top of page

ట్రంపే కరెక్ట్‌ మొగుడు

Writer: DV RAMANADV RAMANA

ట్రంప్‌ ఎన్నిక చాలా సంతోషాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది. లోకంలో పిచ్చోళ్లే ఎక్కువ ఉన్నారని కొందరి నమ్మకం. అందులో మనమూ ఒకరు కావచ్చు. అమెరికా ఈ ప్రపంచానికి పెద్దన్న అయితే, ట్రంప్‌ బిగ్‌బాస్‌. వెర్రి వాళ్లకి వెర్రివాడే రాజుగా వుండడం కరెక్ట్‌. అమెరికా అంటే మన దృష్టిలో స్టేటస్‌ సింబల్‌. పిల్లలు అక్కడున్నారంటే పల్లెలోని రచ్చబండ దగ్గర కూడా పిలిచి సీటు ఇస్తారు. మా వాడు, మా అమ్మాయి అంటూ కోతలు కోయొచ్చు. పల్లెల్లో వరికోతల కంటే ఇవే ఎక్కువ ఇప్పుడు. పిల్లలు కూడా హైదరాబాద్‌ చిలుకూరులో దేవుడు చుట్టూ తిరిగి, తిరుమలలో పొర్లు దండాలు పెట్టి వీసాలు సంపాదిస్తారు. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు కన్నీళ్లలో చాలామంది జారిపడుతూ వుంటారు. విమానం ఎక్కగానే అమెరికా అని ఆనందంలో, మళ్లీ వాళ్లు ఎప్పుడొచ్చినా చుట్టపు చూపేనని విషాదాన్ని మరిచిపోతాం. డాలర్‌ వుంటే కాలర్‌ ఎగరేసుకు తిరగొచ్చు డాలర్‌ గుర్తు ‘ఎస్‌’ అనే అక్షరానికి నిలువు కోత. అదో అర్ధ సత్యం. సగం ఔను, సగం కాదు. పూర్తి నిజం ఎవరూ చెప్పరు. డబ్బున్న వాళ్లంతా తెలివైన వాళ్లని మన నమ్మకం. తెలివి లేనివాళ్లకి డబ్బు రాదు. అమెరికా తెలివైన దేశం. బీద ఆఫ్రికా దేశాలు తెలివిలేనివి. డబ్బు, తెలివి సమానార్థకాలు. తెలివైన అమెరికా, తెలివిలేని ట్రంప్‌ని ఎందుకు ఎంచుకుందని కొందరు అమాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచం అంతా ఒకటే ఫార్ములా. మన వార్డులో ఇద్దరు రౌడీలు కౌన్సిలర్లుగా నిలబడితే అందులో పెద్ద రౌడీని గెలిపిస్తాం. ఒకవేళ వీళ్లిద్దరికీ పోటీగా మంచోడు నిలబడితే, ఆ అవకాశం లేదు, నిలబడిన మరు క్షణం కాళ్లు విరగ్గొట్టి మూల కూచోపెడతారు. కుంటుతూ వెళ్లి నామినేషన్‌ వేస్తే, వాడికి డిపాజిట్‌ పోగొట్టి, బుద్ధి చెప్పి, ఆ రాత్రికి బార్‌లో పార్టీ చేసుకుని మెట్ల మీద దొర్లుకుంటూ ఇంటికెళ్తాం. మంచోడు ఎప్పటికీ రాజకీయాల్లోకి రాకుండా వుండడానికి వాడి ఇంటి ముందు ధర్నా చేస్తాం. సోషల్‌ మీడియా పోస్టులు పెట్టి, ఇంటిల్లిపాదిని వణికిస్తాం. రాజకీయాల్లోకి మేసేవాడు వస్తే మన కింత గడ్డి పెడ్తాడు. తిను, తినిపించు. చిల్లర విసిరి, నోట్లు ఏరుకో. ట్రంప్‌ వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్‌ కేసులున్నాయి. ఓడినా దబాయించి