top of page

ట్రిపుల్ మర్డర్‌కు ఏఐ సహకారం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 23
  • 3 min read
  • కలకలం సృష్టించిన కేసులో ప్లానంతా చాట్‌బాట్‌దే

  • బెంగళూరు పోలీసులనే నివ్వెరపరిచిన దర్యాప్తు వివరాలు

  • ప్రియుడితో కలసి సొంత కుటుంబం హత్య

  • పోలీసులనే సవాల్ చేస్తున్న డిజిటల్ దర్యాప్తు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జమానా నడుస్తోంది. ప్రస్తుతం అది సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నది. లెటర్ రాయాలన్నా.. ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్‌లేట్ చేయాలన్నా.. ఏదైన సమస్యపై సలహా కావాలన్నా.. ఏదైనా పని చేసిపెట్టాలన్నా ఏఐ సై.. సై.. అంటున్నది. మనం కూడా సొంత సృజనను పక్కనపెట్టేసి.. ప్రతిదానికీ ఏఐపైనే ఆధారపడటానికి క్రమంగా అలవాటు పడిపోతున్నాం. అయితే ఒక విషయం వింటే మాత్రం.. ఏఐ ఇలాంటి పనులు కూడా చేస్తుందా? నేరాలు చేసేందుకు, వాటి నుంచి తప్పించుకునేందుకు కూడా ఐడియాలు ఇస్తుందా?? అని విస్మయం చెందడం మనవంతు అవుతుంది. ఎందుకంటే సంచలనం సృష్టించిన ఒక ట్రిపుల్ మర్డర్ విషయంలో ప్రధాని నిందితుడికి ఏఐ చాట్‌బాటే వెన్నంటి ఉండి సలహాలతో ముందుకు నడిపింది. నేర నియంత్రణలో పోలీసులకు, నిఘావర్గాలకు సహాయపడుతున్న ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఇలా నేరాలకు కూడా దన్నుగా నిలవడం బహుశా ఇదే తొలిఘటనేమో! ఆవేశంలో చేసే నేరాలను పక్కనపెడితే కావాలని ప్లాన్ ప్రకారం చేసే ప్రతి నేరం వెనకా కచ్చితంగా ఎవరో ఒకరు మాస్టర్‌మైండ్‌గా ఉంటారు. ఆ మాస్టర్‌మైండ్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టడానికి నమ్మకమైన అనుచరులో, స్నేహితులో, కుటుంబ సభ్యుýను తోడుతీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే నేరఘటనలో ఏఐ మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తే.. ప్రధాన నిందితులు దాన్ని అనుసరించారు. ఫలితంగా బెంగళూరు నగరంలోని కృష్ణరాజపురం(కేఆర్‌పురం) పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు నెలరోజుల క్రితం ఒకే ఇంట్లో మÖడు హత్యలు జరిగాయి. అదుపులోకి తీసుకున్న నిందితులిద్దరినీ విచారించినప్పుడు నేరం చేయడానికి, తప్పించుకోవడానికి ఏఐ చాట్‌బాట్ సలహాలు తీసుకున్నట్లు వారు వెల్లడించడం పోలీసులనే నివ్వెరపర్చింది.

సొంత కుటుంబం అంతం

సమాజంలో పెరుగుతున్న లివ్ ఇన్ రిలేషన్‌షిప్( సహజీవనం) బంధాలు సహజసిద్ధమైన కుటుంబ బంధాలను కూడా అంతం చేసే స్థాయికి మనల్ని పతనం చేస్తున్నాయి. బెంగళూరులోని కేఆర్‌పురం ప్రాంతంలో సోమసుందర్(55), ముత్తులక్ష్మి(48) దంపతులు ఇద్దరు కుమార్తెలు.. శ్వేత(24), సుప్రియ(20)లతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్వేత ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. అక్కడే ఆమెకు కెన్నెత్(25) అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం పెరిగి సహజీవనం చేసే వరకు వెళ్లింది. ఇది శ్వేత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. తరచూ గొడవలు జరిగేవి. దాంతో వారిద్దరూ రెండు నెలల నుంచి సీగేహళ్లిలోని సాయిగ్రీన్ అపార్ట్‌మెంటులో వేరుగా ఉంటున్నారు. పైగా వాటికి ఆర్థిక వ్యవహారాలు తోడయ్యాయి. శ్వేతతో కెన్నెత్ క్లౌడ్ కిచెన్ వ్యాపారం పెట్టించాడు. దానికి పెట్టుబడుల కోసం సుమారు రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి అప్పుతీసుకున్నారు. అయితే వాటికి ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి వారి నివాసానికి కాకుండా శ్వేత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడంతో వారు ఆగ్రహానికి గురై శ్వేత, కెన్నెత్‌లను నిలదీశారు. ఫలితంగా గొడవలు ముదిరాయి. ఈ నేపథ్యంలో తమ స్వేచ్ఛకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని భావించిన శ్వేత, కెన్నెత్ వారిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం జూన్ 22న రాత్రి వారిని తాము నివసిస్తున్న అపార్ట్‌మెంటులోనే హత్య చేసి పారిపోయారు. వారి దాడిలో ముత్తులక్ష్మి, సుప్రియ స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన తండ్రి సోమసుందర్ ఆర్తనాదాలు చేస్తూ కిందవరకు వెళ్లి.. చుట్టుపక్కలవారి సాయంతో ఆస్పతిలో చేరిన తర్వాత మరణించాడు. పరారీలో ఉన్న శ్వేతను జూన్ 24న, కెన్నెత్‌ను ఆ మరుసటి రోజు పోలీసులు పుదుచ్చేరిలో అదుపులోకి తీసుకున్నారు. వారిని తీసుకొచ్చి విచారించినప్పుడు ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆరునెలలుగా చాట్‌బాట్‌తో మంతనాలు

