top of page

టార్గెట్‌ 400.. కమలం తలకు మించిన లక్ష్యం!

Writer: DV RAMANADV RAMANA
  • బీజేపీకి సొంతంగా 370.. ఎన్డీయే కూటమికి 400కుపైగా

  • టార్గెట్‌ పేరుతో మోదీ బృందం మైండ్‌గేమ్‌

  • కానీ పరిస్థితి చూస్తే కొండకు తాడు వేసి లాగే చందం

  • కాషాయదళం ఊపంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే

  • కూటమి పక్షాలన్నీ చిన్నాచితకా పార్టీలే

  • దక్షిణాదిలో 130 స్థానాల్లో 30 సాధించడమే కనాకష్టం

  • ఈశాన్య రాష్ట్రాల్లో బలమున్నా అక్కడన్నీ సింగిల్‌ డిజిట్‌ సీట్లే

(రచ్చబండ)
` డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

రాజకీయ పార్టీలన్నాక కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఇక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్నదు ప్రధాన పార్టీలన్నీ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తాయి. చివరికి ఏదో ఒక పార్టీ గెలుస్తుందన్నది వేరే విషయం. అదే విజయం సాధిస్తామన్న ధీమా ఉన్న పార్టీలు మరికొంత ముందుకెళ్లి సాధారణ మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునేదానిపై గురి పెడతాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న వైకాపా అధినేత జగన్‌.. రెండోసారీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. కానీ అక్కడితో ఆగిపోకుండా ప్రతిపక్షానికి అవకాశం లేకుండా మొత్తం సీట్లు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దానికి తగినట్లే ‘వైనాట్‌ 175’ అన్న నినాదాన్ని ఈ ఎన్నికల్లో తన క్యాడర్‌కు అందజేశారు. అదేవిధంగా కేంద్రంలో గత రెండు దఫాలుగా అధికారం చేజిక్కించుకున్న ఎన్డీయే ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. ఆ హ్యాట్రిక్‌ విజయం కూడా ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో ‘అబ్‌కీ బార్‌ 400 బార్‌’ అన్న నినాదంతో ఈ ఎన్నికల్లో పనిచేస్తోంది. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీయే సొంతంగా 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయే కూటమి 400 సీట్లు దాటాలని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌ పెట్టారు. బాగానే ఉంది.. కానీ దేశంలో పరిస్థితి ఆ కూటమికి అంత అనుకూలంగా ఉందా? తన టార్గెట్‌ ఛేదించడానికి మోదీ బృందం అనుసరిస్తున్న వ్యూహాం ఏమిటి? అవి ఎంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశాలను ఒకసారి పరికిద్దాం.

ఈ లక్ష్యం వెనుక ఉద్దేశం ఏమిటి?

