ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం పన్నాగం.. కాటేసిన కర్మఫలం
- NVS PRASAD
- Mar 22
- 4 min read
జిల్లాలో అన్నిచోట్లా టీచర్లే స్లిప్పులు అందిస్తారు
దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర
ఇన్విజిలేటర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల పాత్రపై నీలినీడలు
నీతి నిజాయితీల కోసం చెప్పాల్సిన టీచర్లు చూసిరాతలను ప్రోత్సహించడమా?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

విద్యార్థులు క్రమశిక్షణ తప్పారని ఒక హెడ్మాస్టర్ పిల్లల అసెంబ్లీలో గుంజీలు తీశారు. మరో టీచర్ బహుశా అదే జిల్లాలో అనుకుంటా.. కర్రతో చేతిపై గట్టిగా కొట్టుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో వీడియో తీశారా? తీయించారా? అన్న విషయం పక్కన పెడితే.. అక్కడ ఉన్న మిగిలిన టీచర్లు గాని, విద్యార్థులు కాని వారిని ఆపే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు. అయితే ఈ రెండు వీడియోలు కొద్ది రోజుల క్రితం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేయడంతో పాటు ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాయి.
పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే ఒక పాఠశాల గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరూ.. పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్టూ.. నీయవ్వ తగ్గేదే లే..’’ అంటూ నినాదం మన రాష్ట్రంలోనే ఓ చోట కనిపించింది.
శుక్రవారం కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు పదోతరగతి విద్యార్థులను డిబార్ చేయగా, 12 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్‌లను, ఒక అధ్యాపకేతర సిబ్బందిని జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు. పదో తరగతి విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడటానికి ఇన్విజిలేటర్ తోడ్పడటంతో పాటు వారి వద్ద ఆన్సర్ షీట్లు కూడా ఉన్నాయని, అందుకే సస్పెండ్ చేస్తున్నామంటూ డీఈవో తిరుమలచైతన్య ప్రకటించారు. అయితే ఇక్కడ కుప్పిలి మోడల్ స్కూల్‌కు డీఈవోతో కూడిన మూడు బృందాలు ఆకస్మిక తనిఖీకి వెళ్లడం వల్ల, అది కూడా ముందస్తుగా ఫిర్యాదు రావడం వల్ల ఇక్కడ విషయం బయటపడిరది కానీ, పదో తరగతి పరీక్షలు ఎప్పుడో గతితప్పాయి. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం కావడంతో పాటు మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించే విధానం రావడం వల్ల పదో తరగతి పరీక్షలు ఇప్పుడు విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే పెద్ద పరీక్షగా మారింది. నిజాయితీగా ఉండాలి, చూసిరాతలు తప్పు అని చెప్పాల్సిన ఉపాధ్యాయుల చేతిలోనే విద్యార్థులు రాయాల్సిన ఆన్సర్ షీట్లు ఉన్నాయంటే పరీక్షలు ఎంతలా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఏపీ మోడల్ స్కూల్‌తో పాటు పక్కనే ఉన్న కుప్పిలి జెడ్పీ హైస్కూల్‌లో కూడా ఇదే మాదిరి మాల్‌ప్రాక్టీస్ జరగడంతో రెండుచోట్లా కలిపి సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు. తన వద్ద ఆధారాలు లేవుగానీ, ఈ విధంగా పిల్లలు చూసిరాయడానికి ఇన్విజిలేటర్లు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు రూ.30వేలు నుంచి రూ.50వేలు వరకు సొమ్ములు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని స్వయంగా డీఈవోనే తెలుగు వన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజంగా ఈ స్టేట్‌మెంట్ చూసిన తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థుల ఎదురుగా గుంజీలు తీయడం, బెత్తంతో కొట్టుకోవడం తప్పే కాదనిపిస్తోంది. విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారని, ఎంత