
విద్యార్థులపై పైశాచికంగా దాడిచేసిన బీవీ రమణ
ఇండియన్ ఆర్మీ కాలింగ్ హాస్టల్‌లో హింస
రెండు రోజులుగా హల్‌చల్ చేస్తున్న వీడియోలు
అనుతులు లేకపోయినా కొనసాగుతున్న సంస్థ
వ్యవస్థాపకుడి మానసిక స్థితిపై సర్వత్రా అనుమానాలు
చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌కు ట్వీట్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అన్నయ్యా.. మీరు చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన ఇష్యూ ఇది. శ్రీకాకుళం జిల్లా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థకు ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన రమణ అనే వ్యక్తి వేలాది మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని విద్యార్థుల దగ్గర రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు టాగ్ చేస్తూ ‘ఎక్స్’ పోస్ట్ చేసిన మెసేజ్. ఇందుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ కాలింగ్ హాస్టల్‌లో ఒక విద్యార్థిని యూఎస్‌బీ కేబుల్ మడతపెట్టి చితకబాదుతున్న వీడియోను అటాచ్ చేశారు. ఇప్పుడు నగరంలో ఉన్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీ రమణకు సంబంధించే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కరోనా తర్వాత ఆర్మీలో ఉద్యోగాల కోసం జిల్లా విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుందని, అలా కాకుండా శ్రీకాకుళంలోనే అందుకు సంబంధించిన విద్య, శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని ప్రకటిస్తూ శ్రీముఖలింగానికి చెందిన బీవీ రమణ శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఒక సంస్థను స్థాపించారు. నిజంగా జిల్లా విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందనే భావనతో ఈ సంస్థ ప్రారంభించిన కొద్ది రోజులకే ‘సత్యం’ దీని మీద ఓ పాజిటివ్ కథనాన్ని అందించింది. తాజాగా రెండు రోజుల నుంచి ఈ సంస్థ వ్యవస్థాపకుడు సైకో తీరును పట్టి చూపుతున్న వీడియోలను చూసిన తర్వాత ఇటువంటి కథనం ప్రచురించినందుకు ‘సత్యం’ చింతిస్తోంది. జిల్లా నుంచి దేశసేవకు వెళ్లాలన్న విద్యార్థుల ఆశలు ఏమేరకు నెరవేరాయో తెలీదు గానీ, బీవీ రమణ తన సైకో ప్రవృత్తిని ప్రదర్శించడానికి బలిపశువుల్లా మాత్రం మన జిల్లా విద్యార్థులు ఉపయోగపడుతున్నారు. తాజాగా ట్రోల్ అవుతున్న వీడియోలు చూస్తే ఎవరైనా ఇదే మాట చెబుతారు. రక్షణ రంగంలో సేవలందించాలంటే శారీరక దృఢత్వం మాత్రమే ఉంటే చాలదు. మానసికంగా కూడా మరింత దృఢంగా సైనికుడు ఉండాలి. అటువంటి సైనికుడ్ని తయారుచేయాలంటే ఆ ఉపాధ్యాయుడికో, లేదూ అంటే ఆ సంస్థ వ్యవస్థాపకుడికో మరెంత దృఢమైన మానసిక స్థితి ఉండాలి? సరిగ్గా ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బీవీ రమణకు ఇదే లోపించిందని ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఒక విద్యార్థిని గొడ్డుకంటే దారుణంగా కొడుతున్న ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఇటీవల ఇంత స్థాయిలో ట్రోలైన వీడియో మరొకటి కనిపించలేదు. కారణాలేమైనా కావచ్చు. కానీ, పశువులను దండిరచడానికి కూడా అంతలా ఎవరూ పూనుకోరని మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ ఒకే ఒక్క కారణంతో ఆయన తోసిపుచ్చుకుంటూవచ్చారు. రాష్ట్రంలో ఆర్మీలో ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వడానికి అనేక సంస్థలు ఉన్నాయని, ఈ పేరుతో వారంతా కోట్లు సంపాదిస్తున్నారని, ఇక్కడ తాను సొమ్ములు తీసుకోకుండా కేవలం తన జిల్లా విద్యార్థులకు తీర్చిదిద్దడానికి వచ్చానని, కార్పొరేట్ కుట్రలో భాగంగా తనను బలి చేస్తున్నారని బీవీ రమణ నమ్మబలుకుతూ నెట్టుకొస్తున్నాడు. కానీ వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే ఇటువంటి మానసిక స్థితి ఉన్న గురువు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశరక్షణకు అవసరమైన సైనికులను తయారుచేయలేడని అర్థమవుతుంది.
