top of page

డ్రగ్స్‌ మత్తు.. ఎయిడ్స్‌తో చిత్తు!

Writer: DV RAMANADV RAMANA
  • `త్రిపురతో సహా నాలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరణ

  • `సరిహద్దుల నుంచి యథేచ్ఛగా మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌

  • `వాటిని సిరంజీలతో తీసుకుంటూ హెచ్‌ఐవీ వ్యాప్తి

  • `ఈ పరిస్థితితో మొత్తం దేశానికీ ముప్పేనన్న ఆందోళన

త్రిపుర.. అతిచిన్న రాష్ట్రం. ఈశాన్య భారతదేశంలో ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తోంది. సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం.. అదుపులేకుండా ఈ రాష్ట్రంలో ఎయిడ్స్‌ భూతం విస్తరిస్తుండటమే. గత కొన్నేళ్లలో ఈ రాష్ట్రంలో ఎయిడ్స్‌తో 47 మంది యువజనులు మరణించారంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు, ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టిన గణాంకాలే. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఎయిడ్స్‌ రోగుల సంఖ్య తగ్గుతుంటే.. ఈ రాష్ట్రంలో మాత్రం అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. దారుణమైన విషయం ఏమిటంటే.. కళాశాలలు, యూనివర్సిటీలు ఎయిడ్స్‌ వ్యాప్తికి కేంద్రాలుగా మారిపోయాయి. చదువు కోసం వచ్చిన విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలే పెద్ద విపత్తు అనుకుంటే ఆ డ్రగ్స్‌ వినియోగమే ఎయిడ్స్‌ వ్యాప్తికి దోహదం చేస్తుండటం మరింత ఆందోళనకరం. ఎక్కడో మారుమూలన ఉన్న త్రిపురలో కదా!.. మనకేంటి? అనుకుంటే ముప్పును ఆహ్వానిస్తున్నట్లే. ఎందుకంటే.. ఆ రాష్ట్రం నుంచి చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి ద్వారా ఆయా ప్రాంతాలకు ఎయిడ్స్‌ భూతం ప్రయాణిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇప్పటికీ నియంత్రణ తప్ప నివారణ లేని మహమ్మారి ఎయిడ్‌. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాను అరికట్టేందుకు టీకాలు, మందులు కొంతవరకు కనిపెట్టగలిగినప్పటికీ దానికంటే దశాబ్దాల ముందు నుంచి కబళిస్తున్న ఎయిడ్స్‌ను శాశ్వతంగా రూపుమాపే మందులను మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. నిరంతర నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలతో ఎయిడ్స్‌ను చాలావరకు అదుపు చేయగలుగుతున్నారు. ఈ చర్యలను ఇదేస్థాయిలో కొనసాగిస్తే 2030నాటికి ఎయిడ్స్‌ను దాదాపు అంతం చేయవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది. మనదేశంలోనూ నియంత్రణ కార్యక్రమాలు ఆశాజనకంగానే సాగుతున్నా.. ఎయిడ్స్‌ మరోరూపంలో విజృంభిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న విద్యార్థులు, యువత తమకు తెలియకుండానే ఎయిడ్స్‌ను తమ శరీరంలోకి ఆహ్వానిస్తుండటంతోపాటు సమాజంలో వ్యాప్తికి కారణమవుతున్నారు. త్రిపుర, మరికొన్ని రాష్ట్రాల్లో ఎయిడ్స్‌తో మరణించినవారిలో వీరే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎయిడ్స్‌ వ్యాధిని, దాని ప్రమాదకర వ్యాప్తిని గుర్తించిన వైద్యరంగ నిపుణులు దీని విజృంభణను అడ్డుకునేందుకు అవగాహన కార్యక్రమాలు, ముందు జాగ్రత్త చర్యలే మార్గమని నిర్థారించారు. ఆ మేరకు 1988లో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని ప్రారంభించారు. విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. సురక్షిత లైంగిక చర్యలకు కండోమ్‌ల అవసరాన్ని ప్రజలకు వివరించడంతోపాటు హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీసే పరిస్థితులపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది.

