
మరో శక్తిమంతమైన నాయకుడు ఎన్నికయ్యాడు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అమెరికాలో దేశాధ్యక్ష పదవీ ఎన్నికలో డోనాల్డ్ ట్రంప్ కచ్చితమైన, చరిత్రాత్మక విజయం సాధించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను ఎవరూ ప్రశ్నించరు, ప్రశ్నించలేరు. అమె రికాను మళ్లీ గొప్ప దేశంగా రూపొందించుకుందాం అన్న నినాదంతో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ప్రచార పర్వంలో ఆయన ప్రసంగాలు స్త్రీలను కించపరిచేవిగాను, జాత్యహంకారాన్ని రెచ్చగొట్టేవిగాను, ప్రజలలో విభేదాలు, చీలికలు సృష్టించేవిగాను, ప్రత్యర్థులను అమితంగా దుర్భాష లాడినవిగా ఉన్నాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘటనలు, ప్రచార వైనాల స్వతంత్ర పరిశీలకులు, నిష్పాక్షిక మీడియా ప్రతినిధులు అంగీకరించారు. అయితే అమెరికా ప్రజలలో అత్యధికులు ట్రంప్ ప్రచార తీరుతెన్నులను ఏ మాత్రం పట్టించుకోనేలేదు. వలసలు, ద్రవ్యోల్బణం, పెచ్చరిల్లిన నేరాలు తదితర అంశాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. ఆ సమస్యల నుంచి ఎవరు తమను బయట పడవేయగలరని మాత్రమే వారు ప్రధానంగా ఆలోచించారు. ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మిగతా రెండు మనం ‘బతుకుతెరువు’ అంశాలుగా పరిగణించేవి కావు. వాటిని మంచి జీవితాన్ని నిర్మించుకో వడంలో సాఫల్య వైఫల్యాలకు సంబంధించినవిగా అభివర్ణించవచ్చు. అమెరికాకు వలస వస్తున్నవారు ‘మనలాంటి వారు కారు’ అన్నది రిపబ్లికన్ల అభిప్రాయం. ఈ పరాయివారు శ్వేత జాతీయులైన అమెరికన్ క్రైస్తవ పౌరులను ముంచెత్తుతున్నారని, ఫలితంగా అమెరికా ప్రజలు అనేక ఆర్థిక ఇక్కట్లకు లోనవుతున్నారంటూ వలసకారులకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ముమ్మర ప్రచారం చేశారు. దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లినవారు (ప్రధానంగా లాటినో ఓటర్లు) సైతం కొత్త వలసకారుల నుంచి తమ మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని గట్టిగా భావిస్తున్నారు. సరే ద్రవ్యోల్బణం ప్రతి దేశం లోనూ ప్రతి ఒక్కరికీ సమస్యలు సృష్టిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 2.4 శాతానికి కట్టడి చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన వడ్డీ రేటును తగ్గించడానికి సిద్ధంగా ఉన్నది (ద్రవ్యోల్బణం తక్కువగా ఉందనేందుకు ఇదొక సూచన). అయినప్పటికీ ద్రవ్యోల్బణంను రిపబ్లికన్ పార్టీ ఒక ప్రచార అస్త్రంగా చేసుకున్నది. అనేక దేశాలలో మాదిరిగానే అమెరికాలోను నేరాలు బాగా పెరిగిపోయాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మాదక ద్రవ్యాలే నేరాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. వలసలు, ద్రవ్యో ల్బణం, నేరాల పెరుగుదలను డోనాల్డ్ ట్రంప్ తన రాజకీయ లబ్ధికి గరిష్ఠంగా ఉపయోగించుకున్నారు. మొరటు భాషలో దుర్భాషలాడారు. అయినప్పటికీ అమెరికన్ ఓటర్లు ఆయన మొరటుతనం, ముతక విమర్శల పట్ల ఎటువంటి అభ్యంతరం, ఆక్షేపణ తెలుపకపోవడం ఆశ్చర్యం. ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలను కలవరపెడుతున్న వివిధ అంశాలు అమెరికా ఎన్నికల ప్రచారంలో కనీస ప్రాధాన్యం కూడా పొందలేదు! మధ్య ప్రాచ్యంలో యుద్ధం, ఉక్రెయిన్`రష్యా యుద్ధం పెద్దగా ప్రస్తా వనకే రాలేదు. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ప్రజలు పూర్తిగా మరచిపోయినట్లుగా కనిపిస్తోంది అమెరికా భూభాగాలపై దాడి చేసేందుకు వీలైన ఖండాంతర క్షిపణుల ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఇరు పార్టీల అభ్యర్థులూ మరచిపోయినట్టున్నారు. పలు దేశాలలో అంతర్యుద్ధాలు, ప్రజాస్వామిక దేశాలుగా పిలవ బడుతున్న దేశాలలో పౌర స్వేచ్ఛల అణచివేతను అభ్యర్థులు గానీ, ఓటర్లు గానీ పట్టించుకోనే లేదు. ఈ అంతర్జాతీయ ఉపద్రవాలను అలా ఉంచితే తాము ఓటు వేస్తున్న (అంతిమంగా గెలిచిన) అభ్యర్థిని ఒక దోషిగా న్యాయస్థానం నిర్ధారించిందని, శిక్ష ఖరారు కావచ్చనే వాస్తవాన్ని కూడా అమెరికన్ ఓటర్లు పూర్తిగా విస్మరించారు. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా రూపొందించిన స్వేచ్ఛా వాణిజ్య విధానాలు, తక్కువ సుంకాలు, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టాల ఉపసంహరణ గురించి వారు ఏ మాత్రం పట్టించుకోనే లేదు. డోనాల్డ్ ట్రంప్ విజయానికి అమితంగా ఆనందపడిన కార్పొరేట్ శక్తులు చమురు, ఔషధాల తయారీ, అధునాతన సాంకేతికతలకు సంబంధించిన బహుళ జాతి కంపెనీలే. మరి ఆ దేశాధ్యక్ష పదవీ ఎన్నికల ఫలితం ఇతర దేశాలలోని ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? చేయగలదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉపయోగించిన మొరటు భాష, ప్రజలలో విభేదాలు చీలికలు సృష్టించిన వ్యాఖ్యల వైనాన్ని అనుకరించేందుకు ట్రంప్ విజయం ఇతర దేశాలలోని నాయకులను పురిగొల్పవచ్చు. ట్రంప్ ప్రచార నమూనా ఒక ఒరవడి అయితే అది ప్రజాస్వామ్యానికి ఘోర పరాజయం అవుతుంది.
Comments