top of page

డీపీఎంవో ఆదేశిస్తారు.. డీఎంహెచ్‌వో పాటిస్తారు

Writer: NVS PRASADNVS PRASAD
  • డీఐవో వాహనానికి వేరే పీవో బిల్లు

  • కోవిడ్‌ బ్యాచ్‌కు ఉద్యోగాలిస్తామని వసూళ్లు

  • ఫోకల్‌ సీట్లు కేటాయింపునకు రూ.25వేలు

  • ఎన్నికల కోడ్‌ చూపించి అదనపు కలెక్షన్లు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘‘నాకన్నా సీనియర్లు, అంతకు మించిన ముదుర్లు ఇక్కడ పని చేస్తున్నా నన్ను మాత్రమే ఏరికోరి జిల్లా మంత్రి డీపీఎంవోగా ఇక్కడ ఫారన్‌ డెప్యూటేషన్‌ సర్వీస్‌ మీద తీసుకొచ్చారంటే నా కెపాసిటీ ఏమిటో అర్థం చేసుకోండి. పత్రికల్లో వార్తలు వచ్చినంత మాత్రాన నన్నేం పీకలేరు. వైద్య ఆరోగ్యశాఖలో ఏం చేయాలన్నా నేనే చేయాలి. డీఎంహెచ్‌వోకు నేను పెట్టమన్న చోట సంతకం పెట్టడం తప్ప వేరే ఆప్షన్‌ లేదు.’’ ఇది ఎన్‌ఆర్‌హెచ్‌ డీపీఎంవోగా పని చేస్తున్న రవీంద్ర ఉవాచ.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు పరిశీలిస్తే.. ఇది వాస్తవమేనని అర్థమవుతుంది. డీఎంహెచ్‌వోగా పని చేస్తున్న అధికారి కేవలం డీపీఎంవో రవీంద్ర చెప్పిన ఫైళ్ల మీదే సంతకాలు చేస్తుండటం ఇందుకు మొదటి ఉదాహరణ అయితే, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న మిగిలిన ప్రాజెక్టు ఆఫీసర్లందరూ డమ్మీలుగా మిగిలిపోవడం రెండవ ఎగ్జాంపుల్‌.

కలెక్టరేట్‌ పేరు చెప్పి వసూళ్లు

జిల్లాలో వైద్యాధికారులుగా పని చేస్తున్న 19 మందికి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చదువుకోడానికి అవకాశం వచ్చింది. వీరిని ఇక్కడ ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేయడానికి అక్షరాలా రూ.30వేలు ఒక్కో వైద్యాధికారి నుంచి వసూలు చేశారు. ఈ విషయాన్ని గత శీర్షికలో ప్రస్తావించిన విషయం పాఠకులకు తెలుసు. అయితే ఈసారి కొత్తగా కలెక్టరేట్‌లో రూ.5వేలు ఇస్తేగాని రిలీవ్‌ చేయరని ఫిటింగ్‌ పెట్టి అదనంగా మరో రూ.5వేలు వసూలుచేశారు. పీజీకి వెళ్తున్న వైద్యాధికారులకు ముందు రిలీవ్‌ చేయడానికి రూ.10వేలు డీఎంహెచ్‌వో కార్యాలయానికి ఇవ్వాలని బేరం పెట్టారు. డీపీఎంవోకు డబ్బులిస్తే సూపరింటెండెంట్‌గా నేను గోళ్లు గిల్లుకుని కూర్చోవాలా అని ఆయనొక రూ.5వేలు ఆఫీసు ఖర్చుల కింద నొక్కేశారు. డీఎంహెచ్‌వో ఇచ్చిన ఫైల్‌ను డైరెక్టరేట్‌లో ఆమోదం పొందడానికి రూ.10వేలు ఖర్చవుతుందని డీపీఎంవోయే మరో రూ.10వేలు వసూలు చేశారు. అయితే వీరిని రిలీవ్‌ చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉందని, కలెక్టరేట్‌లో రూ.5వేలు ఇస్తే గాని రిలీవ్‌ ఆర్డర్స్‌ ఇవ్వరని మరో రూ.5వేలు అడ్డంగా నొక్కేశారు. వాస్తవానికి రిలీవ్‌ ఆర్డర్స్‌ కలెక్టర్‌ ఇవ్వక్కర్లేదు. రొటీన్‌గా కలెక్టర్‌కు ఫైల్‌ పెట్టినా దీనికి ఎమ్మెల్సీ కోడ్‌ వర్తించదు. ఈ విషయాలు తెలిసే వైద్యాధికారుల నుంచి సొమ్ములు నొక్కేశారు. వైద్యాధికారులుగా ఉంటూ పీజీ సీటు సంపాదించుకున్నవారికి ప్రభుత్వం ఉచితంగానే చదివిస్తుంది. అదే ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో చదివితే కోట్ల రూపాయలు ఫీజులు కట్టాలి. అంత సొమ్ము మిగులుతున్నందున రూ.30వేలు ఒక లెక్కా అన్న కోనంలో డీపీఎంవో సొమ్ములు కలెక్ట్‌ చేసేశారు. ఇలా ఆయన వేసిన ప్రతీ స్కెచ్‌ కాసులు కురిపిస్తుండటంతో డీఎంహెచ్‌వో కూడా డీపీఎంవో ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుందన్న ఆశతో ఆయన్ను విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

