top of page

డ్యూడ్‌.. ప్రదీప్‌ రంగనాథన్‌ షో..

  • Guest Writer
  • Oct 21
  • 3 min read
ree

లవ్‌ టుడే.. రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ సంపాదించాడు తమిళ యువ కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథన్‌. అతడితో టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తమిళ- తెలుగు భాషల్లో నిర్మించిన చిత్రం.. డ్యూడ్‌. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘ప్రేమలు’ ఫేమ్‌ మామిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. మరి ఈ రోజే విడుదలైన ‘డ్యూడ్‌’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

బావామరదళ్లయిన గగన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌).. కుందన (మామిత బైజు) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. మంచి స్నేహితులుగా మారతారు. కుందనకు గగన్‌ మీద ప్రేమ పుడుతుంది. కానీ ఆమె మీద తనకు ఏ ఫీలింగ్స్‌ లేవని తనకు దూరమవుతాడు గగన్‌. కానీ తర్వాత కుందనను తాను కూడా ప్రేమిస్తున్నట్లు గుర్తించి.. తనను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ మధ్యలో కుందన.. మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. పెద్దలు తమ పెళ్లి కుదిర్చినప్పటికీ.. కుందనకు తనను ప్రేమించిన వాడితోనే పంపించేయాలని నిర్ణయించుకుంటాడు గగన్‌. కానీ అనివార్య పరిస్థితుల్లో కుందనతో గగన్‌ పెళ్లవుతుంది. మరి ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సాగారా.. కుందన ప్రేమ సంగతి ఏమైంది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిన అబ్బాయి-అమ్మాయి మధ్య వాళ్లకు తెలియకుండానే ప్రేమ పుడితే..? అందులో ఒక వ్యక్తి తన ప్రేమను దాచి పెట్టేస్తే..? ఇంకో వ్యక్తి ఆలస్యంగా తానూ ప్రేమించిన విషయాన్ని రియలైజ్‌ అయితే..? మలయాళం నుంచి అరువు తెచ్చుకున్న ఈ కథతోనే పాతికేళ్ల కిందట ‘నువ్వే కావాలి’ అనే సినిమా ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమాలో వన్‌ సైడ్‌ లవ్‌ స్టోరీతో సుకుమార్‌ ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు. ఆపై ఈ కథలనే ట్విస్ట్‌ చేసి బోలెడు ప్రేమకథలు తీశారు. ఐతే ఇప్పుడు అలాంటి కథలు రొటీన్‌ అయిపోయాయి. ‘నువ్వే కావాలి’.. ‘ఆర్య’.. ‘ఆర్య-2’ లాంటి చిత్రాలను గుర్తుకు తెచ్చే కథనే ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా అన్వయించి ‘డ్యూడ్‌’ తీశాడు కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్‌. ఇప్పటి ప్రేక్షకులు బాగా అడ్వాన్స్డ్‌ కాబట్టి.. ఏం జరిగినా చివరికి హీరో హీరోయిన్లు కలిసిపోయే కన్వెన్షనల్‌ క్లైమాక్స్‌ దిశగా అతను అడుగులు వేయలేదు. ఈ తరం ప్రేక్షకులు దేన్నయినా తట్టుకోగలరనే నమ్మకంతో కథను ఊహించని మలుపులు తిప్పాడు. అంత సులువుగా జీర్ణం కాని మలుపులతో ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఏం చేసినా ఎమోషన్‌ వర్కవుట్‌ కావడం మీదే సినిమా రుచిస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంది. ‘డ్యూడ్‌’కు ఆ విషయంలో మిక్స్డ్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. కథాకథనాలు కొంచెం ఎగుడు దిగుడుగా సాగినా.. ప్రదీప్‌ రంగనాథన్‌ అదిరిపోయే పెర్ఫామెన్స్‌ వల్ల.. కొత్త సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ మెస్మరైజింగ్‌ మ్యూజిక్‌ వల్ల.. అక్కడక్కడా కొన్ని ఎంటర్టైనింగ్‌ సీన్ల వల్ల ‘డ్యూడ్‌’ నిలబడిరది.

తాను ప్రేమించిన అమ్మాయి.. ఇంకో వ్యక్తిని ప్రేమిస్తే.. తనే దగ్గరుండి వాళ్లిద్దరినీ కలిపే కథలు దశాబ్దాల నుంచి ఉన్నాయి. ఇలాంటి కథల్లో ఏదో ఒకటి జరిగి హీరోయిన్‌ లవ్‌ స్టోరీ బ్రేక్‌ అయిపోవాలని.. తిరిగి హీరోతో హీరోయిన్‌ కలిసి పోతే బాగుంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. ‘డ్యూడ్‌’ కథ నడిచే తీరు చూస్తే.. చివరికి అలాగే సుఖాంతం అవుతుందని ఆశిస్తాం. కానీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ కథను నడిపించే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్‌. ఐతే ఈ కథకు ప్రేక్షకులు కోరుకునే ముగింపు ఇవ్వకపోయినా ఓకే కానీ.. దాన్ని మించి అసలు జీర్ణించుకోలేని ఒక పాయింట్‌ ఉంది. తెరపై అది చూసినపుడు మాత్రం అదో రకమైన ఫీలింగ్‌ కలుగుతుంది. కథలో ఒక మాదిరి ట్విస్ట్‌ ఇవ్వడం ఓకే కానీ.. మరీ ఇంత మలుపు తిప్పాలా అనిపిస్తుంది అది చూశాక. అక్కడి నుంచి ఈ కథతో ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. ఒక్కసారిగా ఎమోషనల్‌ కనెక్ట్‌ కట్‌ అయిపోవడంతో ‘డ్యూడ్‌’ భారంగా మారి.. ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది.