ఒకప్పటి జనసంఫ్‌ు నుంచి 1980 ప్రాంతంలో రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన చరిత్రలో తొలిసారి ఉచ్ఛస్థితిలో ఉంది. గతంలో ఇతర పార్టీలపై ఆధారపడి రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా.. 2014 నుంచి అంటే నరేంద్ర మోదీ సారధ్యంలో మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని నడపగలుగుతోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 543 మంది సభ్యులున్న లోక్‌సభలో కనీసం 272 మంది ఎంపీల బలం ఉండాలి. కానీ 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 353 స్థానాలు సాధించి మోదీ ఆధ్వర్యంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్క బీజేపీ వాటాయే 282 సీట్లు.. అంతే సింపుల్‌ మెజారిటీ ఆ పార్టీకి ఉన్నప్పటికీ కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో మరింత మంచి మెజారిటీ సాధించింది. ఆ ఎన్నికల్లో ఒక్క బీజేపీయే 303 సీట్లు సాధించగా కూటమి పరంగా ఎన్డీయే మళ్లీ 353 సీట్లు సాధించింది. వరుసగా రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏ పార్టీ అయినా, కూటమి విషయంలోనైనా సహజంగా ప్రజావ్యతిరకత పెరుగుతుంది. ఎన్డీయే విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా దాన్ని సద్వినియోగించుకుని ధీటైన పోటీ ఇచ్చే పార్టీ గానీ, కూటమి గానీ లేకపోవడమే ఎన్డీయేకు బాగా కలిసివస్తున్న అతి కీలకాంశం. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌తో సహా పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి పోటీ పేరుతో ఇండియా కూటమిని ఏర్పాటు చేసినా.. జేడీయూ వంటి కొన్ని పార్టీలు ఇప్పటికే జారిపోవడం, తృణమూల్‌, ఆప్‌ వంటి పార్టీలు తమ పట్టు ఉన్న రాష్ట్రాల్లో ఒంటెత్తు పోకడలకు పోతుండటంతో ఇండియా కూటమి ప్రయోగ దశలోనే నీరసించిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి హాట్రిక్‌ ఖాయమన్న ధీమాతో ఉన్న మోదీ బృందం ఇదే అదనుగా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ‘అబ్‌కీ బార్‌ 400 పార్‌’ అన్న నినాదం ఇచ్చింది. దీనికి మోదీ బృందం చెబుతున్న రీజన్స్‌ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు గుర్తుగా బీజేపీకే సొంతంగా 370 సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అలాగే దేశంలో ఎన్నికల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఒకే ఒక్కసారి లోక్‌సభ ఎన్నికల్లో ఒకపార్టీ 400కుపైగా సీట్లు గెలిచిన సందర్భం ఉంది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో ఆ సానుభూతి కారణంగా కాంగ్రెస్‌ ఏకంగా 414 సీట్లతో అద్భుత విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తున్న తరుణంలో ఈసారి ఆ రికార్డును బ్రేక్‌ చేస్తే మరింత ఘనంగా ఉంటుందని మోదీ ఆరాటం. అందుకే ఎన్డీయే కూటమి ఈసారి 400కు మించి సీట్లు సాధించాలని ఆయన లక్ష్యం నిర్దేశించారు.

వ్యూహం ఏమిటి?

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కారు ఒకవైపు అభివృద్ధి అంటూనే మరోవైపు అంతర్లీనంగా హిందుత్వ అజెండా అమలు చేస్తోంది. దేశంలో మౌలిక సౌకర్యాలు విస్తృతంగా అమలు చేశామని, అలాగే వందేభారత్‌ రైళ్లతో రైల్వేచరిత్రలో సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల శకానికి అంకురార్పణ చేసింది. భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేశామని చెప్పుకొంటోంది. వీటినే చూపిస్తూ వికసిత భారత్‌ నినాదం అందుకుంది. అదే సమయంలో శతాబ్దాల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేయడం ద్వారా అతిపెద్ద హిందూ అజెండాను పూర్తి చేసి ఆ వర్గం ఆదరణ పొందింది. అలాగే వారణాసిలో కాశీవిశ్వనాథ్‌ కారిడార్‌, ఉజ్జయినిలో మహంకాళ్‌ కారిడార్‌ వంటి వాటి నిర్మాణంతో హిందూ అజెండాను విజయవంతంగా అమలు చేస్తోంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌ను విడగొట్టడం, దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ) వంటి వాటిని అమల్లోకి తేవడం ద్వారా ముస్లింలలో అశాంతి రాజేసినా హిందువుల ఓటింగ్‌ను ఏకపక్షం చేసుకోగలమన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచన. వీటి ప్రభావంతోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో బీజేపీకి, ఎన్డీయే కూటమి మాంచి ఊపు మీదున్నట్లు కనిపిస్తోంది.

