`గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా తతంగం
`రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా టీచర్లు బోధనేతర విధుల్లోనే
`పైరవీలతో ఏళ్ల తరబడి ఆ పోస్టుల్లోనే తిష్ట
`ప్రాథమిక స్కూళ్లపై దాని ప్రభావం.. బోధనా సిబ్బంది కొరత
`విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి ఈ అక్రమ బాగోతం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

పిల్లలను తీర్చిదిద్దేది.. భవిష్యత్తుకు పునాది వేసిది ప్రాథమిక విద్య. ఆ పునాది పటిష్టంగా ఉంటే దేశానికి ఉత్తమ పౌరులను, విద్యావంతులను అందించగలుగుతారు. దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న పేదల కుటుంబాల పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గత వైకాపా ప్రభుత్వం ప్రాథమిక విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చేశామని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చింది. అదంతా నిజం కాదని ప్రాథమిక విద్యను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, అందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో ఏది నిజమని తరచి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. గత సర్కారు నాడు`నేడు, అమ్మఒడి, గోరుముద్ద వంటి కొన్ని పథకాలతో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చి ఉండొచ్చేమో గానీ.. కీలకమైన బోధన ప్రమాణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఒకవైపు పాఠశాలల్లో టీచర్ల కొరత నానాటికీ పెరిగిపోతుంటే.. మరోవైపు ఉన్న ఉపాధ్యాయ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ల పేరుతో బోధనేతర పోస్టుల్లో నియమించింది. ఇదే అదనుగా అనేకమంది టీచర్లు అప్పటి అధికార పార్టీ నాయకులతో పైరవీలు చేయించుకుని ఏళ్ల తరబడి బోధనేతర పోస్టుల్లో తిష్ట వేశారు. ఫలితంగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన గాడి తప్పింది.
నిబంధనలకు విరుద్ధంగా..
టీచర్లను విద్యాబోధనకు తప్ప బోధనేతర విధులకు వినియోగించరాదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ పాఠశాల విద్య శాఖలో ఈ నిబంధనలకు ఎప్పుడో నీళ్లొదిలేశారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమయం వచ్చినప్పుడల్లా గళం విప్పుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే అదనుగా మండల, జిల్లా కేంద్రాలకు సుదూరంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు తమకు అనుకూలంగా మలచుకున్నారు. డిప్యూటేషన్ల తతంగానికి తెరలేపారు. తాము నివాసం ఉంటున్న మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లోని విద్యాశాఖ కార్యాలయాల్లో బోధనేతర పోస్టులకు డిప్యూట్ చేయించుకుని అక్కడే పబ్బం గడిపేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ జాఢ్యం కొనసాగుతున్నా గత వైకాపా ప్రభుత్వ హయాంలో పరాకాష్టకు చేరింది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సులతో డిప్యూటేషన్ల దందా కొనసాగించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 400 మందికిపైగా టీచర్లు ఈ విధంగా డిప్యూటేషన్లపై బోధనేతర విధుల్లో తరిస్తున్నట్లు అంచనా. ఉమ్మడి 13 జిల్లాలవారీగా చూస్తే.. ప్రతి జిల్లాలోనూ 30 నుంచి 40 మంది వరకు డిప్యూటేషన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రతి ఏటా జరిగే బదిలీల కౌన్సెలింగ్‌లో బదిలీ అయినా.. వైకాపా నేతలతో ఒత్తిడి తెచ్చి మళ్లీ బోధనేతర పోస్టులకు డిప్యూటేషన్ వేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బోధనకు ఏళ్ల తరబడి ఎగనామం
ఉపాధ్యాయులుగా నియమితులైనవారి ప్రథమ కర్తవ్యం బోధన. విదార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు దానికి పంగనామాలు పెట్టి బోధనేతర పోస్టుల్లో తిష్ట వేస్తున్నారు. డిప్యూటేషన్‌పై కార్యాలయాల్లోని బోధనేతర విధుల్లో పదేళ్లకుపైగా కొనసాగుతున్నవారు కూడా ఉన్నప్పటికీ.. అధికశాతం మంది గత ఐదేళ్లుగా ఆ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మెజారిటీ టీచర్లు ఎస్జీటీలేనని ఉపాధ్యాయ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇందులోనూ సర్వీసు తక్కువ ఉన్న యువ టీచర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసింది. రోజూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పడం.. పాఠశాల వేళలు