డీప్‌సీ కేబుల్ హబ్‌గా విశాఖ
- DV RAMANA

- Oct 13
- 3 min read
ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే సముద్రగర్భ కేబుల్స్
వీటిని పర్యవేక్షించే ల్యాండిరగ్ స్టేషన్ ఈ నగరంలోనే
మెటా, సిఫీ భాగస్వామ్యంలో ఏర్పాటుకు సన్నాహాలు
ఈ ప్రాజెక్టుకే మంత్రి నారా లోకేష్ శంకుస్థాపం
డిజిటల్ రంగంలో భవిష్యత్తు గమ్యస్థానం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ద్వితీయశ్రేణి నగరాల జాబితాలో ఉన్న విశాఖపట్నం డేటా గేట్‌వేగానే కాకుండా ‘వాటర్ వర్త్’ కేంద్రంగా కూడా మారనుంది. ఇప్పటికే అదానీ గ్రూప్ తన డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్‌ను నిర్వహిస్తున్న గూగుల్ సంస్థ కూడా తన డేటా సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి ఢల్లీి వేదికగా మంగళవారం ఒప్పందం జరుగుతుందని సమాచారం. మరోవైపు రూ.1500 కోట్ల పెట్టుబడితో సిఫీ సంస్థ ఏర్పాటు చేసే ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం శంకుస్థాపన చేశారు. దాంతోపాటే అదే సంస్థ ఏర్పాటు చేయనున్న ఓపెన్ కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్ (ఓసీఎల్‌ఎస్)కు కూడా శంకుస్థాపన చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద ఆసక్తికర అంశం. డేటా సెంటర్లు ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో ఉన్నాయి. ఇప్పుడు విశాఖలాంటి నగరాలకు అవి విస్తరిస్తున్నాయి. అందులో పెద్ద విశేషం లేదు. కానీ విశాఖలో శంకుస్థాపన చేసిన ఓపెన్ కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్ వివరాలు, ప్రత్యేకతలు తెలిస్తే.. అది ఎంత ముఖ్యమైన ప్రాజెక్టో తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిరంతరాయంగా అందించడానికి మహాసముద్రాల గర్భాల గుండా కేబుల్ లైన్స్ వేస్తుంటారు. వాటిని నిర్వహించడానికి పలు కీలక ప్రాంతాల్లో ల్యాండిరగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఒక స్టేషనే విశాఖలో ఏర్పాటు కానుంది. దాన్ని ఏర్పాటు చేస్తున్న సంస్థగా సిఫీ టెక్నాలజీస్ తెరపైన కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక ఉన్నది మాత్రం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెటా. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియాల ప్లాట్‌ఫారాలను ఈ సంస్థే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ తన భవిష్యత్తు అవసరాల కోసం వాటర్‌వర్త్ పేరుతో చేపట్టిన డీప్ సీ కేబుల్ ప్రాజెక్టుకు మన దేశంలో రెండు ఓపెన్ కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ఏర్పాటు, నిర్వహణలో తన భాగస్వామిగా సిఫీ టెక్నాలజీస్‌ను తన భాగస్వామిగా ఎంచుకుని కార్యకలాపాల మొదలుపెట్టింది. దేశంలో ఏర్పాటు చేసే రెండు స్టేషన్లలో ఒకటి ముంబైలో ఏర్పాటు కానుండగా.. రెండోది విశాఖలో రానుంది. దానికే ఇప్పుడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.
ప్రస్తుత కేబుల్ మార్గానికి ప్రత్యామ్నాయం
ప్రాజెక్టు ద్వారా భారత్‌లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. కాగా గూగుల్ కూడా తన 400 మిలియన్ డాలర్ల బ్లూ రామన్ సబ్‌సీ కేబుల్‌ను భారతదేశంలో ల్యాండిరగ్ చేయడానికి సిఫీతోనే ఒప్పందం చేసుకుంది. మెటా, గూగుల్ తరఫున చేపట్టిన వాటర్‌వర్త్ సబ్ సీ కేబుల్ వ్యవస్థల వల్ల డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచ డేటా కనెక్టివిటీ నెట్‌వర్క్‌లలో భారత ప్రాముఖ్యత పెరుగుతుంది. గత మూడేళ్లుగా ఈ రంగంలో మనదేశం భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. మెటా, గూగుల్‌తో పాటు భారతీయ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థలు దక్షిణాసియా దేశాల్లో పెరుగుతున్న డేటా డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కేబుల్ వ్యవస్థపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఐదు పదేళ్లలో డీప్ సీ కేబుల్ రంగంలో పెట్టుబడులు సుమారు పది బిలియన్ డాలర్లకు పెరగవచ్చని ఈ రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 50 వేలకుపైగా పొడవైన కేబుల్ ప్రాజెక్టు విస్తరణ ద్వారా అమెరికా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలను కలిపే ప్రపంచంలోనే అతి పొడవైన సబ్‌సీ కేబుల్ వ్యవస్థగా ఇది అవతరించనుందని అంటున్నారు. అంతేకాకుండా డబ్ల్యూ ఆకారంలో విలక్షణంగా ఉండే ఈ కేబుల్ మార్గం ఎర్ర సముద్రం కారిడార్‌లో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను, హౌతీ తీవ్రవాదుల దాడులను అధిగమించే వెసులుబాటు కల్పిస్తాయంటున్నారు. ఇంత ప్రాముఖ్యమైన ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
విస్తరణ బాటలో భారత సబ్‌సీ కేబుల్
మనదేశంలో సబ్‌సీ కేబుల్ వ్యవస్థ భారీ విస్తరణ దిశగా పయనిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ 2024 డిసెంబరులో సీ-మీ-వీ6 కేబుల్ వ్యవస్థను ప్రారంభించింది. 2 ఆఫ్రికా పెర్ల్స్‌లో కూడా ఈ సంస్థ పెట్టుబడులు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన సబ్ సీ కేబుల్ వ్యవస్థ ఇదే. ఇక రిలయన్స్ జియో సంస్థ ఇండియా-ఆసియా-ఎక్స్‌ప్రెస్ అలాగే ఇండియా-యూరప్-ఎక్స్‌ప్రెస్ కేబుల్ నెట్‌వర్క్‌లను కమీషనింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా కమ్యూనికేషన్స్ ఇప్పటికే టీజీఎన్`ఐఏ2 కేబుల్‌ను కలిగి ఉందిడటంతోపాటు ఆసియా డైరెక్ట్ నెట్‌వర్క్ కన్సార్టియంలో భాగస్వామిగా ఉంది. గ్లోబల్ సబ్‌మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్ మార్కెట్ 2023లో 27.57 బిలియన్ల డాలర్ల నుంచి ఏటా 7.2 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి 40.58 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అంచనా వేస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ 2030 నాటికి 78.6 మిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి టెలికాం సంస్థలతో పోలిస్తే భారతదేశంలో చౌకైన ల్యాండిరగ్ మౌలిక సదుపాయాలను అందించే సిఫీ టెక్నాలజీస్, లైట్‌స్టార్మ్ వంటి తటస్థ సంస్థలు టైర్ 2 నగరాలకు అవకాశాల తలుపులు తెరుస్తున్నాయి. వాటిలో ఇప్పుడు విశాఖపట్నం ముందంజలో ఉన్నట్లు ఈమధ్య కుదురుతున్న పెట్టుబడి ఒప్పందాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్లు, డీప్‌సీ కేబుల్ వ్యవస్థలతోపాటు పలు అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ భవిష్యత్తు గమ్యస్థానంగా ఎంచుకుంటుండటంతో భవిష్యత్తులో ఈ మహానగరం డేటా హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.










Comments