ఠాట్..‘ఓదార్పు’ ఓనర్‌కే హక్కు లేదంటారా?
- DV RAMANA
- May 15
- 2 min read

ఇటీవలి ఇండో`పాక్ యుద్ధంలో మరణించిన సైనికుడు మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించడంపై తెలుగుదేశం నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. బాధితులను పరామర్శించే హక్కే జగన్‌కు లేదని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఎంత అన్యాయమండి! అసలు పరామర్శ లేదా ఓదార్పు అనే పదానికి ఓనర్ షిప్, పేటెంట్ హక్కులు జగన్మోహన్ రెడ్డివే. ఓదార్పును రాజకీయ బ్రాండిరగ్ తెచ్చిందే ఆయన. ఓదార్పు అనేది రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన భాగం అవుతుందని అంతకుముందు ఎవరికీ తెలియదు. ఏ రాజకీయ నేతా ఆ ప్రయత్నం చేయలేదు. ఎవరైనా ప్రముఖులు చనిపోతేనో.. లేదా ప్రమాదాల్లో ఎక్కువమంది మరణించిన సందర్భాల్లోనూ పదవుల్లో నేతలు ఆ కుటుంబాలను కలిసి పరామర్శించడంతో సరిపెట్టేసేవారు. అక్కడితో ఆ అంకం ముగిసిపోయేది. దీన్నుంచి రాజకీయ లబ్ధి పొందిన ఉదంతాలు మాత్రం లేవనే చెప్పారు. ఒకవేళ ఓదార్పు ప్రభావం గురించి తమకు తెలుసునంటూ ఎవరైనా ముందుకు వస్తే.. సరే తెలుసనే అనుకుందాం. కానీ ఓదార్పునకు పర్యాయపదంగా మారిన పేరు మాత్రం ముమ్మాటికీ జగన్‌దే. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అకాల మరణానికి గురైనప్పుడు, ఆ బాధతో ఉమ్మడి ఏపీలో వందలాదిమంది గుండెలు పగిలి చనిపోయారని వార్తలొచ్చాయి. మృతుల కుటుంబాలను సభ్యుల్ని తాను స్వయంగా కలిసి ఇంటిల్లిపాదినీ ఓదారుస్తానని ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ సమాధి సాక్షిగా జగన్ మాటిచ్చారు. ఆ పరామర్శలకే ఓదార్పు యాత్ర అని పేరు పెట్టి ఒక ప్రత్యేక రాజకీయ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయారు? వైఎస్ మరణంతోనే గుండె ఆగి చనిపోయారా? వాళ్ల వివరాలు ఎవరు సేకరించారు? ఓదార్పు యాత్ర ఎన్ని రోజులు సాగుతుంది, అసలు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? వంటి సవాలక్ష అనుమానాలు జనసామాన్యంలో, రాజకీయ జనంలో రేగాయి. వాటితో తనకు నిమిత్తం లేనట్లు జగన్ తన యాత్ర గురించి ఢల్లీి నాయకత్వానికి చెబితే సోనియా వద్దని రెడ్‌సిగ్నల్ వేసింది. అయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం అధినేత్రినే ఎదిరించి మరీ జగన్ ఓదార్పు యాత్ర కానిచ్చేశారు. ఆ రకంగా ఓదార్పు తాలూకు పేటెంట్ హక్కులను సొంతం చేసుకున్నారు. బాధితెల చెంపలు నిమరడం, నెత్తిన చెయ్యి పెట్టి, నుదుటిని చుంబించడం వంటి చర్యలతో అందులో రాటుదేలిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయ చతురుడని అన్నప్పటికీ, ఓదార్పు తరహా వ్యవహారాల్లో ఆయన కదలికలు, ముఖ కవళికలు చూపరులను పెద్దగా ఆకట్టుకోలేవు. తన ముఖంలో నవ్వు, ఏడుపులను ఆయన పెద్దగా పలికించలేరు. శాసనసభలో తన కుటుంబీకులను ఘోరంగా అవమానించారంటూ బయటకు వచ్చి ఎంత వెక్కివెక్కి ఏడ్వటానికి ప్రయత్నించినా ఆయన కంటి నుంచి నీరు రాలేదు. అలాంటి చర్యలన్నీ భౌతికంగా ఆయా వ్యక్తుల శరీరతత్వాల ఆధారంగా జరుగుతుంటాయి. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. జగన్ విషయంలోనూ అదే జరుగుతుంది. గత వారం చనిపోయిన భారత జవాన్ మురళీ నాయక్ ఇంటికి జగన్ వెళ్లి ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. వారితో జరిపే సంభాషణలను బట్టి ముఖంలోని భావాలు సహజంగానే ఏర్పడుతుంటాయి. ఇప్పుడు వచ్చిన ఆధునిక కెమెరా గొట్టాలు అనేక కోణాల్లో ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అటువంటి ఒక ఫోటోలో జగన్ నవ్వుతూ కనిపించడం టీడీపీ ట్రోలింగ్‌కు కారణమైంది. తమ మనిషి పోయిన బాధలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లి అక్కడ నవ్వడం ఏమిటన్నది టీడీపీవారి అభ్యంతరం. జగన్ అసలు పరామర్శకే వెళ్లే అర్హత లేదని కూడా దునుమాడేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఓదార్పు అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్‌కే ఆ అర్హత లేదంటారా? ఆ మాటకొస్తే సమయానికి తగినట్లుగా హావభావాలు ప్రదర్శించగలరని పేరున మోదీ కూడా అంబానీలు, బాలీవుడ్ తారలు, క్రీడాకారులు, మరీ సమయం ఉంటే మన మంచు ఫ్యామిలీ లాంటి వాళ్లను కలవడం తప్ప మిగతా బీదాబిక్కీల విషయంలో సాధ్యమైనంత దూరంగా ఉంటారు. హోల్‌సేల్ ఓదార్పులు చేయడం జగన్‌కు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. అలాంటి జగన్ ఓదార్పునే ఆక్షేపించడం ఎంత అన్యాయం.. ఇంకెంత దారుణం!
Comentarios