‘డ్యూడ్‌’ ఆరంభంలో చాలా ప్రామిసింగ్‌ గా అనిపిస్తుంది. హీరోయిన్‌ ప్రపోజ్‌ చేస్తే హీరో నో చెప్పడం.. తర్వాత అతను రియలైజ్‌ అయి ఆమెను తిరిగి ప్రేమించడం.. ఇంతలో ఆమె మరో అబ్బాయితో ప్రేమలో పడడం.. ఈ కన్ఫ్యూజన్‌ మధ్య వీళ్లిద్దరి పెళ్లికి రంగం సిద్ధం కావడం.. ఇలా ఆసక్తికర మలుపులతో ‘డ్యూడ్‌’ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్‌ చేస్తుంది. ఒక దశ వరకు ఎమోషన్‌ బాగా క్యారీ అయింది. అక్కడక్కడా కథనం కొంచెం పక్కదారి పట్టినా.. సన్నివేశాలు నెమ్మదించినా.. ప్రదీప్‌ రంగనాథన్‌ తన పెర్ఫామెన్సుతో కవర్‌ చేశాడు. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేశాడు. కానీ ఇంటర్వెల్‌ తర్వాత మాత్రం ‘డ్యూడ్‌’ పూర్తిగా పక్కదారి పట్టేసింది. నాన్‌ సీరియస్‌ గా సాగే సన్నివేశాల మధ్య హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్‌ వర్కవుట్‌ చేయడానికి చేసిన ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ చివర్లో దర్శకుడు బాగానే కవర్‌ చేయగలిగాడు. ముగింపు సన్నివేశాలు భలేగా అనిపిస్తాయి. కథాకథనాల్లో కొన్ని లోపాలున్నా.. ప్రదీప్‌ రంగనాథన్‌ పెర్ఫామెన్స్‌.. కొన్ని మెరుపుల కోసం ‘డ్యూడ్‌’పై ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు- పెర్ఫార్మెన్స్‌

ప్రదీప్‌ రంగనాథన్‌ కాకుండా ఎవ్వరు చేసినా ‘డ్యూడ్‌’ తేలిపోయేది అంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్‌ మీద తాను కనిపిస్తుండగా.. ప్రేక్షకులు పక్కచూపులు చూడలేని విధంగా తన పెర్ఫామెన్స్‌ సాగింది. అతడికో సెపరేట్‌ స్టైల్‌ ఉంది. తన హావభావాలు.. మేనరిజమ్స్‌ అంత టిపికల్‌ గా ఉండి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని పెంచుతాయి. కీలక సన్నివేశాల్లో అతను భలేగా పెర్ఫామ్‌ చేశాడు. హీరోయిన్‌ మామిత బైజు కూడా ఆకట్టుకుంది. ప్రదీప్‌ తో తనకు జోడీ బాగా కుదిరింది. ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మలయాళ నటుడు హృదు హరూన్‌ జస్ట్‌ ఓకే అనిపించాడు. శరత్‌ కుమార్‌ క్యారెక్టర్‌.. ఆయన నటన బాగున్నాయి. రోహిణికి స్కోప్‌ తక్కువే కానీ.. కనిపించిన తక్కువ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండుగా చేసిన నటుడు.. మిగతా ఆర్టిస్టులు మామూలే.

సాంకేతిక వర్గం -  పనితీరు

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ గురించి సోషల్‌ మీడియాలో హైప్‌ చూస్తే అతిగా అనిపించింది కానీ.. ‘డ్యూడ్‌’లో తన మ్యూజిక్‌ విన్నాక తన టాలెంట్‌ ఏంటో అర్థమవుతుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ తో సన్నివేశాలను ఎలివేట్‌ చేయడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. మామూలు సీన్లు కూడా కొన్ని చోట్ల తన స్కోర్‌ వల్ల బెటర్‌ గా అనిపించాయి. అతను అందించిన బిట్‌ సాంగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. మ్యూజిక్‌ పరంగా సినిమాలో మంచి ఫ్లో కనిపిస్తుంది. నికేత్‌ బొమ్మి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాతలు క్వాలిటీ చూపించారు. రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ కీర్తీశ్వరన్‌.. యూత్‌ కు కనెక్ట్‌ అయ్యే కథనే రాసుకున్నాడు. ప్రదీప్‌ రూపంలో అతడికి మంచి పెర్ఫామర్‌ దొరకడంతో బాగా వాడుకున్నాడు. కానీ కీర్తీశ్వరన్‌ స్క్రీన్‌ ప్లే మాత్రం ఎగుడుదిగుడుగా సాగుతుంది. కథలోని కొన్ని అంశాలు.. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఇరిటేట్‌ చేస్తాయి. ఓవరాల్‌ గా దర్శకుడి పనితనం యావరేజ్‌ అనిపిస్తుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page