మనదేశంలో ఇంకా ఆందోళనకరమే

మనం దేశం విషయానికొస్తే గత మూడు దశాబ్దాల్లో ఎయిడ్స్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. జాతీయ స్థాయిలో ఏటా 44 శాతం చొప్పున ఈ కేసులు తగ్గుతున్నాయని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో) అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో 24 లక్షల మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో సహజీవనం చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది 15 నుంచి 49 ఏళ్లలోపువారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ తగ్గుముఖం పడుతోందని, 2030నాటికి వ్యాధిని నిర్మూలించవచ్చని యూఎన్‌వో అంచనా వేస్తున్నా.. భారత్‌లో ఆ పరిస్థితి కనిపించడలేదు. దీనికి కారణం.. నాలుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గకపోగా.. అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో త్రిపుర అగ్రస్థానంలో ఉంది. 2010`2023 మధ్య ఈ రాష్ట్రంలో వ్యాధి పెరుగుదల ఏకంగా 524 శాతం కాగా.. ఆ తర్వాత స్థానాల్లో 470 శాతంతో అరుణాచల్‌ప్రదేశ్‌, 125 శాతంతో మేఘాలయ, 117 స్థానంతో పంజాబ్‌ నిలుస్తున్నాయి. ఈ నాలుగూ సరిహద్దు రాష్ట్రాలే కావడం గమనార్హం. త్రిపుర పరిస్థితి మరీ ఆందోళన కలిగిస్తోంది. ఎయిడ్స్‌ వేగంగా విస్తరిస్తున్న విషయం పదేళ్ల క్రితమే ఆ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అయినా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. 2013లో 225 మందికి పాజిటివ్‌గా తేలింది. 2012 నుంచి 2014 వరకు మూడేళ్లలో 70 మంది గర్భిణులకు హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉందని పరీక్షల్లో తేలింది. 2013లోనే 20 మంది ఈ వ్యాధితో మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014 జూలైలో 15 మంది గర్భిణులు సహా మొత్తం 143 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీఎస్‌ఏసీఎస్‌) ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి బాధితుల సంఖ్య 5674గా కాగా వీరిలో పురుషులు 4,570 మంది, మహిళలు 1103 మంది ఉన్నారు. ఇందులో 47 మంది మృత్యువాత పడగా వారంతా విద్యార్థులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు కొత్త కేసులు కొత్తగా నమోదవుతున్నాయి.

ఈ రాష్ట్రాల్లో ఎందుకీ ఉధృతి?

పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్‌ విజృంభణకు మితిమీరిన డ్రగ్స్‌ వినియోగమే కారణమని నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎయిడ్స్‌ వ్యాప్తి అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండటం వల్ల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. త్రిపురకు బంగ్లాదేశ్‌ నుంచి, అలాగే మయన్మార్‌ నుంచి మణిపూర్‌, మిజోరాం మీదుగా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అగర్తలాలో డ్రగ్స్‌ విక్రయాలు రాజకీయ అండదండలతో అదుపు చేయలేని స్థాయిలో సాగుతున్నాయని ఆరోపణలున్నాయి. మరోవైపు పంజాబ్‌కు ఇప్పటికే డ్రగ్‌ మాఫియాకు అడ్డాగా పేరుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులపై దాడులు చేస్తూ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నా అసలు సూత్రదారులను కనుక్కోలేకపోతున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడిన దాఖలాలు కూడా లేకపోవడంతో ఈ దందా ఆగడం లేదు. దొంగచాటుగా భారీగా తరలివస్తున్న మాదకద్రవ్యాలను ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు, యూనివర్సిటీలు, కార్పొరేట్‌ విద్యాసంస్థల విద్యార్థులకు మెల్లగా అలవాటు చేసి క్రమంగా బానిసలుగా మార్చేస్తున్నారు. మత్తుమందుల్లో నోటితో వేసుకోవడమే కాకుండా ఇంజక్షన్ల రూపంలోనూ తీసుకుంటుంటారు. ఇదే ఇప్పుడు ముప్పుగా పరిణమించింది. అంటువ్యాధి అయిన ఎయిడ్స్‌ó వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడటాన్ని ప్రభుత్వం నిషేధించింది. కానీ డ్రగ్స్‌ వాడేవారు మాత్రమే దీన్ని పాటించడంలేదు. ఒకే సిరంజితో అనేకమంది తమ శరీరాల్లోకి మత్తుపదార్థాలను ఇంజక్ట్‌ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే యువజనుల్లో ఎక్కువగా ఎయిడ్స్‌ వ్యాపిస్తోందని నిర్థారించారు.

విద్యార్థులతోపాటు ఎయిడ్స్‌ వలస

త్రిపురతోపాటు నాలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఎయిడ్స్‌ ఆ రాష్ట్రాలకే పరిమితం కావడంలేదు. ఆ రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. వారిలో ఉన్న ఎయిడ్స్‌, డ్రగ్స్‌ మహమ్మారులు సైతం వారితోపాటు వలస వెళ్లి కొత్త ప్రాంతాల్లో వాటిని విస్తరింపజేస్తున్నాయి. దాంతో ఈ రాష్ట్రాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఎయిడ్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు యూజీసీ నిబంధనలు కూడా పరోక్షంగా ఈ దుస్థితికి దోహదపడుతున్నాయి. కార్పొరేట్‌ కళాశాలు, ఉన్నత విద్యాసంస్థలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా గుర్తింపు పొందాలంటే ఆయా సంస్థల్లో నిర్ణీత నిష్పత్తిలో విదేశీ, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకోవాలని యూజీసీ నిబంధనలు విధించింది. దాంతో డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా పొందాలని ఆరాటపడుతున్న విద్యాసంస్థలు నైజీరియా తదితర దేశాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను సకల సౌకర్యాలు కల్పించి మరీ తమ విద్యాసంస్థల్లో చేర్చుకుంటున్నాయి. ఇలా వచ్చే విద్యార్థుల వల్లే విద్యాసంస్థల క్యాంపస్‌లు, హాస్టళ్లు డ్రగ్స్‌కు, ఎయిడ్స్‌ వ్యాప్తికి అడ్డాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page