గెలి చాను అనగలడు. తిక్క, వెర్రి, పిచ్చి అన్నీ కలిపి వ్యవహరించగలడు. ఇంతకు మించిన అర్హత ఏముంది? అన్ని దేశాల్లో, అన్ని ఊళ్లలో వీళ్లే కదా ఉన్నారు! అమెరికా దారిలోనే ప్రపంచం నడుస్తుంది. ప్రపం చాన్ని అమెరికా నడిపిస్తుంది. ట్రంప్‌ కరెక్ట్‌ నమూనా. అతని దగ్గర వేల ట్రంప్‌ కార్డులున్నాయి. క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌ ఆడగలడు. కాకపోతే బాల్‌కి బదులు భూగోళం వుంటుంది. చిన్నప్పుడు అన్నం తినకపోతే పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లు వస్తారని భయపెట్టేవాళ్లు. ఎవడూ ఎత్తుకుపోకుండానే పెరిగి పెద్దవాళ్లయ్యాం. న్యూయార్క్‌ హార్బర్‌లో ఒకావిడ విగ్రహం వుంటుంది. చేతిలో కాగడాతో పిలుస్తూ వుంటుంది. మన దేశంలోని పిల్లలందరినీ ఎత్తుకుపోయే పనిలో వుంది. ట్రంప్‌, కమలా హారిస్‌ ఇరువురిలో ఎవరు గెలిచినా, ఓడినా ‘అమెరికాతనం’లో మార్పుండదు. ఎందుకంటే బరాక్‌ ఒబామా మధ్య ప్రాచ్యంలో యుద్ధాన్ని ఆపించలేదు, జోబైడెన్‌ నాటోని విస్తరించడంలో భాగంగా ఉక్రెయిన్‌ని యుద్దంలోకి తోసేశాడు, పాలస్తీనీయుల మీద మునుపెన్నడూ ఎరుగనంత దాడికి ఇజ్రాయేల్‌ని సిద్ధం చేశాడు. అమెరికన్లకి తమ ప్రయోజనాలే ముఖ్యం, మిగతావన్నీ తర్వాతే. మనుషులు మరీ స్వార్థపరు లైపోయారు. స్వార్థం అనేకన్నా అహంకారం ఎక్కువైపోతోంది, అకారణ ద్వేషం పెరిగిపోతోంది, ఆధి పత్యం కావాలని కోరడం ఎక్కువైంది. దాన్ని ప్రదర్శించే ట్రంప్‌ కావాలి వాళ్లకు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న మాంద్యంతో నిరుద్యోగిత, పేదరికం పెరిగిపోతోన్నప్పుడు వాటిని నియంత్రించలేని తనం మైనారిటీల మీదా, వలసల మీదా నెపం మోపి జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రోజుల్లో ఎవరు బాగా రెచ్చగొడతారో వాళ్లే గెలవడం సహజం. చిత్రమేమంటే, సగటున అక్కడి భారతీయులు కూడా ట్రంపే గెలవాలనుకున్నారు. ఎందుకంటే తాము లోపలికి వచ్చేశాం, ఇక దేశానికి గేట్లు మూసేయాలనేది వారి వాదన. మరొకడు తమ దేశం నుంచి వస్తే, ఇలా ప్రతివోడూ వచ్చేస్తే అక్కడ తమదేశంలో తమ మైలేజీ పడిపోతుందని, ఇక్కడ సంపదలో వాటా పంచుకోవాల్సి వస్తుందని! ఇంత ఎన్నికల్లో రిలీఫ్‌ ఏమిటంటే.. మా కులస్తురాలు, మా ఇంటి ఆడపడుచు, మా మేనత్త కమాలా హారిస్‌ అమెరికాని ఏలుతోందని కూసే ఆధిపత్య కూతలని తట్టుకోవడం మనకు తరమయ్యేది కాదు!

 
 
 

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page