ఇమ్యూనైజేషన్‌ వేహికల్‌కు సొంత బిల్లులు

జిల్లాలో ఇమ్యూనైజేషన్‌ టీకాలు పీహెచ్‌సీలకు సరఫరా చేసేందుకు ఒక వాహనం ఉంది. ఇది ఈమధ్య రిపేరైందంటూ రూ.లక్షకు బిల్లు పెట్టి ఎంచక్కా తినేశారు. వాస్తవానికి ఈ వాహనం మరో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ పరిధిలోకి వస్తుంది. అయితే గియితే ఆయన ఈ వాహనం రిపేరు చేయించాలని, లేదా చేయించుకున్నానని బిల్లులు పెట్టాలి. అలా కాకుండా డీఎంహెచ్‌వో అండదండలతో డీపీఎంవోనే ఇందుకు సంబంధించిన బిల్లులు పెట్టేసి సర్దేశారని భోగట్టా. కోవిడ్‌`19లో అత్యవసర సేవల కోసం 72 మంది ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలను ఔట్‌సోర్సింగ్‌తో పాటు అనేక పద్ధతుల్లో నియమించారు. కోవిడ్‌ సీజన్‌ ముగిసిన తర్వాత వీరిని దశలవారీగా తొలగించారు. అయితే ఇప్పుడు ఇందులో ఎనిమిది మందికి మళ్లీ ఏదో ఒక సాకు చూపించి పోస్టింగ్‌లు ఇస్తానంటూ డీపీఎంవో వసూళ్లు మొదలుపెట్టినట్టు ఆరోపణలున్నాయి. అలాగే డీఎంహెచ్‌వో కార్యాలయంలో సొమ్ములొచ్చే గుమస్తా సీట్లు, ఖాళీగా ఉండే గుమస్తా ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో నాన్‌ ఫోకల్‌గా ఉన్న గుమస్తాలను ఫోకల్‌ సీట్లలోకి తెచ్చి నాలుగు రాళ్లు సంపాదించుకునే విధంగా చేస్తానని, అందుకోసం ఒక్కొక్కరు రూ.25వేలు ఇవ్వాలంటూ డీపీఎంవో బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు డీఎంహెచ్‌వోతో మాట్లాడి సీట్ల మార్పు కోసం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల రథసప్తమి వేడుకలకు వైద్యఆరోగ్య సిబ్బందిలో కొందరికి డ్యూటీలు వేశారు. ఇందుకోసం టెంట్లు, కుర్చీలు, భోజనాలకు ఖర్చయిందంటూ రూ.2.50 లక్షలకు బిల్లు పెట్టారు. ఎవరికి భోజనాలు పెట్టారో ఎవరికీ తెలియదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page