్‌నాయుడు ఆదివారం మంతనాలు జరిపి టీడీపీలో చేరేందుకు అన్ని మార్గాలు సుగమం చేశారు. ఈమేరకు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ జయశ్రీ సోమవారం ఉదయం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. శ్రీకాంత్ పాటు మంత్రి సీదిరి అప్పలరాజుకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ నాయకుడు కొర్ల కన్నారావు కూడా టీడీపీలో చేరనున్నారు. దీంతో పలాస టీడీపీలో జోష్ కనిపిస్తుంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నాయకులు టీడీపీలో చేరడం వైకాపాకు పెద్ద షాక్ అని చర్చ సాగుతుంది. వీరితో పాటు మరికొందరు వైకాపా నాయకులకు చంద్రబాబు పార్టీ కండువాలు వేయనున్నట్టు తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకుడిగా, నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికౖెె వివిధ హోదాల్లో పార్టీ పదవులు నిర్వహించిన శ్రీకాంత్ పార్టీ వీడడానికి మంత్రి సీదిరి అప్పలరాజు నిర్లక్ష్య వైఖరే కారణమని పార్టీలోనూ విమర్శలున్నాయి. పలాసలో మంత్రి అప్పలరాజు వైఖరి తమకు నచ్చడంలేదంటూ ఎప్పట్నుంచో ఒక వర్గం అసంతృప్తితో ఉంది. వీరిని పార్టీ పెద్దలు పెద్దగా బుజ్జగించకపోవడంతో ఇప్పటికే కొంతమంది పార్టీని వీడి వెళ్లిపోయారు. అప్పటికే మంత్రి అప్పలరాజు మీద అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 200 పేజీల పుస్తకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చినా మంత్రి సీదిరినే అభ్యర్ధిగా కొనసాగించడాన్ని దువ్వాడ శ్రీకాంత్‌తో పాటు మరికొందరు వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాంత్ వైకాపాను వీడుతున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే పార్టీ అధిష్టానం దువ్వాడ శ్రీకాంత్‌ను పిలిపించి మాట్లాడినా సమ్మతించలేదు. సీదిరికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా వైకాపా కోసం పని చేస్తానని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఎంపీ సుబ్బారెడ్డి, చిన్న శ్రీనులకు నేరుగానే చెప్పేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైకాపా ఎంపీ అభ్యర్ధి పేరాడ తిలక్‌లు కూడా శ్రీకాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. చివరికి శ్రీకాంత్ సోదరుడు శ్రీధర్, ఆయన తల్లి కూడా పార్టీ మార్పుపై పునరాలోచించాలని కోరారు. మంత్రి సీదిరి వల్ల తీవ్ర అన్యాయానికి గురయ్యానని, వ్యాపారాలు మూతపడ్డాయని, చివరకు తాను కౌన్సిలర్‌గా గెలుపొందిన వార్డులో వేరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించారని, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనకు సమాచారం ఇవ్వకుండా వేరొకరికి బాధ్యతలు అప్పగించారన్న విషయాన్ని ముందుకు తెచ్చి ఆయన పార్టీని వీడుతున్నారు. మరోవైపు పార్టీకి శ్రీకాంత్ సేవలు అవసరం లేదన్నట్టు వ్యవహరించి సోషల్ మీడియాలో శ్రీకాంత్‌కు వ్యతిరేకంగా ట్రోల్ చేయించి పొగ పెట్టి బయటకు పంపించాలని మంత్రి సీదిరి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న గ్రావెల్ క్వారీని ఉద్దేశపూర్వకంగా నిలుపుదల చేయించారని సీదిరిపై బహిరంగంగానే శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. క్వారీ నిర్వహించడానికి నెలకు కొంత మొత్తాన్ని డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని ఇదివరకు శ్రీకాంత్ ఆరోపించారు. తన క్వారీని నిలుపుదల చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోయారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సోదరుడు టీడీపీలో చేరడం పట్టణం, మండలంలో వైకాపాపై తీవ్ర ప్రభావం పడుతుందని పార్టీలోనే చర్చ సాగుతోంది.
Comments