ముగిసేవరకు అక్కడే ఉండాల్సి రావడం వీరికి కష్టంగా మారింది. పైగా యువ టీచర్లకు ఎంతోకొంత కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండటంతో దాన్ని ఉపయోగించుకుని బోధనేతర పోస్టులకు ఎగబడ్డారు. మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలతోపాటు విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్రశిక్ష, మోడల్ స్కూల్స్ వంటి విభాగాల్లోని బోధనేతర పోస్టులకు ముఖ్యంగా ఐటీ సంబంధిత పోస్టులకు డిప్యూట్ చేయించుకున్నారని తెలిసింది. విస్మయకర విషయమేమిటంటే.. రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కేంద్రంలోని వివిధ విద్యా సంబంధిత కార్యాలయాల్లోనూ పెద్దసంఖ్యలో టీచర్లు డిప్యూటేషన్లతో కొనసాగుతున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ కార్యాలయ పనులను తూతూమంత్రంగా కానిచ్చేసి.. రియల్ ఎస్టేట్, జీవిత బీమా వంటి కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
ప్రభుత్వ పాఠశాలలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆరు నెలలకోసారి చాలామంది రిటైర్ అవుతుంటారు. దాంతో టీచర్ల కొరత నానాటికీ పెరుగుతోంది. అయినా వైకాపా ప్రభుత్వం పరిపాలించిన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించలేదు. ఒక్క టీచర్ పోస్టయినా భర్తీ చేయలేదు. అది చాలదన్నట్లు ఉన్న టీచర్లను రాజకీయ ఒత్తిళ్లతో డిప్యూటేషన్లు వేసి బోధనేతర విధులకు తరలించింది. ఫలితంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువు చెప్పేవారు కరువై విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయన్న ఉపాధ్యాయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గత ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, స్వయంగా కలిసి విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 18 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక టీచరే ఉంటారు. ఆ స్ట్రెంగ్త్ దాటితే రెండో ఉపాధ్యాయుడిని నియమించాల్సి ఉంటుంది. అయితే టీచర్ల కొరత ఉన్న సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలల్లో వారు సెలవు పెట్టినప్పుడు సీఆర్‌పీలనో, ఇంకొకరినో పంపాల్సి వస్తోంది.
అప్పనంగా రాయితీలు, సౌకర్యాలు
బదిలీల్లో తమ ప్రాంతానికి దూరంగా వెళ్లినవారు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ అనుభవిస్తున్నా, మళ్లీ తమకు అనుకూలమైన ప్రాంతంలోనే ఉండే విధంగా డిప్యుటేషన్ వేయించుకున్నారు. తమ పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకున్నారు. కానీ తమకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల చదువులు చెట్టెక్కిపోయినా ఫర్వాలేదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు.. ఇద్దరూ ఒకేచోట ఉండేలా డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. బోధనేతర పోస్టుల్లో తిష్ట వేసినవారు బోధన విధుల్లో ఉన్న టీచర్లకంటే మరో రాయితీని అప్పనంగా అనుభవిస్తున్నారు. కార్యాలయ విధుల్లో ఉండేవారికి ఏడాదికి 30 ఆర్జిత సెలవులు(ఈఎల్స్) లభిస్తాయి. అంటే ఒక నెల జీతం ఆయాచితంగా లభిస్తుందన్నమాట. డిప్యూటేషన్‌పై ఎవరినైనా వేరే విధుల్లోకి పంపిస్తే రెండేళ్లు పూర్తి అయిన వెంటనే మాతృశాఖకు సరెండర్ చేయాలన్న నిబంధన ఉంది. దీన్ని కూడా అధికారుల సాయంతో మేనేజ్ చేస్తున్నారు. రెండేళ్ల డిప్యూటేషన్ పూర్తయిన వెంటనే ఒక దగ్గరికి పోస్టింగు ఇచ్చి కొద్దిరోజుల్లోనే మళ్లీ కొత్తగా డిప్యూటేషన్ వేయించుకుంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు
టీచర్లను బోధనేతర పోస్టులకు డిప్యూట్ చేసే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థతుల్లో రిటైర్ అయిన టీచర్లను గౌరవ వేతనం పై నియమించాలని సూచిస్తున్నాయి. బోధనేతర సిబ్బంది ఖాళీల్లో టీచర్లను కాకుండా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, వీలుంటే రెగ్యులర్ విధానంలో కొత్త నియామకాలు చేపడితే యువతకు ఉపాధి కల్పించినట్లు అవుతుందంటున్నారు. బోధన విధుల నుంచి తప్పించుకునేందుకు బోధనేతర పోస్టుల్లోకి డిప్యూటేషన్‌పై వెళ్తున్న జూనియర్ టీచర్లు క్లరికల్ వర్క్‌తోపాటు పర్యవేక్షణ పేరుతో ఏళ్ల తరబడి బోధన విధులకు అంకితమైన సీనియర్ ఉపాధ్యాయులపై కర్రపెత్తనం చేయడాన్ని నిరోధించాలని ఉపాధ్యాయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments