top of page

డీఈవో చిత్తమే.. ‘ఉత్తమ’ అర్హత!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 22, 2024
  • 2 min read
  • తక్కువ కాంపోనెంట్‌ పాయింట్లు వచ్చినా జాబితాలో చోటు

  • తిరుమల చైతన్య పైత్యానికి రాజకీయ సిఫార్సుల ముసుగు

  • ఫిర్యాదు అందడంతో రీ వెరిఫికేషన్‌కు కలెక్టర్‌ ఆదేశాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయం అవార్డులకు జిల్లా నుంచి సిఫార్సు చేసిన లిస్టుపై విద్యాశాఖలో రచ్చ ప్రారంభమైంది. ఈ అవార్డులకు అర్హులను ఎంపిక చేసిన తీరుపై ఉపాధ్యాయులతోపాటు వారి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామన్న మంత్రి లోకేష్‌ ప్రకటనకు విరుద్ధంగా జిల్లాలో అధికారులు వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో నియమించిన ఎంపిక కమిటీని డీఈవో తిరుమల చైతన్య ప్రభావితం చేసి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సూచించిన పేర్లనే కలెక్టర్‌కు పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు పి.షన్ముఖరావు, ఎస్జీటీ కేటగిరీలో జి.సిగడాం మండలానికి చెందిన టేకి రామకృష్ణ పేర్లను సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనపై ఈ నెల 17న కలెక్టర్‌తో సంతకం చేయించి రాష్ట్రస్థాయిలో లోకేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీకి జిల్లా విద్యాశాఖకు చెందిన ఒక ఉద్యోగి ద్వారా పంపించారు.

  • సర్వీస్‌ లేదు.. కాంపొనెంట్‌ పాయింట్లు తక్కువ

ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ప్రతిపాదనలు పంపే విషయంలో జిల్లా కమిటీ పారదర్శకంగా పని చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్జీటీగా ఉంటూ స్కూల్‌ అసిస్టెంట్‌ అయిన పి.షన్ముఖరావును రెండేళ్ల సర్వీసు పూర్తికాకుండా ఎంపిక చేసినట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. ఎక్కువ కాంపొనెంట్‌ పాయింట్లు సంపాదించిన ఉపాధ్యాయులను కాదని సక్రమంగా స్కూలుకు హాజరు కానీ షన్ముఖరావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. షన్ముఖరావుకు కేవలం 67 కాంపొనెంట్‌ పాయింట్లు మాత్రమే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డీఈవో తిరుమలచైతన్యకు దగ్గరలోనే పని చేస్తున్న ఒక స్కూల్‌ అసిస్టెంట్‌కు 85 కాంపొనెంట్‌ పాయింట్లు ఉన్నా, అతన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో డీఈవో తిరుమల చైతన్య వివక్షతో వ్యవహరించి ఆయన్ను తప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జిల్లాస్థాయి ఉత్తమ టీచర్‌ అవార్డు పొందిన స్వర్ణకుమారి దీనిపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు ఫి˜ిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ ఫైల్‌ మరోసారి సర్క్యులేట్‌ చేయాలని డీఈవో తిరుమల చైతన్యకు ఆదేశించినట్టు సమాచారం.

డీఈవో ఇష్టానికి రాజకీయ కవర్‌

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ప్రతి జిల్లా నుంచి పలు కేటగిరీల్లో అర్హులైన వారితో జాబితాలు రూపొందించి పంపిస్తారు. రాజధాని స్థాయిలో వాటిని పరిశీలించి కొందరిని ఫైనల్‌గా ఎంపిక చేసి అవార్డులిస్తారు. జిల్లాస్థాయి ఎంపిక కమిటీలో కలెక్టర్‌ నామినేట్‌ చేసిన ఒకరితోపాటు జాయింట్‌ కలెక్టర్‌, ఒక విద్యావేత్త సభ్యులుగా ఉంటారు. సాధారణంగా ఈ వ్యవహారంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు తలదూర్చరు. డీఈవో కార్యాలయం నుంచి వచ్చిన జాబితానే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డీఈవో కార్యాలయ స్థాయిలోనే ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీల్లో ఎంపిక అస్తవ్యస్తంగా జరిగిందన్నది ఫిర్యాదు. దాంతో కలెక్టర్‌ రీవెరిఫికేషన్‌కు పంపించారు. అవార్డులకు పరిగణనలోకి తీసుకునే ఉపాధ్యాయుల పనితీరును 23 అంశాల్లో బేరీజు వేసి కాంపొనెంట్‌ పాయింట్లు ఇస్తారు. వీటిని డిప్యూటీ డీఈవో, మండల స్థాయిలో ఎంఈవోలు పరిశీలించి డీఈవో కార్యాలయానికి పంపించాలి. కానీ ఈ పద్ధతి పాటించడం మానేసి చాలా కాలమైంది. దానికి బదులు డీఈవోను ప్రసన్నం చేసుకుంటే రాష్ట్ర జాబితాలో పేరు చేరిపోతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సు లేఖ తెచ్చుకున్నారని, అందుకే పేరు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి వారికి ఈ సలహా ఇచ్చింది డీఈవో కార్యాలయమే. ఉపాధ్యాయుల వ్యవహారంలో తలదూర్చి చెడ్డపేరు తెచ్చుకోలేమన్న భావనతోనే చాలామంది ఇటువంటి సిఫార్సులకు దూరంగా ఉంటారు. రాష్ట్రంలో ఉద్యోగులందరి బదిలీలు ఒక పద్ధతిలో జరిగితే, టీచర్ల బదిలీలు మాత్రం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా జరగడానికి కారణమిదే. ఇందులో రాజకీయ ప్రమేయం ఉంటే వేగంగా డిఫేమ్‌ అయిపోతామన్న విషయం రాజకీయ నాయకులకు తెలుసు. కానీ ఇప్పుడు అదే రాజకీయ నాయకుల పేరు చెప్పి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు జాబితా సిద్ధం చేసేశారు. సీనియర్‌ ఉపాధ్యాయులను, అత్యధిక కాంపొనెంట్‌ పాయింట్లు కలిగి ఉన్నవారిని కాదని నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఉత్తమ టీచర్‌ అవార్డులకు ప్రతిపాదనలు రూపొందించారని స్వర్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నియమించిన సెలక్షన్‌ కమిటీ జిల్లాలో ఉత్తమ ఫలితాలు చూపించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాంపొనెంట్‌ పాయింట్లు సాధించిన ఉపాధ్యాయులను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సిఫార్సు చేయాలి. జిల్లా కమిటీ దీనికి భిన్నంగా దాదాపు 25 కాంపొనెంట్‌ పాయింట్స్‌ తక్కువగా ఉన్నవారిని అవార్డుకు సిఫార్సు చేసిందని ఫిర్యాదులో కలెక్టర్‌కు వివరించారు. అధికార పార్టీ నాయకులు సూచించారంటూ నచ్చినవారిని జిల్లా విద్యాశాఖ అధికారే నిర్ణయించి కమిటీ ద్వారా సిఫార్సు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఎంపికచేస్తే కమిటీ ఎందుకు ఏర్పాటుచేశారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page