చెప్పినా బుర్రకెక్కడంలేదంటూ తమను తాము శిక్షించుకున్న ఉపాధ్యాయులున్న ఈ సమాజంలో విద్యార్థులను పరీక్షలు చూసి రాయించడానికి సొమ్ములు తీసుకున్నవారు గుంజీలు తీస్తే మాత్రం సరిపోదు. ఇప్పటికే ఉపాధ్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. విద్యాబుద్ధులు నేర్పడం తప్ప అన్ని వ్యాపారాలు ఉపాధ్యాయులే చేస్తున్నారన్న ఫీలింగ్ సమాజంలో ఉంది. దీనికి తోడు రాజకీయాలు, అమ్మాయిలను లైంగికంగా వేధించడం వంటివి రోజూ ఒకటి రెండు చోట్ల బయటపడుతున్నాయి. పదేళ్ల పాటు చదివిన విద్యార్థికి పదేళ్ల తర్వాత పరీక్ష పెడితే, దాన్ని కూడా చూసి రాయించడానికి సొమ్ములు తీసుకోవడం ఏ వెలుగుల వైపు తీసుకువెళ్లడానికో టీచర్లే చెప్పాలి. విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందనడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువే. ఓ దశాబ్దం నుంచి విద్యార్థులు చూసిరాతలకు పాల్పడితే చూసీచూడనట్లు వ్యవహరించిన ఇన్విజిలేటర్లు ఉండేవారు. రెండు దశాబ్దాల క్రితం పేపర్ చాలా టఫ్‌గా ఉందని, కనీసం 20 బిట్లు సాయం చేస్తే 35 మార్కులతో పాసవుతాడని భావించి కొన్నిచోట్ల సాయం చేసిన ఇన్విజిలేటర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు ఏకంగా మాల్‌ప్రాక్టీస్‌కు సొమ్ములు తీసుకొని విద్యార్థి తరఫున ఉపాధ్యాయులే పరీక్ష రాసే విధానం వచ్చేసింది. దొరికారు కాబట్టి కుప్పిలిలో ఉపాధ్యాయులు దొంగలయ్యారు కాని, జిల్లా వ్యాప్తంగా ఎప్పట్నుంచో ఇదే జరుగుతోంది. దీనికి తోడు ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలంటే ప్రభుత్వ స్కూల్‌లో చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంది. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు బేరం పెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4వేల సీట్లు ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా కింద కొన్ని సీట్లు తీసేస్తే గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు 70 శాతం, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారికి 30 శాతం సీట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ 30లో 15 శాతం ప్రైవేటు పాఠశాలల్లో చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునేవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎక్కువ మార్కులొస్తే ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థికంటే 20 మార్కులు వెయిటేజ్ కింద కలిపి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు ఇస్తున్నారు. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఇన్విజిలేషన్ వ్యవస్థనే ఇక్కడ కొనేశారు. తమ పనుల కోసం ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు లంచం అడుగుతున్నారని గగ్గోలు పెట్టే ఉపాధ్యాయులే ఇప్పుడు విద్యార్థుల తరఫున పరీక్షలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? డీఈవో కుప్పిలిలో రెండు పరీక్షా కేంద్రాలను పరీక్షించినప్పుడు బాత్రూముల్లో ప్రశ్నపత్రాల్లో ఉన్నవాటికి సమాధానాల చిట్టీలు కనిపించాయని చెబుతున్నారు. అలాగే పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ కోసం ప్రైవేటు సంస్థలు తయారుచేసిన గైడ్‌లు కూడా ఉపాధ్యాయుల వద్ద ఉన్నాయని స్వయంగా డీఈవోనే ఉపాధ్యాయుల వద్ద సెలవిచ్చారు. విద్యార్థులకు క్రమశిక్షణ పూర్తిగా లోపించిందని చెప్పిన ఉపాధ్యాయుల మీద ఇప్పుడు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో వారే చెప్పాలి. వాస్తవానికి చీఫ్ సూపరింటెండెంట్లుగా ఈ రెండు పాఠశాలలకు వ్యవహరించిన ఎం.లక్ష్మణరావు, దుర్గాప్రసాద్‌లే దీనికి పూర్తి బాధ్యత వహించాలి.
