top of page

ట్రంప్‌ తగ్గినా ఆశ్చర్యం లేదు

Writer: DV RAMANADV RAMANA

పీఠమెక్కి రెండు నెలలు కూడా గడవక ముందే కొరడా రాజుగా మారిన డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు లొంగరు అనుకున్నవారి మీద ఎడాపెడా కొరడా రaళిపిస్తున్నాడు. సుంకాలు, ప్రతి సుంకాలు, ఆంక్షలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నాడు. తలవంచేట్లు చేసేందుకు బెదిరింపులా, బేరమాడేందుకు వేస్తున్న పాచికలా చివరకు ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి దేశానికి బలం- బలహీనతలున్నాయి, దానికి అమెరికా మినహాయింపు కాదు గనుక ట్రంపు కూడా తగ్గినా ఆశ్చర్యం లేదు. ప్రతి దేశమూ సర్వసత్తాకమే, ప్రతివారూ తమదైన పద్ధతిలో ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నారు. తమ దేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలుపునంటూ ట్రంప్‌ ప్రపంచం మీద వీరంగం వేస్తే కుదరదు. రవి అస్త మించని సామ్రాజ్యాధిపతులం అనుకున్న బ్రిటన్‌ ఏమైంది, ప్రపంచాన్ని చాపలా చుట్టి చంకలో పెట్టుకో వాలనుకున్న హిట్లర్‌కు ఏగతి పట్టిందీ ఎరుకే. ఒక పోరులో గెలుస్తామా లేదా అన్నది తర్వాత అంశం, ఎదుటివారు దురాక్రమణకు పాల్పడితే ప్రతిఘటించాలా, చేతులు నలుపుకోవాలా అన్నదే సమస్య. వివా దాలు తలెత్తితే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ), ఐరాస, ప్రపంచ కోర్టులు ఉన్నాయి. ఎలాంటి సంప్ర దింపులు, అభిప్రాయాల మార్పిడి లేకుండానే తన బుర్రలో తెల్లవారుజామున పుట్టిన బుద్దిని బయటపెట్టు కున్నట్లుగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా సుంకాలు ప్రకటించి చర్చలకు సిద్ధమంటున్నాడు. ఆత్మగౌరవం గల ఏ దేశమూ ఈ దందాను అంగీకరించదు. అందుకే ‘మా ఇల్లు మీకెంత దూరమో.. మీ ఇల్లూ మాకూ అంతేదూరం’ అంటూ వెంటనే స్పందించాల్సిందే. రా! ఎలాంటి యుద్ధం కావాలని కోరుకుంటావో దానికి మేమూ సిద్ధమంటూ తాజాగా చైనా భేరీ మోగించింది. గతంలో ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ఇతర మరికొన్ని సమస్యల కారణంగా అక్కడ గతంలో మాదిరి వృద్ధిరేటు లేని మాట నిజం కావచ్చుగాని అది ఏ ఇతర ధనిక దేశంతో పోల్చుకున్నా ఎంతో మెరుగైనదే. అది ఎదుర్కొంటున్న సమస్యలను అవ కాశంగా తీసుకొని అణగదొక్కుదామని చూస్తే కుదిరేది కాదని తేలిపోయింది. ట్రంపూ అతగాడితో ఊరేగు తున్నవారు, ఉబలాటపడుతున్న వారికీ అర్థ్దమౌతోందా అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ అవగతమైతే పరిణా మాలు వేరుగా ఉండేవి. బీజింగ్‌లో జరుగుతున్న పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఐదు శాతం వృద్ధి రేటు లక్ష్యంగా నిర్ణ యించి దానికి అవసరమైన చర్యల గురించి చర్చిస్తున్నది. దశాబ్దాల తరబడి అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న కెనడాను ఆక్రమించి 51వ రాష్ట్రంగా చేసుకోవాలన్న సంకల్పాన్ని ట్రంప్‌ పదే పదే ప్రకటిస్తు న్నాడు. మరోసారి దాన్ని అవమానకరంగా వెల్లడిరచాడు. ప్రతి సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతా మంటూ పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టులో కెనడా ప్రధానిని ఉద్దేశించి ఈ విషయాన్ని ‘కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రుడేవ్‌కు’ వివరించండని కూడా దానిలో సలహా ఇచ్చాడు. అంటే కెనడా తమ రాష్ట్రమని పునరు ద్ఘాటించటమే. టిప్‌టాప్‌గా ఉన్నప్పటికీ అతగాడి చర్యలు పిచ్చివాడి పనిగా ఉందంటూ ఒక పత్రిక చేసిన వ్యాఖ్యను ట్రంప్‌ గురించి ట్రుడేవ్‌ ఉటంకించాడు, తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ప్రతిసుంకాలను ప్రక టించాడు. అత్యంత సన్నిహితం, భాగస్వామిగా ఉన్న కెనడా మీద వాణిజ్య యుద్ధం ప్రకటించి అదే సమ యంలో హంతక నియంత పుతిన్‌ను సంతుష్టీకరించేందుకు పూనుకోవటం మతి ఉండి చేస్తున్న పనులేనా అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. అఫ్‌ కోర్సు ఇదే పెద్ద మనిషి తర్వాత జావగారిపోయినా చేసేదేమీ లేదు, అది వేరే విషయం. చివరికి కెనడాలో అత్యధిక జనాభా గల ఒంటారియో రాష్ట్ర ప్రధాని డగ్‌ ఫోర్డ్‌ కూడా ట్రంప్‌ను దుయ్యబట్టాడు. ‘మేమిచ్చే విద్యుత్‌, ఇంథనం మీద ఆధారపడుతూ మమ్మల్ని బాధిస్తారా, మేం తలుచుకుంటే న్యూయార్క్‌ నగరంలో 15 లక్షల మందికి విద్యుత్‌ నిలిచిపోతుంది జాగ్రత్త’ అన్నాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న కెనడియన్లే అలా స్పందిస్తే మన సంగ తేమిటి? ఉన్న కార్యక్రమాలన్నీ ఆకస్మికంగా రద్దు చేసుకొని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లి అక్కడి వాణిజ్యమంత్రితో సంప్రదింపులు జరిపినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మరుక్షణమే ట్రంప్‌ ప్రకటన చేశాడు. తాను ప్రపంచమంతా తిరిగిపోయిన భారత ప్రతిష్టను తిరిగి తెచ్చానని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ నోటి నుంచి ట్రంప్‌ సుంకాల ప్రకటన మీద గడిచినా ఎలాంటి స్పందన లేదు. ఆత్మ గౌరవమా, లొంగుబాటా? ఏమనుకోవాలి? ఫిబ్రవరి రెండవ వారంలో మోదీ అమెరికా పర్యటన జరపటానికి ముందే నమస్కార బాణం వేసినట్లుగా కొన్నింటి మీద పన్నులు తగ్గించి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చూశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా? 140 కోట్ల మంది జనానికి ఏదో ఒకటి చెప్పాలా వద్దా!

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page