top of page

డబ్బులిస్తే కుచ్‌బీ ‘హోతా’

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • వద్దన్నచోటే తవ్వుతున్న ఏజెన్సీ

  • మైనింగ్‌, ఆరోగ్యశాఖ రిపోర్టులు బుట్టదాఖలు

  • అనుమతులు ఓచోట, తవ్వకాలు కిల్లిపాలెంలో

  • హైదరాబాద్‌ కంపెనీ పేరుతో స్థానిక నేతలు వ్యాపారం

  • హ్యూమన్‌రైట్స్‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పర్యావరణం ఏమైపోయినా ఫర్వాలేదు.. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు బావురుమంటున్నా పట్టించుకోనక్కర్లేదు.. పంటకు సాగునీరందకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు.. మాక్కావాల్సింది ఇసుక. అది అక్రమమో, సక్రమమో అనవసరం. సొమ్ములొస్తున్నాయా, లేదా?! ఇదే కిల్లిపాలెం ర్యాంపులో నడుస్తున్న దందా. గడిచిన కొన్నేళ్లుగా ఇక్కడ అనధికారికంగా ఇసుకను తవ్వుకుపోయి తమ జీవితాల్లో చీకట్లు నింపుతున్నారని ఇదే కిల్లిపాలెంకు చెందిన కొందరు పోరాడుతుంటే, ఆ గ్రామంలోనే అదే పార్టీకి చెందిన నేతలు యథేచ్చగా తవ్వుకుపోతున్నారు.

రద్దు చేస్తామని.. అనుమతిచ్చారు

పాము చావకుండా, కర్ర విరగకుండా పని చేయడమెలాగో మన అధికారులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. డబ్బులిస్తే దొరక్కుండా ఎలా పని చేసిపెట్టాలో తెలిసిన సిద్ధహస్తులు. కిల్లిపాలెం అని కాకుండా, ఆ పంచాయతీలోనే కలెక్టర్‌ ఆఫీసు వెనుక ప్రాంతంలో తవ్వకాల కోసం హైదరాబాద్‌కు చెందిన హోతా వెంకటేశ్‌ ప్రాపర్టీస్‌ పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. పేరు వీరిదే కాని, ఇక్కడ స్థానిక టీడీపీ నేతలు ఇసుకను తవ్వుకుంటున్నారు.

తమ ప్రాంతంలో బోరు నుంచి నీరు శాంపిల్‌ తీస్తే పీహెచ్‌ లెవెల్స్‌, ఆక్సిజన్‌ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని రిపోర్టు రావడంతో గత నెల 21న కలెక్టరును గ్రీవెన్స్‌లో కలిసి సమస్యను విన్నవించారు. దీనిపె స్పందించిన మైనింగ్‌ డీడీ 23వ తేదీన విచారణ చేశారు. గ్రామంలోని ఇసుక ర్యాంప్‌ని సందర్శించి ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలో ఎటువంటి ఇసుక మిగలలేదని గుర్తించారు. ఇసుక తవ్వకాలు వల్ల గత కొన్నేళ్లుగా నాగావళి నీటి ప్రవాహం కిల్లిపాలెం వైపుగా కాకుండా నదికి అవతల పొన్నాడ వైపు నుంచి ప్రవహిస్తుంది. దీనివల్ల ఇసుక లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. ప్రభుత్వం అనుమతులు ముంజూరుచేసిన ఇసుక ర్యాంప్‌ను నిలిపేయాలని గ్రామస్తులు విన్నవించారు. ఇసుక రీచ్‌ను రద్దు చేస్తామని చెప్పిన వారం రోజులకు వేరేచోట అనుమతులు ఇచ్చి కిల్లిపాలెంలో తవ్వుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. దీంతో బాధితులు ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

యంత్రాలతో ఇసుక తవ్వకాలు

వైకాపా హయాంలో ఇసుకను తవ్విన కాంట్రాక్టర్‌ నదిలో ఇసుకతో పాటు మట్టిని తరలించుకుపోయారు. నదీగర్భంలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇసుకను, మట్టిని తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక నిల్వలు లేవని మైనింగ్‌ అధికారులు రిపోర్టు ఇచ్చినా తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. హైదరాబాద్‌ ఏజెన్సీ పేరిట అగ్రిమెంట్‌ ఉన్నా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇద్దరు నదిలో జేసీబీలు, ప్రొక్లెయినర్స్‌ను దించి ఇసుకను లారీలకు లోడ్‌ చేసి తరలించుకుపోతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. వీరు ప్రభుత్వానికి రూ.5లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించి ఇసుక తవ్వకాలకు అనుమతి తెచ్చుకున్నట్టు రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒక ప్రొసీడిరగ్స్‌ తీసుకొచ్చి యంత్రాలతో లారీల్లోకి ఎత్తి తరలిస్తున్నారు. ర్యాంపు భౌగోళిక అక్షాంశ, రేఖాంశాలను కలెక్టరేట్‌ వద్ద చూపించి ఇసుక తవ్వకాలను మాత్రం కిల్లిపాలెం వద్ద చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత నెల 30న జారీ చేసినట్లు చూపిస్తున్న ప్రొసీడిరగ్స్‌లో ఈ నెల 7 నుంచి 14 రోజులు పాటు ఈ నెల 20 వరకు ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చినట్టు ఉంది.

ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను సొంత పార్టీ నాయకులే బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాల వల్ల తాగునీరు కలుషితమై సమీప గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడ్డారని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిల్లిపాలెం గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయని, లభ్యమవుతున్న గ్రౌండ్‌ వాటర్‌లో గాఢత, కాఠిణ్యత పెరిగి ఆక్సిజన్‌, పిహెచ్‌ లెవల్స్‌ పూర్తిగా తగ్గిపోయాయని సంబంధిత శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇసుక ర్యాంపునకు అనుమతివ్వడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్‌ సందర్శంచి గ్రామంలో పరిస్థితిని, తాగునీటి సమస్యను పరిశీలించారు. ఉన్నతాధికారులు, మైనింగ్‌ అధికారులు నిర్లక్ష్యంపై గ్రామానికి చెందిన పలువురు స్వచ్ఛంద సేవకులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. జనసేన అధినేత, డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కలిసి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించడానికి కొందరు యువకులు సన్నద్ధమవుతున్నారు. కలెక్టర్‌, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి గ్రామస్తులు నోటీసులు పంపించారు.

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page