నేరం మొత్తం మోడల్ స్కూల్ మీద మోపేశారు
చూసి రాస్తూ పట్టుబడిన కేసులో నేరం మొత్తం కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్ మీదకు నెట్టేశారు. వాస్తవానికి ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ కేవలం అకామిడేషన్ మాత్రమే ఇచ్చింది. వీరి బల్లలు, ఫ్యాన్లు, నీటిని వాడుకోవడం మినహా మోడల్ స్కూల్ అధ్యాపకులకు, ఇక్కడ పరీక్షల నిర్వాహకులకు సంబంధం లేదు. ఈ పాఠశాలలో చుట్టుపక్కల ఉన్న సంతసీతారాంపురం, కుప్పిలి, కొయ్యాం, డి.మత్స్యలేశం, జీరుపాలెం, కొచ్చెర్ల, బుడగట్లపాలెం జిల్లాపరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులతో పాటు ఇదే మోడల్ స్కూల్‌లో చదువుతున్న కొందరు విద్యార్థులకు పరీక్షా కేంద్రంగా ఇచ్చారు. మొత్తం 391 మంది ఏపీ మోడల్ స్కూల్‌లో పరీక్షలు రాస్తున్నారు. అయితే వీటికి చీఫ్ సూపరింటెండెంట్లు గాని, ఇన్విజిలేటర్లుగాని ఏపీ మోడల్ స్కూల్ అధ్యాపకులు లేరు. అయితే రాష్ట్రంలో మోడల్ స్కూళ్లన్నీ సెల్ఫ్ సెంటర్లు. అందులో భాగంగానే కొంతమంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. శుక్రవారం ఇంగ్లీష్ పేపర్ చూసిరాస్తూ పట్టుబడిన ఐదుగురు విద్యార్థుల్లో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఒకరు ఉన్నారు అంతే. సాధారణంగా ఆరో తరగతికి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి ప్రత్యేక శ్రద్ధతో మోడల్ స్కూల్‌లో తరగతులు నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కువ మార్కులతో ట్రిపుల్ ఐటీలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ విద్యార్థులు సీట్లు సంపాదిస్తుంటారు. అయితే దీని మీద అవగాహన లేని కొందరు మోడల్ స్కూల్ సెల్ఫ్‌సెంటర్ కావడంతో అక్కడి విద్యార్థులందరూ చూసి రాసేసి ట్రిపుల్ ఐటీ సీట్లు కొట్టేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు డీఈవో రైడ్ చేసి పట్టుకున్నారు. ఆ సమయంలో డీఈవో జిల్లాలో ఏ మూలనో ఉన్న స్కూల్‌కు వెళ్లినా ఇదే సీన్ కనపడి ఉండేది.
విద్యాశాఖ తప్పిదం లేదా?
శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ చూసిరాతకు సహకరించారనే నేరంపై 15 మందిని సస్పెండ్ చేశారు. అసలు ఈ నేరం వెనుక జిల్లా విద్యాశాఖ కార్యాలయం పాత్ర లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పరీక్షల విధుల కేటాయింపులోనే చూసిరాతలకు అనుకూలమైన చర్యలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఒక కేంద్రంగా పరీక్షలు రాసే విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులను పక్క కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లుగాను, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌గాను నియమించారు. నిన్నటి వరకు వారు పాఠాలు చెప్పే పిల్లలు పక్క కేంద్రంలో పరీక్షలు రాస్తుంటే, వీరిని అక్కడికి అనుమతించారు. ఇచ్చితినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు ఒక స్కూల్ పిల్లలను మరో స్కూల్ ఇన్విజిలేటర్లు పరస్పరం చూసిరాతకు ప్రోత్సహిస్తూరావడం ఎవరిది తప్పు? జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉండే పాఠశాలల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఎక్కువగా సీట్లు వస్తున్నాయని, బహుశా ఇదే కారణం కావచ్చని మీడియాకు చెప్పుకొచ్చిన డీఈవో ఈ విషయం తెలిసి కూడా అక్కడ సీసీ కెమెరాలు పెట్టే అవకాశం ఉన్నా ఎందుకు పెట్టలేదన్నదే ఇప్పుడు ప్రశ్న.
Comments