కొండంత లక్ష్యం

ఎంత ఊపు మీదున్నా మోదీ బృందం నిర్దేశించుకున్న టార్గెట్‌ కొండను తలపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవాప్తంగా ప్రస్తుత రాజకీయ వాతావరణం పరిశీలిస్తే బీజేపీ 370, ఎన్డీయే 400 సీట్లు సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. బీజేపీకి ఉత్తరాదిలో ఊపు కనిపిస్తోంది. దక్షిణాదిలో ఆ పార్టీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువ సీట్లు లభించే అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం 80 లోక్‌సభ సీట్లు ఉండగా ఆ ఒక్క రాష్ట్రంలోనే 70కిపైగా సీట్లు బీజేపీ సాధించే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు సాధించవచ్చు. తర్పూ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, అసోంలలో కొంతవరకు ఫర్వాలేదు. బెంగాల్‌లో తృణమూల్‌ నుంచి తీవ్ర పోటీ ఉన్నందున ఆ రాష్ట్రంలోని 42 సీట్లలో 20లోపే బీజేపీకి దక్కవచ్చని అంచనా. ఇక ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బీజేడీతో పొత్తు పెట్టుకుని సగం సగం సీట్లకు పోటీ చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు సాధించినా అక్కడ ఉన్నవి చాలా తక్కువ సీట్లే. ఇక దక్షిణాదిలో మొదటి నుంచి బీజేపీ పరిస్థితి దయనీయం. కర్ణాటకలో కొంత ఫర్వాలేకున్నా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ప్రభుత్వం నుంచి దిగిపోయింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ ఓటింగ్‌ ప్యాటర్న్‌ మారిపోతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న 28 సీట్లలో బీజేపీ 15 వరకు గెలుచుకోవచ్చని అంచనా వేస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది. కొద్దోగొప్పో బలమున్న తెలంగాణలో ఉన్న 17 సీట్లలో బీజేపీ ఆరేడు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. కీలకమైన తమిళనాడులో నిన్న మొన్నటి వరకు పొత్తులో ఉన్న ఏఐఏడీఎంకేను విడిచిపెట్టి చిన్న చిన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న డీఎంకేదే అధిపత్యం. ఈ రాష్ట్రంలోని 39 సీట్లలో బీజేపీకి ఒకటి రెండైనా దక్కుతాయా అన్నది అనుమానమే. కేరళలో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లను కాదని బీజేపీ గెలిచే పరిస్థితి అసలు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమిలో భాగంగా బీజేపీ ఆరు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. వీటిలో ఒకటిరెండు సీట్లు గెలిచినా గొప్పగానే భావించాలి. పుదుచ్చేరితో కలిపి దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే సీట్లు కలిపి బీజేపీ స్కోర్‌ 30 దాటకపోవచ్చు. అలాగే దేశంలో ఉన్న 543 సీట్లలో దక్షిణాది వాటా 130 సీట్లు పోతే మిగిలేవి 413 స్థానాలు. దక్షిణాదిలో లభించే అవకాశం ఉన్న 30 సీట్లు పోతే బీజేపీ లక్ష్యంలో మిగిలిన 340 సీట్లను ఆ 413 నుంచే రాబట్టుకోవాలి. అంటే దాదాపు 75 శాతం విజయాలు నమోదు చేయాలి. ఎలా చూసినా ఇది కష్టసాధ్యమే. పోనీ ఎన్డీయే పక్షాలు సాధిస్తాయా అంటే ఆ కూటమిలో ఉన్న బీజేపీ తప్ప మిగిలినవన్నీ చిన్నాచితకా పార్టీలే ఈ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్ల(17)కు పోటీ చేస్తున్న పార్టీ తెలుగుదేశమేనంటే మిగిలిన ఎన్డీయే పక్షాలు ఎంత చిన్నవో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే బీజేపీ 370, ఎన్డీయే 400 దాటాలన్న మోదీ బృందం ప్రచారం అంతా మైండ్‌ గేమ్‌గానే భావించాల్సి వస్తుంది. చాలా సంస్థలు వెలువరిస్తున్న ముందస్తు సర్వే అంచనాలు కూడా ఎన్డీయేకు 340 సీట్ల వరకే వస్తాయని పేర్కొంటుండటం గమనార్హం.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page