ట్రంప్ దొర ‘అణు’రాగం!
- DV RAMANA

- Nov 5
- 2 min read

ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. డోనాల్డ్ ట్రంప్! ఈయనగారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టింది లగాయితు ఆమెరికా పౌరులతోనే కాకుండా ప్రపంచంతోనే తన మాటలు, చేతలతో ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు. తన మాట వినని దేశాలపై కక్షగట్టి టారిఫ్‌ల మోత మోగిస్తూ ప్రత్యక్షంగా ఆయా దేశాలను.. పరోక్షంగా తన దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్న ట్రంప్ మహాశయుడు ఒకవైపు యుద్ధోన్మాదంతో రెచ్చిపోతూ మరోవైపు ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపినందున తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని పట్టుబడుతున్నారు. ఒక రకంగా నోబెల్ ఎంపిక కమిటీపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. శాంతి కాముకుడినని తనకు తానుగా కితాబులిచ్చుకుంటున్న ఈయనగారు తాజాగా అణు పరీక్షల గురించి మాట్లాడుతూ కొత్త ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. అమెరికా, అవిభక్త సోవియట్ రష్యాల మధ్య సుదీర్ఘకాల ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అణుపరీక్షలు నిలిపివేసిన అమెరికా మూడు దశాబ్దాల తర్వాత ట్రంప్ కారణంగా మళ్లీ అణు కుంపటి రాజేస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణం. సీబీఎస్ న్యూస్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రతి మాటా ‘అణు’మానాల పెనుభూతాన్ని ప్రపంచం మీదకు వదులుతున్నట్లనింపించింది. ఇంటర్వ్యూలో అణు పరీక్షలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇప్పుడు అన్ని దేశాలూ అణు పరీక్షలు చేస్తున్నాయని.. ప్రపంచ ధోరణిని బట్టి అమెరికా కూడా అణు పరీక్షలు చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణు పరీక్షల నిర్వహణకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో సహా అనేక దేశాలు.. చివరికి పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరుపుతోందని, అమెరికా మాత్రమే అలా చేయని ఏకైక దేశంగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ధోరణి ప్రకారమే ఇక నుంచి అమెరికా ముందుకు వెళుతుందని చెప్పుకొచ్చారు. రష్యా, చైనా గురించి బయట సమాజానికి తెలియదు.. అమెరికా గురించి మాత్రం బహిరంగంగా తెలిసిపోతుందని వివరించారు. అణు పరీక్షలు గురించి రాసే విలేకర్లు రష్యా, చైనా దగ్గర లేరని.. అమెరికాలో మాత్రం ఆ స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఇటీవల రష్యా పోసిడాన్ నీటి అడుగున డ్రోన్‌తో సహా అధునాతన అణ్వాయుధ సామర్థ్యాన్ని పరీక్షించిందని ట్రంప్ ఆరోపించారు. ఉత్తర కొరియా అయితే నిరంతరం అణు పరీక్షలు చేస్తూనే ఉందని, ఇతర దేశాలు కూడా అలానే చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఒక్క అమెరికా మాత్రమే ఎందుకు మడికట్టుకుని కూర్చోవాలని ట్రంప్ ప్రశ్నించారు. చివరికి పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు చేయడానికి పూనుకుందని లోగుట్టు బయటపెట్టారు. ఆ దేశం రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని వెల్లడిరచారు. అయితే ఈ వాదనను పాక్ తోసిపుచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే భారత్, రష్యా, చైనా సహా అనేక దేశాలపై సుంకాలు పెంచి వాణిజ్య యుద్ధానికి తెగబడుతున్న ట్రంప్.. అంతర్జాతీయ ఒప్పందాలు, నిర్ణయాలకు విరుద్ధంగా పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు చేస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా భారత్‌పై అనవసరం కక్షతో పాక్‌తో చెలిమి చేస్తూ సైనిక, ఆర్థిక రంగాల్లో సహకరించేందుకు సిద్ధం కావడమంటే పాక్ అణు కార్యక్రమానికి పరోక్షంగా సహకరిస్తున్నట్లే! ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయి కాబట్టి తాను కూడా చేస్తానని ట్రంప్ తెగేసి చెప్పడమంటే ఇంతకాలం ఆయన చేస్తున్న శాంతి ప్రవచనాలు ఫేక్ అని, శాంతి కాముకుడినన్న ఆయన ముసుగు తొలగిపోయినట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యుద్ధాలు ఆపుతున్న తానొక శాంతిదూతనని, తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ట్రంప్ వాస్తవానికి అగ్రదేశం అన్న ట్యాగ్‌ను ఉపయోగించుకుని ఆయా దేశాల మెడలపై కత్తి పెట్టి తనకు కావలసింది సాధించుకుంటున్నారు. శాంతి కోరుకుంటున్న ఆయన తన పక్కనే ఉన్న వెనిజులాను ఆక్రమించుకునేందుకు కత్తులు నూరడం, ఒకప్పుడు అమెరికా సైనికులకు శిబిరంగా ఉపయోగపడిన ఆఫ్ఘనిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి తమకు ఇవ్వాలని తాలిబన్ పాలకులపై ఒత్తిడి తేవడం.. అందుకు నిరాకరిస్తే సైనిక చర్యకు దిగుతామని బెదిరించడం, యుద్ధం ఆపాలని ఒకవైపు రష్యాపై రకరకాలుగా ఒత్తిడి తెస్తూ.. మరోవైపు ఉక్రెయిన్‌కు సైనిక సహాయం చేయడం వంటి చిన్నెలు శాంతి సాధనకు ఎలా దోహదం చేస్తాయో ట్రంప్ దొరే చెప్పాలి. ఆయనగారి విన్యాసాలను సొంత దేశపౌరులే ఏవగించుకుంటున్నారు. భారత్ తదితర దేశాలపై సుంకాల భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఆమధ్య అమెరికా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రకటించారు. అలాగే ట్రంప్ ఆర్థిక బిల్లులను సెనేట్ తిరస్కరించడంతో గత మూడు వారాలుగా దేశం మొత్తం షట్‌డౌన్‌లోకి వెళ్లిపోయి పరిపాలన స్తంభించింది. ట్రంప్‌ను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే.. తాజాగా జరిగిన గవర్నర్ మేయర్ ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ బొక్కబోర్లా పడిరది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ప్రతిపక్ష డెమొక్రాట్లు విజయం సాధిస్తున్నారు. కీలక రాష్ట్రమైన వర్జీనియా గవర్నర్‌గా డెమొక్రాటిక్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ ఎన్నికయ్యారు. ఇక సిన్సినాటీ, అట్లాంటా, పిట్స్‌బర్గ్ మేయర్లుగా ఆ పార్టీవారే ఎన్నికయ్యారు. చివరికి సిన్సినాటీలో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సోదరుడు కూడా పరాజయం పాలు కావడం.. ట్రంప్ విధానాలకు ఎదురైనా తిరస్కారంగా భావించవచ్చు.










Comments