గతంలో ఒక బ్రేకప్, సాంఘిక బహిష్కరణ వంటి అనుభవాలతో క్రిమినల్ మెంటాలిటీని అలవర్చుకున్న కెన్నెత్ తాజా వ్యవహారంలో క్రూరంగా ఆలోచించాడు. తమ సహజీవనాన్ని వ్యతిరేకించడమే కాకుండా బ్యాంకు అప్పుల విషయంలో తమను నిలదీసి అడుగడుగునా అడ్డుతగులుతున్న శ్వేత కుటుంబాన్ని అంతం చేయడమే మార్గమనుకున్నాడు. తన సహజీవన సహచరిని కూడా ఆ మాయలో ముంచి తల్లిదండ్రులు, చెల్లెలిని అంతం చేసేందుకు సహకరించేలా చేశాడు. తన పన్నాగాలకు గూగుల్ జెమినీ ఏఐ చాట్‌బాట్ సలహాలతో పదును పెట్టాడు. హత్యలకు ముందు ఆరునెలల నుంచి ఇదే అంశంపై చాట్‌బాట్‌తో చాటింగు చేస్తూ సలహాలు తీసుకున్నట్లు విచారణలో తేలడంతో పోలీసులే నిర్ఘాంతపోయారు. చాట్‌బాట్‌తో చాటింగ్ చేసిన తీరు కూడా కెన్నెత్ చావు తెలివితేటలకు నిదర్శనంగా చెబుతున్నారు. నేను హత్య చేయడం ఎలా? లేదా శవాన్ని ఎలా మాయం చేయాలి? అని అడగలేదు. ‘ఒకవేళ హత్య చేయడం వంటి పరిస్థితుల్లో చిక్కుకుంటేû నేనేం చేయాలి?, ‘ఇంట్లో దొంగలు చొరబడితే వారిపై ఎలా దాడి చేయాలి?, కళ్లలో కారం చల్లి, పొడవడానికి ఆయుధాలు ఎలా వాడాలి? అంటూ ఊహాజనితమన్న భ్రమ కల్పించేలా ప్రశ్నలు వేస్తూ క్రమంగా తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకున్నాడు. హత్యానంతరం తమ క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం తయారు చేయించిన ఐరన్ ఫర్నెస్ (ఇనుప కొలిమి)లోనే మృతదేహాలను తగలేసి మాయం చేయాలని మొదట పథకం వేశాడు. కానీ ఏఐ చాట్‌బాట్‌తో చర్చించి, దాని పర్యవసానాలను అంచనా వేసుకున్న తర్వాత అది సాధ్యం కాదని గ్రహించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత ఏఐ సాయంతోనే హత్య చేసే పద్ధతులు, తర్వాత రక్తపు మరకలను శుభ్రం చేయడం, ఇతర ఆధారాలు మాయం చేయడం, మృతదేహాల తరలింపు వంటి అంశాలపై తన కుట్రలకు మరింత పదును పెట్టాడు.

ముగ్గురినీ ఒకేసారి చంపడమే అనూహ్యం

అయితే అందరినీ ఒకేసారి అంతం చేయాలనుకోలేదు. మొదట జూన్ 22న పక్కా స్కెచ్‌తో శ్వేత తల్లి ముత్తులక్ష్మిని తమ అపార్ట్‌మెంట్‌కు పిలిపించి దారుణంగా పొడిచి చంపాడు. కానీ కొద్దిసేపటికే ఊహించని విధంగా సోమసుందర్, సుప్రియలు కూడా రావడంతో వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మరణించిన సోమసుందర్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. సాధారణ కేసుల్లా కాకుండా ఈ కేసును డిజిటల్ దర్యాప్తు చేయాల్సిరావడం పోలీసులకు సవాలుగా మారింది. క్రైమ్ ప్లానింగ్‌లో ఏఐ పాత్రను ఆధారాలతో నిరూపించడానికి కెన్నెత్ ఉపయోగించిన జెమిని చాట్ హిస్టరీ ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే గూగుల్‌కు లేఖ రాశారు. నేర పథకరచనలో చాట్‌బాట్‌ను ఏ స్థాయిలో ఉపయోగించాడో నిరూపించడానికి విచారణాధికారులు ఒక దశలో ఏఐ చాట్‌బాట్‌ను కూడా సహ నిందితురాలిగా చేర్చాýని ఆలోచించారంటే ఈ కేసు లో దాని పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే చాట్‌బాట్‌కు చట్టపరమైన బాధ్యత ఏమీ లేదని పోలీసులే చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page