బీవీ రమణ తన హాస్టల్‌లో ఒక విద్యార్థిని చావచితక్కొట్టాడు. ఇచ్ఛాపురానికి చెందిన సాడి నవీన్ అనే యువకుడిని యూఎస్‌బీ కేబుల్‌తో ఒళ్లు చీరేశాడు. వాస్తవానికి ఈ వీడియో నిన్న మొన్నటిది కాదు.. 2023 డిసెంబరు 28 తర్వాత జరిగిన ఘటనకు సంబంధించినవి. ఇప్పుడు అవి ఎందుకు బయటకు వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆ వీడియోలో సాడి నవీన్‌ను గొడ్డును బాదినట్టు బాదడమే కాకుండా నవీన్ కుటుంబంలో మహిళలను కూడా చెప్పలేని బూతులు తిట్టడాన్ని వీడియోలో అందరూ గమనించారు. నిజంగా సాడి నవీన్‌తో పాటు మరో నలుగుర్ని కూడా ఇదే కేబుల్‌తో చితకబాదినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. వీరందర్నీ ఒంగోబెట్టిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. 2023 డిసెంబరు 28న నగరంలో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవానికి వీఐపీలు రావడంతో సెక్యూరిటీ కోసం ఇండియన్ ఆర్మీకాలింగ్‌లో ఉన్న విద్యార్థులను బీవీ రమణ అక్కడకు పంపారు. ఆ తర్వాత షాపింగ్‌మాల్‌లో కొన్ని వస్త్రాలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ విద్యార్థులు కొందరు దొంగిలించారని వస్త్రదుకాణం మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేయడంతోనే వీరిని కొట్టారన్న వాదన ఒకటి ప్రచారమవుతోంది. వీడియోలు ట్రోల్ అయిన తర్వాత ‘సత్యం’ సంబంధిత హాస్టల్‌కు వెళ్లి విచారించగా, దెబ్బలు తిన్న విద్యార్థులు తప్పు తమదేనని, ఔటింగ్‌కు చెప్పకుండా వెళ్లిపోవడంతో బీవీ రమణ తమను కొట్టారని, తండ్రయితే కొట్టరా అని చెప్పుకొచ్చారు. మరి మీ ఇంటిలో మహిళలను ఎందుకు బూతులు తిట్టారంటే.. తండ్రయితే తిట్టరా అని కూడా సమర్ధించుకున్నారు. బయట జరుగుతున్న ప్రచారం నిజమైనదా? విద్యార్థులు చెబుతున్న కథే వాస్తవమా? అన్నది పక్కన పెడితే.. బీవీ రమణ కొట్టిన తీరు, భాష సభ్యసమాజంలో కచ్చితంగా అభ్యంతరకరం.

ఇండియన్ ఆర్మీకాలింగ్ క్యాంపస్‌లో ప్రతీది గోప్యమే. ఎందుకంటే.. ఇక్కడ ప్రతీ పోస్టులోనూ బీవీ రమణ మనుషులే ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డ్రైవర్, వార్డెన్లు.. ఇలా అందరూ బీవీ రమణ మనుషులే. చివరకు 2018లో ఇండియన్ ఆర్మీ కాలింగ్ బోర్డు పెట్టిన తర్వాత గానీ, 2023లో ఇందుకు అనుమతులు వచ్చిన తర్వాత గానీ ఉద్యోగాలు రాని విద్యార్థుల్లో కొందరు ఇక్కడ ఉద్యోగులుగా మారిపోయారు. వారికి జీతాలు, బత్తాలు ఉన్నాయో లేవో కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కొందరు ఇక్కడ వాతావరణం చూసి చెప్పాపెట్టకుండా పారిపోతున్నారు. మొన్నటికి మొన్న అమ్మాయిలుండే హాస్టల్‌లో ఉండకూడని చోట సీసీ కెమెరాలు ఉన్నాయని ఆరోపణలు వస్తే విచారణకు వెళ్లిన పోలీసులకు తామే కెమెరాలు పెట్టమన్నామంటూ అమ్మాయిలు చెప్పుకురావడం కొసమెరుపు.
వాస్తవానికి ఇండియన్ ఆర్మీకాలింగ్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఎన్జీవో సంస్థగా ఆవిర్భవించింది. కానీ ఇందులో రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట ఇంటర్మీడియట్ కళాశాలకు ఎటువంటి రికగ్నైజేషనూ లేదు. నగరంలో ఎన్‌ఆర్‌ఐ కాలేజ్‌తో టైఅప్ పెట్టుకొని ఇంటర్మీడియట్ పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం విద్యాశాఖాధికారులందరికీ తెలుసు. నగరంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్‌కు పెద్ద ఎత్తున పబ్లిసిటీ రావడంతో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. రూ.10 లక్షలు పెట్టి బీవీ రమణ నిర్వాకాలు తెలిసి వెనక్కు తగ్గిన ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు కూడా బీవీ రమణ మొత్తం సొమ్ములు వెనక్కు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఎరవేసి అక్కడ్నుంచి విద్యార్థులను పెద్ద ఎత్తున తెచ్చుకుంటున్నారు. ఆర్మీలో పనిచేసిన రమణ మెంటల్ కండిషన్ సరిగా లేదనే కారణంతోనే విధుల నుంచి తొలగించి పంపేశారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం ట్రోల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే ఆయన మెంటల్ కండిషన్ ఇట్టే తెలిసిపోతుంది. జిల్లాలో పాఠశాలల నుంచి ఇండియన్ ఆర్మీ కాలింగ్ క్లాసులకు వెళ్లొచ్చని గతంలో ఓ సర్క్యులర్ ఉండేది. డీఈవో తిరుమల చైతన్య బీవీ రమణ నిర్వాకాలు చూసి ఈ సర్క్యులర్‌ను ఇటీవలే రద్దు చేశారు. కొద్ది కాలం క్రితం ఇండియన్ ఆర్మీ కాలింగ్ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలంటూ 50 సెంట్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా, దాన్ని కలెక్టరేట్‌లో ఇప్పుడు పక్కన పడేశారు. తమ పిల్లలు దేశసేవకు వెళ్తారని డబ్బులు కడితే, ఇక్కడ వారు దొంగలుగానో, లేదూ అంటే దెబ్బలు తిన్నవారిగానో మిగిలిపోతున్న విషయం పేరెంట్స్‌కు తెలియడంలేదు.
Kommentare